Sakshi News home page

మెరి‘సాయి దివ్య’ ప్రయోగాలు

Published Thu, Oct 5 2023 1:34 AM

- - Sakshi

తెనాలి: తెనాలికి చెందిన బుల్లి ఉపగ్రహాల రూపశిల్పి కొత్తమాసు సాయిదివ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాను రూపొందించిన క్యూబ్‌శాట్‌–బీడబ్ల్యూశాట్‌ను స్పెయిన్‌ దేశంలో అక్కడి బీ2 స్పేస్‌ కంపెనీ సాయంతో బుధవారం స్ట్రాటో ఆవరణలోకి ప్రయోగించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ రంగంంలో పీహెచ్‌డీ స్కాలర్‌ అయిన సాయిదివ్య ప్రయోగించిన పేలోడ్లలో ఇది మూడోది కావటం విశేషం. 280 గ్రాముల ఈ పేలోడ్‌ను ఇక్కడి తన సొంత ‘ఎన్‌–స్పేస్‌టెక్‌’ అనే సంస్థలో తన బృందంతో కలిసి ఆమె తయారుచేశారు.

ఇదీ నేపథ్యం
శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ రంగంలో రీసెర్చ్‌ స్కాలర్‌గా పనిచేస్తున్న కొత్తమాసు సాయిదివ్య బాపట్ల ఇంజినీరింగ్‌ కాలేజిలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చేశారు. కేఎల్‌ యూనివర్సిటీలో కమ్యూనికేషన్‌ అండ్‌ రాడార్‌ సిస్టమ్స్‌లో ఎంటెక్‌ చేశారు. తన థీసిస్‌లో భాగంగా తన నివాసంలోనే ‘ఎన్‌–స్పేస్‌టెక్‌’ అనే సొంత కంపెనీని ఆరంభించారు.

అంతరిక్ష సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావ టం, తక్కువ ఖర్చుతో బుల్లి ఉపగ్రహాల తయారీని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తొలిగా లక్ష్యశాట్‌ పేరుతో క్యూబ్‌శాట్‌ను తయారుచేసి, గతేడాది మార్చిలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి బీ2 స్పేస్‌ సహకారంతోనే స్ట్రాటో ఆవరణలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్‌ సాయంతో పంపిన 400 గ్రాముల లక్ష్యశాట్‌, భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి, స్ట్రాటో అవరణలో కొన్ని గంటల ఉండగలిగింది.

ప్రైవేట్‌ ర్యాకెట్‌ ప్రయోగంలో భాగస్వామి
తర్వాత కొద్దినెలల్లోనే దేశంలో జరిగిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగంలో సాయిదివ్య భాగస్వామి కాగలిగారు. స్కై రూట్‌ అనే ప్రైవేటు సంస్థ విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సబ్‌ ఆర్బిట్‌లోకి ప్రయోగించారు. ఆ రాకెట్‌ తీసుకెళ్లిన మూడు పేలోడ్లలో తెనాలిలో సాయిదివ్య రూపొందించిన లక్ష్యశాట్‌–2 పేలోడ్‌ ఒకటి కావటం గమనించాల్సిన అంశం.

స్ట్రాటో ఆవరణలో అధ్యయనానికి బీడబ్ల్యూశాట్‌
ఆ క్రమంలోనే సాయిదివ్య తమిళనాడుకు చెందిన శక్తిప్రియ, బాపట్ల, కాకినాడలకు చెందిన రెహమాన్‌, ఉత్తేజ్‌తో కలిసి బీడబ్ల్యూశాట్‌ను తయారుచేశారు. మయన్మార్‌ దేశంలోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులకు శాటిలైట్‌ టెక్నాలజీపై వీరు ఇక్కణ్ణుంచే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ బోధనలో భాగంగానే తయారుచేసిన బీడబ్ల్యూశాట్‌ను మయన్మార్‌ తీసుకెళ్లి అక్కడి విద్యార్థులకు ప్రదర్శించారు. డిమాన్‌స్ట్రేషన్‌ ఇచ్చారు.

అనంతరం బీ2 స్పేస్‌ కంపెనీ సహకారంతో స్పెయిన్‌లో ప్రయోగించారు. తాజా పేలోడ్‌తో స్ట్రాటో ఆవరణంలోని ఉష్ణోగ్రత, తేమ, ఆల్డిట్యూడ్‌ ప్రెషర్‌, యూవీ ఇంటెన్సిటీ, ఎంత వెలుతురు ఉంది అనే డేటా సేకరణ వీలవుతుందని బుధవారం సాయంత్రం సాయిదివ్య స్థానిక విలేకరులకు తెలిపారు. స్కైరూట్‌ సంస్థతో కలిసి త్వరలో జరగనున్న విక్రమ్‌–1 రాకెట్‌ ప్రయోగంలో భాగస్వామ్యం కానున్నట్టు చెప్పారు. రాకెట్‌లో ప్రయోగించే ఐయూ క్యూబ్‌శాట్‌ పేలోడ్‌ రూపకల్పనలో ఉన్నట్టు వివరించారు. తన తొలి పేలోడ్‌ నుంచి ఇప్పటివరకు తన భర్త రఘురామ్‌, అత్తమామలు కొత్తమాసు కుమార్‌, చంపకవల్లి, తండ్రి కేఎన్‌ ప్రసాద్‌ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement