‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం | Sakshi
Sakshi News home page

‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం

Published Mon, Mar 14 2022 11:51 AM

What Right is The Right to Petition - Sakshi

1215లో మెగ్నా కార్టా అనే హక్కుల ప్రకటన ఉద్యమం ప్రారంభం అయినప్పుడు మొట్టమొదట అడిగిన హక్కు ‘అడిగే హక్కు’. దాన్ని ‘రైట్‌ టు పిటిషన్‌’ అంటారు. అడిగే హక్కు ప్రాణ హక్కు కన్నా గొప్పదా అంటే సమాధానం... అవును. అడిగే హక్కు ఒక్కటి ఇస్తే అందులో ప్రాణ హక్కు అడుగుతాం, అభివృద్ధి హక్కు అడుగుతాం. ఇంకేం కావాలన్నా అడగవచ్చు. ఆ అడిగే హక్కు ఇప్పుడు భావప్రకటనా స్వాతంత్య్రం.‘‘నాకు తెలుసుకునే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, అంతరాత్మ చెప్పినట్టు వాదించే స్వేచ్ఛ ఇవ్వు. అదే అన్నిటికన్నా గొప్ప స్వేచ్ఛ’’ అంటాడు మిల్టన్‌.

అభిప్రాయాలు, ఆలోచనలు అందరికీ ఉంటాయి. కనుక చెప్పే హక్కు సహజమైన హక్కే. చెప్పిందే చెప్పినా ఫరవాలేదు, చెబుతూ పోవడమే కర్తవ్యం. చెప్పకుండా నోరుమూసుకుని కూర్చుంటే అన్ని అన్యాయాలను ఆమోదించినట్టే! మౌనం అర్ధాంగీకారం అంటారు. కాదు. మౌనం సంపూర్ణాంగీకారం...

ఉక్రెయిన్‌పై రష్యా దౌర్జన్య యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదించినపుడు ఎన్నడూ లేని సమైక్యత పాటించిన మనమూ, మన ఇరుగు పొరుగూ... పాకిస్తాన్, చైనా; మరో 32 దేశాలు తటస్థంగా ఉన్నాయి. దాని అర్థం రష్యా మానవ హనన సమరాన్ని సంపూర్ణంగా సమర్థించినట్టే. ఇది దురదృష్టకరం. కనీసం ఇకనైనా యుద్ధాన్ని ఆపాలని అడిగి... ధర్మం, న్యాయం పాటిస్తే బాగుండేది. మానవత్వపు విలువల వలువలను దుశ్శాసనులు ఊడదీస్తుంటే భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మౌనం పాటించడాన్ని తటస్థవైఖరి అంటారా ఎవరైనా? తటస్థ వైఖరి వల్ల ఎవరికి లాభమో వారిని సమర్థించినట్టే. మౌనం కూడా ఒక వ్యాఖ్యానమే, భావవ్యక్తీకరణే.

ఐక్యరాజ్యసమితి 1948 మానవ హక్కుల ప్రకటన ఆర్టికల్‌ 19లో భావవ్యక్తీకరణ సహజ హక్కును గుర్తించింది. ప్రతి వ్యక్తీ అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కూ, వ్యక్తం చేసే హక్కూ కలిగి ఉంటాడు. ఉండాలి. మనిషికి ప్రతివాడి గురించీ తీర్పులు ఇవ్వడం అలవాటు. సోషల్‌ మీడియాలో బాధ్యతారహితమైన తీర్పులు ఇస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. వీటి వల్ల ఈ స్వేచ్ఛకే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. 

అంబేడ్కర్‌ తన ఆలోచనా స్వేచ్ఛనూ, అనుభవాల నుంచి నేర్చుకున్న అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛనూ విరివిగా వాడుకున్నారు. లాహోర్‌ తీర్మానం (1940)లో ముస్లింలీగ్‌ పాకిస్తాన్‌ వేర్పాటును డిమాండ్‌ చేసిన తరువాత అంబేడ్కర్‌ 400 పేజీలలో ‘థాట్స్‌ ఆన్‌ పాకిస్తాన్‌’ అనే పుస్తకం రాశారు. అందులో పాకిస్తాన్‌ అనే బీజం పుట్టుక, వికాసం గురించి విశ్లేషించారు. హిందువులు పాకిస్తాన్‌ను ముస్లింలకు ఇవ్వాలని వాదించారు. పంజాబ్, బెంగాల్‌ ప్రదేశాలను హిందూ ముస్లిం నివాసాలను బట్టి పునర్విభజించాలని సూచించారు. ఒక దశాబ్దం పాటు ఈ ఆలోచనలు అనేక చర్చలకు దారితీశాయి. ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలకు అంబేడ్కర్‌ ఆలోచనలు ప్రాతిపదిక అయినాయి. చివరకు భారతదేశ విభజన తప్పలేదు.

అభిప్రాయ ప్రకటన హక్కులో ఎవ్వరి జోక్యం లేకుండా అభిప్రాయాలను కలిగి ఉండడం, ప్రాదేశిక హద్దులకు అతీతంగా ఏ మాధ్యమం ద్వారానైనా సమాచారాన్నీ, అభిప్రాయాలనూ అడిగి, స్వీకరించి, బోధించే స్వాతంత్య్రం ఈ హక్కులో ఉంటాయని ఆర్టికల్‌ 19 వివరిస్తుంది. 

సహజ హక్కు అంటే ప్రజలందరికీ ఉండాలి. కానీ మన రాజ్యాంగం పౌరులకు మాత్రమే ఈ హక్కు పరిమితం చేసింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం తను పౌరుడినని రుజువు చేసుకోలేకపోతే ఆ భారతీయుడు కోల్పోయే తొలి ప్రధానమైన హక్కు ఇదే. (చదవండి: అకడమిక్‌ బ్యాంకు క్రెడిట్‌.. విద్యార్థికి మేలే గానీ...)

 ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన... వ్యక్తులందరికీ ఈ స్వేచ్ఛ ఉండాలనీ, అనేక మాధ్యమాలు ఉండవచ్చుననీ, ఈ స్వేచ్ఛకు దేశాల సరిహద్దులు ఉండవనీ, ఇందులో సమాచార హక్కు, ఇతరుల నుంచి సమాచారం పొంది ఇతరులకు పంచే హక్కు కూడా ఉంటాయనీ; ఇతరుల అభిప్రాయాలు కోరి, విని, స్వీకరించి, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఉంటుందనీ వివరించింది. అభిప్రాయ స్వేచ్ఛకు చాలా విస్తృతి ఉన్నది. మన రాజ్యాంగంలో ఈ హక్కుపై చాలా పరిమితులు ఉన్నాయి. మొదటి పరిమితి కేవలం పౌరులకే ఇవ్వడం. ఇందులో సమాచార హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో చెప్పింది. 2005 దాకా దాన్ని పట్టించుకోలేదు.

విభిన్న స్థాయుల్లో శాస్త్రీయ పరిశోధన చేసేందుకు, ప్రచురించేందుకు తగిన స్వేచ్ఛ ఉండాలి. దాన్ని శాస్త్రీయ స్వేచ్ఛ అంటారు. 1766లో పత్రికా స్వేచ్ఛ చట్టాన్ని స్వీడన్‌ అమలు చేసింది. ఇదే సమాచార హక్కును కూడా 1766లోనే ఇచ్చింది. 

1947 ఆగస్టు 15న మనదేశం స్వతంత్రం సంపాదించింది. కానీ చాలాకాలం డొమినియన్‌గా ఉండింది. భారతీయ జన గణ మన తంత్రం అప్పటికి ఆవిర్భవించలేదు. స్వతంత్రం గణతంత్రంతోనే సంపూర్ణమవుతుంది. గణతంత్రం లేకపోతే సొంత తంత్రమేదీ ఉండదు. స్వతంత్రం కూడా ఉండదు. చెదురు మదురుగా ఉన్న జనం సాధికారిక పాలకులుగా నాయకత్వం స్వీకరించడానికి కొన్ని వ్యవస్థలు ఉండాలి. విధానాలు ఏర్పడాలి. ప్రక్రియ ఉండాలి. పద్ధతులు ఏర్పడాలి. అప్పుడు జనతంత్రం గణతంత్రంగా పరిణమిస్తుంది. నిర్ణీత గణతంత్ర విధానాల సమగ్ర నిర్మాణం ద్వారా మాత్రమే మనం స్వతంత్రం కాపాడుకోగలం.

- మాడభూషి శ్రీధర్‌  
స్కూల్‌ ఆఫ్‌ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ    

Advertisement
Advertisement