Sakshi News home page

Published Thu, Mar 2 2023 1:20 AM

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఐజీ త్రివిక్రమ్‌వర్మ, ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌  - Sakshi

నగరంపాలెం(గుంటూరు): గుంటూరు నగరంలో సంచలనం రేకెత్తించిన ఇద్దరు వాచ్‌మెన్ల హత్య కేసుల్లో ఇద్దరు మైనర్లను గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరిలో ఒకరు పాత నేరస్తుడు. వారి నుంచి ఒక గడ్డ పలుగు, హెల్మెట్‌, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ వెల్లడించారు. మంగళవారం రాత్రి అరండల్‌పేటలో ఓ దుకాణ షట్టర్లు పగులగొట్టారని డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పారన్నారు. దీంతో అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌ రక్షక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. చోరీకి యత్నించిన వారి వెంటపడగా, రెప్పపాటులో తప్పించుకున్నారు. బుధవారం తెల్లవారుజాము సమయంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌, అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు వాచ్‌మెన్లు హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో ఒక ముఠాగా ఏర్పడి హత్యలు చేసి ఉంటారని దర్యాప్తు వేగవంతం చేశారు. దీంతో సీసీ టీవీ పుటేజీ, వేలిముద్రలు, సెల్‌ఫోన్‌ల ఆధారంగా విచారించారు. తూర్పు, దక్షిణ, పశ్చిమ సబ్‌ డివిజన్లలోని ఎనిమిది పోలీస్‌ బృందాలతో పాటు సీసీఎస్‌, ఐటీ కోర్‌ బృందాలు కూడా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. పట్టాభిపురం పీఎస్‌ పరిధిలో గతంలో జరిగిన దొంగతనాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. దీంతో గుంటూరు నగరంలోని కోబాల్డుపేటకు చెందిన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిద్దరూ కలిసికట్టుగా ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఏ–1గా ఉన్న వ్యక్తిపై ఐదు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. చిల్లర దుకాణాలు, బడ్డీ దుకాణాలు, మెడికల్‌ షాప్‌ల తాళాలు పగులకొట్టి నేరాలకు పాల్పడేవాడు. గతంలో అరెస్ట్‌ చేయగా, ఇటీవల బయటకు వచ్చి ఈ ఘోరాలకు పాల్పడ్డాడని చెప్పారు. 12 గంటల వ్యవధిలో హత్య కేసులను ఛేదించామన్నారు.

Advertisement
Advertisement