‘ఐపీఎస్‌ కావాలన్నది నాన్న కల. అందుకే ఇష్టంతో కష్టపడి సాధించా’ | Sakshi
Sakshi News home page

‘ఐపీఎస్‌ కావాలన్నది నాన్న కల. అందుకే ఇష్టంతో కష్టపడి సాధించా’

Published Thu, May 18 2023 1:40 AM

- - Sakshi

పట్నంబజారు(గుంటూరు): ‘నేను ఐపీఎస్‌ కావాలన్నది నాన్న కల. అందుకే ఎంతో ఇష్టంతో కష్టపడి ఐపీఎస్‌ సాధించా.’ అని గుంటూరు ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏఎస్పీ) నిచికేత్‌ షలేకే చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

బాల్యం, చదువు
మా తల్లిదండ్రులు విశ్వనాథ్‌, చంద్రసేన ఇద్దరూ ఉపాధ్యాయులే. మేము ఇద్దరం సంతానం. నేను పెద్దవాడిని. తమ్ముడు సివిల్‌ ఇంజినీర్‌. మహారాష్ట్రలోని పూణే సమీపంలోని ప్రింళై మా స్వగ్రామం. అక్కడ దగ్గర పట్ణణంలోనే నా చదువు అంతా పూర్తయింది. నా చిన్నప్పటి నుంచే నేను ఐపీఎస్‌ కావాలని నాన్న కలలు కనేవారు.

ఐపీఎస్‌కు సిద్ధం ఇలా..
ఐపీఎస్‌ కోసం ఎంతో కష్టపడ్డాను. మా గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళి చదువుకునేవాడిని. ముందు రెండుసార్లు సివిల్స్‌కు యత్నించి విఫలమయ్యాను. అయినా పట్టుదల విడిచి పెట్టలేదు. కచ్చితంగా ఐపీఎస్‌ సాధించి తీరాలని 2019లో ప్రయత్నించి సెలెక్ట్‌ అయ్యాను.

ఎక్కడెక్కడ పనిచేశానంటే..
ఐపీఎస్‌ సెలెక్ట్‌ అయ్యాక కొద్ది రోజుల పాటు అకాడమీ, ఒడిశాల్లో శిక్షణ పొందాను. విధులు, బాధ్యతల గురించి తెలుసుకున్నాను.

తొలి పోస్టింగ్‌ ఇక్కడే
నాకు తొలి పోస్టింగ్‌ గుంటూరులోనే రావడం ఆనందంగా ఉంది. గుంటూరు ఈస్ట్‌ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టా. నేరాల నియంత్రణకు కృషి చేస్తా. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం. చోరీల నియంత్రణకు చర్యలు చేపడతాం. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజలు నన్ను నేరుగా కలవచ్చు. నా కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉంటా. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

Advertisement
Advertisement