వరికపూడిసెలకు అన్ని అనుమతులూ సాధిస్తాం | Sakshi
Sakshi News home page

వరికపూడిసెలకు అన్ని అనుమతులూ సాధిస్తాం

Published Tue, Apr 11 2023 1:28 AM

-

వెల్దుర్తి: పల్నాడు ప్రజల చిరకాల వాంఛ వరికపూడిసెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులనూ సాధిస్తామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. మండలంలోని గుండ్లపాడు గ్రామంలో రూ.25 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని సోమవారం పిన్నెల్లి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏడు దశాబ్దాల నుంచి నిరీక్షిస్తున్న వరికపూడిసెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నెల రోజులలోనే అనుమతులు తీసుకొచ్చేందుకు నర్సరావుపేట పార్లమెంట్‌ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ పథకం నిర్మాణానికి రూ.1,273 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. గతంలో శ్రీశైలంలో పెరిక సామాజికవర్గ అన్నదాన సత్రం స్థలం కోసం ఎన్ని యత్నాలు జరిగినా ఫలితం లేకపోయిందని, సీఎం జగన్‌ ప్రభుత్వం ఏర్పడగానే సత్రం నిర్మాణం కోసం 50 సెంట్ల స్థలాన్ని మంజూరు చేయించి కమిటీ సభ్యులకు అప్పగించామని గుర్తుచేశారు. గుండ్లపాడు గ్రామస్తులకు నాలుగేళ్లలో రూ.20.61 కోట్ల మేర ప్రయోజనం కల్పించామని, ఊరగుంట అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేయించామని పేర్కొన్నారు. రైతులకు గోడౌన్‌ను నిర్మించేందుకు రూ.15 లక్షల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు. అనంతరం గుండ్లపాడు గ్రామ పంచాయతీ ఇన్‌చార్జి సర్పంచ్‌గా తోట నారాయణ పదవీబాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సర్పంచ్‌గా పనిచేసిన తోట వెంకయ్య దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళటంతో నారాయణను ఎంపీడీఓ ప్రసాద్‌ ఇన్‌చార్జి సర్పంచ్‌గా నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే పీఆర్కే పెద్దమనుషుల ఒప్పందాన్ని గౌరవించిన వెంకయ్యను, కొత్తగా బాధ్యతలు చేపట్టిన నారాయణను అభినందించి సన్మానించారు.

Advertisement
Advertisement