ఆటంకాలు అధిగమించి.. పీహెచ్‌డీ సాధించి.. | Guntur Auto Driver Wife Sheela Completed Her PHD With The Help Of Her Husband, Inspiring Story Inside - Sakshi
Sakshi News home page

Guntur PHD Woman Inspiring Story: ఆటంకాలు అధిగమించి.. పీహెచ్‌డీ సాధించి..

Published Tue, Aug 29 2023 1:50 AM

- - Sakshi

గుంటూరు: తనకు చదువుల దాహం... సహకరించని ఆర్థిక పరిస్థితులు.. పెళ్లితో డిగ్రీ ఫస్టియర్‌లోనే చదువుకు బ్రేక్‌ పడింది. ఆటోడ్రైవర్‌ భర్త భరో సాతో చదువు ఆరంభించినా అదే సమస్యపై మళ్లీ అవాంతరం. అయినా నిరాశతో కుంగిపోలేదు. ఇద్దరి బిడ్డల ఆలనపాలనా చూస్తునే అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ, ఏదొక ఉద్యోగం చేస్తూ డిగ్రీ, పీజీనే కాదు.. ఏకంగా పీహెచ్‌డీ సాధించింది.అధ్యాపకురాలిగా పనిచేస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం జరిగిన 40వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ను స్వీకరించింది.

ఆ మహిళ విజయప్రస్థానమిది...
ఆ చదువుల తల్లి పేరు ఈపూరి షీల. తెనాలి రూరల్‌ మండల గ్రామం పెదరావూరు. చిన్నతనంలోనే తల్లి మరణించారు. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదివింది. తెనాలిలో ఇంటర్‌ తర్వాత జేఎంజే మహిళా కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుండగా, 2003లో ఆటోడ్రైవర్‌ రావూరి కరుణాకర్‌తో పెద్దలు వివాహం చేశారు. చదువుకుంటానని అడిగిన భార్య కోరికను మన్నించిన భర్త ప్రోత్సహించాడు. రెండేళ్లు చదివాక ఫైనలియర్‌లో మళ్లీ ఆర్థిక ఇబ్బందులు సహ కరించ లేదు. ఉపాధికోసం 2004లో అక్షరదీప్తి పథకంలో ప్రేరక్‌గా చేరారు. అయినా చదువు‘కొన’లేకపోయారు.

2008లో ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన కంప్యూటర్‌ శిక్షణలో చేరి, పీజీడీసీఏ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, డిగ్రీ అర్హత లేకపోవటంతో వెనుదిరగాల్సి వచ్చింది. అర్థం చేసుకున్న భర్త, పిల్లలతోపాటు భార్యనూ చదివించారు. ఫలితంగా 2009లో డిగ్రీ ఫైనలియర్‌ పూర్తిచేశారు షీల. తెనాలిలో గుప్తా కాలేజీలో కామర్స్‌లో పీజీ చేశారు.

ఎయిడెడ్‌ కాలేజీలో లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తు చేస్తే, పీహెచ్‌డీ తప్పనిసరిగా చెప్పటంతో పీజీ చేసిన కాలేజీలోనే అధ్యాపకురాలిగా పనిచేయసాగారు. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్‌యూఆర్‌సీటీ నోటిఫికేషన్‌ వచ్చింది. భర్త కరుణాకర్‌ ప్రోత్సాహంతో దరఖాస్తు చేసింది. యూనివర్సిటీలో డాక్టర్‌ ఎన్‌.రత్నకిషోర్‌ గైడ్‌గా ఫుల్‌టైం రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఆర్థిక సమస్యలతో ఆగిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ 2016లో రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌కు ఎంపికవటం కలిసొచ్చింది.

రోజూ యూనివర్సిటీకి వెళుతూ అక్కడి లైబ్రరీలో చదువుకుంటూ 2016 సెప్టెంబరులో ఏపీసెట్‌ అర్హత సాధించారు. దూరవిద్యలో మాస్టర్‌ డిగ్రీ ఎంహెచ్‌ఆర్‌ఎంను 2017లో పూర్తిశారు. అదే ఏడాది ఎంఫిల్‌ నుంచి పీహెచ్‌డీకి కన్వర్షన్‌ జరిగిందని షీల చెప్పారు. గతేడాది ఆఖరులో ‘సర్వీస్‌ క్వాలిటీ ఇన్‌ హెల్త్‌కేర్‌ సెక్టార్‌’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఆ థీసిస్‌కు గత జులై 4న పీహెచ్‌డీ లభించింది. యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో మంగళవారం డాక్టరేట్‌ను అందుకోనున్నారు. ప్రస్తుతం షీల స్థానిక వీఎస్సార్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కాలేజీలో కామర్స్‌ అధ్యాపకురాలిగా చేస్తున్నారు. ఆగిపోయిన చదువు ఇక్కడిదాకా వస్తుందనీ, డాక్టరేటు సాధిస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలన్నదే తన ఆశయంగా వివరించారు.

సందర్భంగా...
‘గమ్యం సాధించాలనుకునే వ్యక్తి అలుపెరగడు. విజయం సాధించాలనుకునే వ్యక్తి నిరాశ చెందడు’. అలాగే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం / ప్రతి నీడకు ఒక వెలుగు / ప్రతి బాధకు ఓ ఓదార్పు ఉంటుంది / కాకపోతే విశ్వాసం కోల్పోకుండా మనవంతు ప్రయత్నం చేయాలి’ అని పెద్దల మాట. ఈ మాటలు చక్కగా అన్వయమవుతాయి పెదరావూరుకు చెందిన ఈపూరి షీల విషయంలో. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో చదువును కొనసాగించింది. తట్టుకోలేని కష్టాలు తారసపడ్డా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న పీహెచ్‌డీని సాధించింది. ‘పాండిత్యం ఉన్నవాడు శిఖరాన్ని చేరతాడు/వ్యక్తిత్వం ఉన్నవాడు శిఖరం మీద చిరస్థాయిగా నిలుస్తాడు’ అని చెప్పినట్లుగా ఆమె ప్రస్థానం అభినందనీయం. ఆమె చేరిన శిఖరం గురించి అందిస్తున్న కథనం.

Advertisement

తప్పక చదవండి

Advertisement