చుక్కాని లేని జనసేనాని | Sakshi
Sakshi News home page

చుక్కాని లేని జనసేనాని

Published Sat, Apr 6 2024 1:55 AM

This is the third election for the Janasena party - Sakshi

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఒక సిద్ధాంతం లేదు. పార్టీ నిర్మాణం లేదు. ఇవి చాలదన్నట్లు ఆయన కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం ఎబ్బెట్టుగా కనిపిస్తున్నది. అది ఒకటైతే, మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ, తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యి అని ప్రకటించి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటం తన పార్టీ వారికి, తన సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది.

చుక్కాని అంటూ లేని పార్టీ పరిస్థితి ఇంతకు భిన్నంగా ఉంటుందా?స్థాపించి నిండా పది సంవత్సరాలు గడిచినా తన సిద్ధాంతాలు ఏమిటో తెలియని రాజకీయ పార్టీ ఒకటి ఉందంటే నమ్మబుద్ధి కావటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీకి అయినా సిద్ధాంతాలు, లక్ష్యాలు, విధానాలన్నవి చుక్కాని వంటివి. కానీ పవన్‌ కల్యాణ్‌ 2014లో స్థాపించిన జనసేన పార్టీకి నేటి వరకు కూడా ఒక సిద్ధాంత పత్రం ఏమీ లేదు. కనీసం ఎన్నికల సమయంలోనైనా వారు మేనిఫెస్టో ఏదీ ప్రకటించలేదు.

ఆంధ్రప్రదేశ్‌ చారిత్రకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశంలోని ప్రముఖ రాష్ట్రాలలో ఒకటి. అక్కడి అయిదు కోట్లమంది ప్రజలు అనేక రంగాలలో ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో కూడా క్రియాశీలంగా ఉన్న వివేకవంతులు. అటువంటి రాష్ట్రానికి సారథ్యం వహించగోరే ఒక పార్టీ ఇంత దారీ తెన్నూ లేని విధంగా సాగుతుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఇటువంటివి ఆలోచించదగిన విషయాలనే స్పృహ అయినా ఆ పార్టీ అధ్యక్షునికి ఉందా అనే అనుమానం కలుగుతున్నది.

పవన్‌ కల్యాణ్‌ అసలు పార్టీ ఎందుకు పెట్టినట్లు? పెట్టిన ఈ పదేళ్లుగా ఏమి చేసినట్లు? మునుముందు ఏమి చేయాలన్నది తన ఆలోచన? తన మాటలను, చేతలనుబట్టి చూస్తే రాజకీయ పరిశీలకు లకు ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు అయినా స్పష్టమైన సమాధానాలు కన్పించటం లేదు. ఆయన పార్టీ ప్రకటించిన 2014లో ఆంధ్రప్రదేశ్‌ ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడి పోయింది. విభజిత రాష్ట్రం అనేక వనరులను కోల్పోయింది.

రాజ కీయ పార్టీలకు, సాధారణ ప్రజలకు కూడా కొత్త రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా నిలబెట్టాలనేది ఒక పెద్ద సమస్య. అప్పటి పరిణామాలన్నీ వారికి మానసికంగా కూడా కొంత అయోమయాన్ని సృష్టించాయి. అటువంటి స్థితిలో ఏర్పడే ఒక కొత్త రాజకీయ పార్టీ తనదైన విధంగా సమాధానాలను వెతకాలి. వాటిని ఒక సిద్ధాంత పత్ర రూపంలో రూపొందించి ప్రజల ముందుంచాలి. ఆ మేరకు స్వయంగానూ, ఏకీ భావం గల ఇతర పార్టీలు, వర్గాలతోనూ కలిసి కార్యాచరణను చేప ట్టాలి. కానీ ఇటువంటిదేమీ చేయలేదు. నేటికీ చేయటం లేదు.

ఇది ఒక కోణం కాగా, మరొక కోణాన్ని చూద్దాము. పవన్‌ కల్యాణ్‌ సామాజికంగా కాపు వర్గానికి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు, కమ్మల తర్వాత మూడవ బలమైన వర్గం. అయినప్పటికీ రాజకీయాధికారం తమకు లేకుండా పోయిందని, దానిని అందు కోవాలనే కోరిక వారిలో బలంగా ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం గట్టి ప్రయత్నాలు మొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో పి. శివశంకర్‌ ఆధ్వర్యాన జరిగాయి. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణల నుంచి కూడా ఈ సామాజిక తరగతులను కదిలించారు. ఆ ప్రయత్నాలు విఫల మయ్యాయి. తర్వాత చిరంజీవి రాకతో వారిలో తలెత్తిన ఆశలు కూడా ముందుకు సాగలేదు.

ఇపుడు ఆ వర్గానికి చెందిన పవన్‌ కల్యాణ్‌ను వారిలోని కొందరు తమ వాడు అనుకోవటం తప్ప ఆశాభావాలు గత రెండు విడతలలోనూ ఎంత మాత్రం కనిపించటం లేదు. అందుకు ఒక కారణం ఆయన... శివశంకర్, చిరంజీవి వంటి గౌరవ ప్రతిష్ఠలను, నమ్మకాన్ని సంపాదించు కోలేక పోవటం. రెండు – తనలో అటువంటి పరిణతిగానీ, దార్శనికత గానీ ఉన్నా యనే అభిప్రాయం ఆ వర్గం వారికి 2014లో గానీ, తర్వాత ఈ పదే ళ్లలోగానీ ఏర్పడక పోవడం.

మూడు – ఒక పార్టీని సీరియస్‌గా నడిపే ఆలోచన, దక్షత, స్థిరత్వం, వ్యవహార ధోరణి అసలెప్పుడూ కన్పించక పోవటం. నాలుగు – పైన అనుకున్నట్లు తన సిద్ధాంతాలు, విధా నాలు, ప్రణాళికలు, ఆ ప్రకారం ఆచరణలు ఏమిటో అర్థం కాక పోవటం. అయిదు – సినిమాలలో కావలసిన కొన్ని లక్షణాలకు, సీరి యస్‌ రాజకీయాలకు అవసరమైన పద్ధతులకు మధ్య తేడా పాటించక తన విలువను తానే తగ్గించుకోవటం.

దానితో, కాపులలోని యువతరానికి పవన్‌ కల్యాణ్‌ పట్ల ఇతర త్రానూ గల సినిమాటిక్‌ ఆకర్షణ రాజకీయ ఆకర్షణగా మారటం తప్ప, వారిలోని ఇతరులకు ఆయనపై తమనేదో ఉద్ధరించగలడనే ఆశా భావం ఏమీ కలగటం లేదు. గత ఎన్నికల ఫలితాలు ఇందుకొక స్పష్టమైన సూచన. గమనించదగినదేమంటే, ఒకవేళ ఆయన శివశంకర్, చిరంజీవిల వలె తమ సామాజిక వర్గాన్ని, ఇతర బడుగు, బల హీన వర్గాలను కూడదీసే ప్రయత్నం చేసినట్లయితే ఆంధ్ర రాజకీ యాలలో మూడవ ధ్రువం ఏర్పడే అవకాశం ఉండేది. వ్యక్తిగతంగా తనకు ఆ దార్శనికత, సమర్థత ఉన్నట్లు కనిపించదనేది వేరే విషయం.

కానీ కనీసం సూత్రరీత్యా అటువంటి అవకాశం ఉండేది. ఈ పరిస్థితుల దృష్ట్యా పవన్‌ కల్యాణ్‌ గత పది సంవత్సరాలలో ఎటువంటి విలువనూ పెంచుకోలేక పోయారు. తనకు సంబంధించి అంతా సినిమాటిక్‌ గానే కనిపిస్తుంది. జనసేన అనే పేరు, కార్యకర్తలను సైనికులు అనటం, మహిళా సభ్యులను వీర మహిళలనటం, ఎక్కడైనా సమస్య కనిపిస్తే తోకచుక్క తెగిపడినట్లు వచ్చి హడావిడి చేసి మాయమవటం తప్ప అందుకు కొనసాగింపు లేకపోవడం, ప్రసంగాలలో దురుసుతనం, వీరాలా పాలు, అందుకు తగినట్లు సినిమా లలో వలెనే హావభావాలు.

ఈ విధంగా, ఆంధ్రప్రదేశ్‌ వంటి ముఖ్య రాష్ట్రం ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటుండిన దశలో, ఒక సిద్ధాంతం, విధానాలంటూ లేకుండా ఒక పార్టీని నెలకొల్పటం, పదేళ్లయినా అదే పరిస్థితి ఉండటం, రాజకీయాధికారాన్ని కోరుకుంటున్న తన సామాజిక వర్గా నికి ఎటువంటి ఆశాభావాన్ని కల్పించలేక పోవటం, చివరకు పార్టీ నిర్వహణ సైతం గందరగోళంగా సాగుతుండటాన్ని బట్టి, పవన్‌ కల్యాణ్‌ జనసేన ఆంధ్రప్రదేశ్‌లో, నిజమైన అర్థంలో ఒక నికరమైన, స్థిరమైన, సీరియస్‌ రాజకీయ పార్టీ అనే గుర్తింపును, గౌరవాన్ని సంపా దించుకోలేక పోయింది.

సిద్ధాంతాలు, లక్ష్యాల మాట ఇలా ఉంటే, జనసేన అధ్యక్షుని ఎన్నికల వ్యవహరణ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకి. కానీ ఆ విషయంలో డబుల్‌ గేమ్‌ ఆడిన టీడీపీ అ«ధ్యక్షుడు చంద్రబాబును 2014 ఎన్నికలలో బలపరిచారు. చంద్ర బాబు రైతాంగానికి, పేదలకు నష్టం చేసినందున 2004లో, 2009లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తి. అదే విధంగా, రాష్ట్ర విభజ నను పూర్తిగా బలపరచిన బీజేపీతోపాటు అపుడు చంద్రబాబు వెంట నిలబడ్డారు. తర్వాత 2019 ఎన్నికలలో వామపక్షాలతో స్నేహం చేశారు. అప్పటికి అయిదేళ్లు రాజకీయం చేసినా, తన సామాజిక వర్గం పెద్ద సంఖ్యలోగల గాజువాక, భీమవరం స్థానాల నుంచి స్వయంగా పోటీ చేసి కూడా ఓడారు.

అయిదేళ్లలో తన సిద్ధాంతాలేమిటో చెప్ప లేదు. సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం పేరిట తమ వారినీ ఒప్పించ లేక పోయారు. ఆ వర్గానికి కంచుకోటలైన జిల్లాలు అంతటా అదే పరిస్థితి ఎదురైంది.విభజిత ఆంధ్రప్రదేశ్‌కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ తనకు సిద్ధాంతం లేదు. పార్టీ నిర్మాణం లేదు. సోదరుడు చిరంజీవి రాజకీయాలలో ఉండినప్పటిలా తన సామాజిక వర్గంగానీ, ఇతర బడుగు బలహీన వర్గాలుగానీ ఆయనను ఒక ఉద్ధారకునిగా ఏమీ చూడటం లేదు.

అది ఒకటైతే, మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ, తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యి అని ప్రకటించి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటం తన పార్టీ వారికి, తన సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది. తీరా అందులో గెలిచేదెన్ని, తమ కూటమి అధికారానికి రాగలదనే హామీ ఎంత అనేవి ఎవరికీ అంతు పట్టని ప్రశ్నలయ్యాయి. మౌలికంగా చుక్కాని అంటూ లేని పార్టీ పరిస్థితి ఇంతకు భిన్నంగా ఉండగలదా?

- వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు
- టంకశాల అశోక్‌
 

Advertisement
Advertisement