Sakshi News home page

అమెరికాలో తగ్గని ట్రంప్‌ హవా?

Published Sat, Jan 6 2024 3:28 AM

Trump has two types of images in America - Sakshi

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై చాలామందికి సందేహాలు ఉండవచ్చు. కానీ, ఆయనకు దేశంలో మద్దతుదారులు పెరుగుతున్నారనే చెప్పాలి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ట్రంప్‌కు రెండు రకాల ఇమేజ్‌లు ఉండటం.

ఒకవైపేమో చట్టాలను కఠినంగా అమలు చేసే వ్యక్తిగా, సుస్థిర ఆర్థిక వ్యవస్థను అందించగలిగేవాడిగా, యుద్ధాలకు దూరంగా ఉండేవాడిగా చూస్తూంటే... ఇంకోవైపేమో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేవాడిగా, వ్యవస్థలపై దాడి చేసేవాడిగా, దేశ ప్రాథమ్యాలను మార్చేసే వ్యక్తిగా చూస్తున్నారు. ఏమైనా ట్రంప్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్  మాత్రం సర్వేలను నమ్మొద్దనీ, తానే మళ్లీ అధికారంలోకి రానున్నాననీ ధీమాగా చెబుతున్నారు.

అమెరికాలోని ఈశాన్య కారిడార్‌లో ఇటీవల జరిగిన పలు సంభాషణలు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆదరణ పెరిగిన విషయాన్ని నిరూపిస్తాయి. కేంబ్రిడ్జ్‌లోని మసాచూ సెట్స్‌లో తొలితరం అమెరికన్ , హైతీ సంతతి మహిళ తన రోజువారీ కష్టాలను వెళ్లగక్కుతోంది. రెండ్రెండు ఉద్యోగాలు చేస్తున్నా తన ముగ్గురు పిల్లలతో జీవనం దుర్భరమవుతోందని ఆమె వాపోయింది. అంతేకాదు... ఉక్రెయిన్ , ఇజ్రాయెల్‌ యుద్ధాలకు అమెరికా మద్దతుగా నిలవడాన్ని కూడా ప్రశ్నిస్తోంది. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నా మంటూ ఆక్షేపిస్తోంది. అదే సమయంలో దేశంలో అక్రమ చొరబాటు దారులు పెరిగిపోతూండటం కూడా ఆమెకు రుచించడం లేదు.

చట్ట బద్ధంగా దేశంలోకి వస్తున్న వాళ్లు పౌరసత్వం పొందేందుకు ఏళ్ల తరబడి తంటాలు పడుతూంటే, అక్రమ వలసదారులు మాత్రంఎంచక్కా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారన్నది ఆమె ఆరోపణ. ఈ ఆర్థిక, వలసల సమస్యలకు బాధ్యుడు జో బైడెన్  అని ఆమె నిశ్చితా భిప్రాయం. అందుకే తాను ఈసారి ట్రంప్‌కు ఓటేస్తానని చెబుతోంది. ట్రంప్‌పై క్రిమినల్‌ కేసులున్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. వ్యవస్థ తమలాంటి ప్రజల మాదిరే ట్రంప్‌ను కూడా హింసిస్తోందని అంటోంది.

న్యూయార్క్‌లోని ఓ యువ ఊబర్‌ డ్రైవర్‌ ఏమంటున్నాడో చూడండి. డొమినికన్  రిపబ్లిక్‌ నుంచి వలస వచ్చిన ఈ యువకుడు 2016లో ట్రంప్‌కు ఓటేయవద్దని తన మిత్రులందరికీ చెప్పాడు. ఇప్పుడు మాత్రం తన ఆలోచనలు మారిపోయాయని అంటున్నాడు. బైడెన్ ఏలుబడిలో నేరాలు పెరిగిపోయాయని అతడి ఆరోపణ (నిజా నికి  తగ్గాయి). అమెరికా యుద్ధాల్లో చిక్కుకుపోవడం కూడా ఇతడికి ఇష్టం లేదు. బైడెన్  వృద్ధుడు అయ్యాడని ఈ యువకుడి నమ్మకం (బైడెన్‌కు 81 ఏళ్లు. ట్రంప్‌కు 77). జనవరి 6 (2021) ఘటన (క్యాపి టల్‌పై ట్రంప్‌ అనుచరుల దాడి) మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్ప టికీ, వలసదారుల సమస్య అతడిని పీడిస్తోంది.

2022 నుంచి ఇప్పటి వరకూ న్యూయార్క్‌ నగరం దాదాపు 16,000 కాందిశీకుల నివాసానికి అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే పనిభారంతో ఉన్న నగర పరి పాలన వ్యవస్థ మరో 68,000 మంది బాగోగులు చూసుకుంటోంది. ఈ చర్యలు కాస్తా అక్రమ వలసల విషయంలో ప్రజల్లోని వ్యతిరేక భావనలను మరింత పెంచుతున్నాయి. ఈ వ్యతిరేకత అటు డెమొక్రా ట్లతోపాటు ఇటు రిపబ్లికన్లలోనూ కొనసాగుతూండటం గమనార్హం.

వాషింగ్టన్  డీసీలో ఉంటున్న సియెర్రా లియోన్  జాతీయుడి ఆలో చనలు ఎలా ఉన్నాయో చూడండి. 2008లో వలస వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికన్ పౌరుడు. ట్రంప్‌కు ఓటేసేందుకు ఎదురు చూస్తు న్నాడు. ఉక్రెయిన్ , ఇజ్రాయెల్‌లకు అమెరికా ఎందుకు మద్దతిస్తోందో ఇతడికి అర్థం కావడం లేదు. బైడెన్  చాలా యుద్ధాలు చేస్తున్నాడంటాడు. ట్రంప్‌ అధికారంలోకి వస్తే ఇజ్రాయెల్‌కు మద్దతు మరింత పెరుగుతుందన్న వాదనను తిప్పికొడుతున్నాడు. బైడెన్ ఏలుబడిలో రోజువారి వెచ్చాల ధరలు, అద్దెలు పెరిగిపోయాయనీ, ఆఫ్రికా దేశపు వ్యక్తిగా, ముస్లింగా జాతి వివక్ష విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో తేడా ఏమీ లేదంటాడు.

రిపబ్లికన్ల వైపు అనూహ్య మొగ్గు
ఎక్కడైనా సరే, రాజకీయ వాతావరణం ఎలా ఉందో తెలుసు కోవాలంటే ఆయా పార్టీల మూలభూతమైన మద్దతుదారులు నమ్మ కంగా ఉన్నారా, లేదా? అన్నది ఒక ప్రామాణికమవుతుంది. తన ప్రాబ ల్యాన్ని విస్తరించుకోవడం ఇంకో కొలమానం. ఇప్పటివరకూ చెప్పు కున్న సంభాషణలన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే ట్రంప్‌కు ప్రాథమిక స్థాయిలో ఉన్న ఆదరణ తగ్గలేదు సరికదా... ఎంతో కొంత పెరిగిందని స్పష్టమవుతుంది. హైతి, డొమినికన్  రిపబ్లిక్, సియెర్రా లియోన్ లకు చెందిన అమెరికన్  పౌరులు ట్రంప్‌ మద్దతుదారులుగా మారతారని ఎవరూ ఊహించరు. అయితే సర్వేలు, ఇతర అంశాలను పరిశీలిస్తే స్పానిష్, నల్లజాతీయుల్లో ఒక వర్గం కూడా నెమ్మదిగానైనా డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్ల వైపునకు మొగ్గుతున్నట్లు తెలుస్తుంది. 

జాతి ఆధారిత సమూహాలను కాసేపు పక్కనబెడితే... మిగిలిన వర్గాల్లో మాత్రం ట్రంప్‌ మాటలు బలమైన ముద్రే వేశాయని చెప్పాలి. కొంత తప్పుడు సమాచారం, ఎన్నికల సంవత్సరంలో జోబైడెన్  ప్రభుత్వ పోకడలపై నెలకొన్న అసంతృప్తి వీటికి ఆజ్యం పోస్తున్నాయి.  వేర్వేరు వర్గాలు ట్రంప్‌ నుంచి వేర్వేరు రకాల సందేశాలు అందుకుంటున్నాయి.  ఒక్కటైతే వాస్తవం. ట్రంప్‌ ఆదరణ పైపైకి పోతోంది. కాక పోతే ఇందుకు భిన్నమైన పార్శా్వలు ఉన్నాయి. 

బాగున్న బైడెన్‌ రికార్డ్‌
మొదటిది... ప్రస్తుతమున్న ప్రజల మూడ్‌ ఈ క్షణానికి సంబంధించింది మాత్రమే. ప్రచారం చేసేవారికి ఫీడ్‌బ్యాక్‌ లూప్‌గా ఉపయో గపడుతుంది కానీ విలువ తక్కువ. 2024 నవంబరులో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ట్రంప్‌ మళ్లీ ఈ స్థాయిలో పుంజుకుంటా డని గత ఏడాది ఎవరు ఊహించారు?

రెండు... ట్రంప్‌ ఎదుర్కొంటున్న కేసులు పెద్ద సవాళ్లే విసర నున్నాయి. కొలరాడో, మైన్ లలో నమోదైన కేసుల్లో ఓటుపై నిషేధం పడటం ట్రంప్‌కు లాభిస్తోంది. బాధితుడిగా ప్రచారం చేసుకుంటు న్నారు. సుప్రీంకోర్టు ఈ తీర్పులను రద్దు చేయవచ్చు. కానీ ఓ పార్టీ తరఫున అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వ్యక్తి నాలుగు క్రిమినల్‌ శిక్షలు ఎదుర్కొంటున్నాడన్నా, పోలింగ్‌ రోజుకు ముందు మరిన్ని కేసులు ఎదుర్కునే అవకాశం ఉందన్నా దాని ప్రభావం ఓటింగ్‌పై కచ్చితంగా ఉంటుంది. 

మూడు... బైడెన్  స్థానిక ఎన్నికల ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయినప్పటికీ 1973లో తొలిసారి సెనేటర్‌గా ఎన్నికై అంచ లంచెలుగా ఎదిగిన బైడెన్ ఇలాంటి స్థితి నుంచి బయటపడటం చాలా సార్లు చూశాము. పాలన విషయంలో ఆయనపై ఎలాంటి మచ్చ లేకపోవడం, కోవిడ్‌ నుంచి సమర్థంగా బయటపడటం, ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి వంటి అంశాల్లో చక్కటి సమ తౌల్యం కనిపిస్తూండటం బైడెన్ కు కలిసివచ్చే అంశాలు. ఈ చర్య లన్నింటి ఫలితం కూడా వడ్డీరేట్లు, ధరలు తగ్గడంలో ప్రతిఫలిస్తోంది. అదే సమయంలో మార్కెట్‌ కూడా పుంజుకుంటూండటం గమనార్హం. మౌలిక సదుపాయాలు, వాతావరణం, తయారీ రంగాలకు సంబంధించి బైడెన్  ఇప్పటికే విప్లవాత్మకమైన కొన్ని చట్టాలను ఆమోదింప జేసుకున్నారు. 

బైడెన్ కు ఇంకో రెండు సానుకూల అంశాలున్నాయి. అబార్షన్ పై వచ్చిన తీర్పు విషయంలో రిపబ్లికన్లపై బోలెడంత వ్యతిరేకత ఉంది. ట్రంప్‌ ఒంటెత్తు పోకడలపై కూడా ప్రజల్లో అభ్యంతరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ యుద్ధం కొంతమంది వామపక్ష, ముస్లింల ఉత్సాహాన్ని దెబ్బకొట్టినప్పటికీ, యూదుల మద్దతు బైడెన్ కు లభించేలా చేసింది. అందుకేనేమో బైడెన్  చైనా అధ్యక్షుడికి సైతం సర్వేలను నమ్మొద్దనీ, తానే మళ్లీ అధికారంలోకి రానున్నాననీ ధీమాగా చెప్పారు.

చివరగా... అమెరికాలోని రెండు పార్టీలకూ దాదాపుగా సమ స్థాయిలో మద్దతు ఉంది. అందుకే అమెరికాను 47 శాతం– 47 శాతం దేశమంటారు. రాష్ట్రాలకు రాష్ట్రాలు అటు ఇటో మొగ్గి ఉంటాయి. అన్ని అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అటు ఇటూ మారిపోయే ఆరు లేదా ఏడు స్వింగ్‌ స్టేట్స్‌పై ఆధారపడి ఉంటాయి. అరిజోనా, నెవడా, మిషిగన్ , విస్‌కాన్సిన్ , జార్జియా, పెన్సెల్వేనియాల్లోని కొన్ని వేలమంది ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారన్న అంశంపై అధ్యక్షుడి ఎన్నిక ఆధారపడి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ఉందని చెప్పకతప్పదు.

వ్యాసకర్త వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

- ప్రశాంత్‌ ఝా

Advertisement
Advertisement