‘జగనన్నకు చెబుదాం’.. ప్రతిష్టాత్మకం | Sakshi
Sakshi News home page

‘జగనన్నకు చెబుదాం’.. ప్రతిష్టాత్మకం

Published Thu, Nov 16 2023 1:46 AM

- - Sakshi

తాడేపల్లిరూరల్‌: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేవిధంగా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. బుధవారం మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోని తాడేపల్లి పట్టణ రూరల్‌ ప్రాంతాలకు సంబంధించి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని తాడేపల్లి బైపాస్‌రోడ్‌లోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, సంయుక్త కలెక్టర్‌ రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, ఎంటీఎంసీ కమిషనర్‌ నిర్మల్‌ కుమార్‌, తాడేపల్లి తహసీల్దార్‌ ఎం.నాగిరెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారుల ముందే సంబంధిత శాఖ అధికారులతో చర్చించి ఆ సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరిస్తున్నామని అన్నారు.

ప్రజాసమస్యలపై అర్జీ ..

వైఎస్సార్‌ సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌ రాజు, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు మున్నంగి వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణ రూరల్‌పరిధిలో ఉన్న పలు సమస్యలపై అర్జీలను అందజేశారు.

తాడేపల్లి పట్టణ పరిధిలో సీతానగరం కృష్ణానది ఒడ్డున ఉన్న కార్పొరేషన్‌ రేకుల షెడ్డులో స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని తాడేపల్లి మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి అర్జీని అందజేశారు. కార్యక్రమంలో తాడేపల్లి మండల ప్రత్యేక అధికారి మహబూబ్‌ బాషా, పీడీ డీఆర్‌డీఏ హరిహరనాథ్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూధనరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు, పశు సంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఉమామహేశ్వరరావు, సీపీఓ శేషశ్రీ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాబాయి, ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, ఉద్యాన శాఖ ఏడీ రవీంద్రబాబు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణబాబు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగంలో విజయాలకు అడ్డదారులుండవు

గుంటూరు వెస్ట్‌: ఉద్యోగంలో విజయాలు సాధించాలంటే కష్టపడి, నిజాయితీతో పనిచేయడం ఒక్కటే మార్గమని, అడ్డదారులుండవని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. ఇటీవల రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు సాధించిన జూనియర్‌ అసిస్టెంట్లకు మూడు రోజుల శిక్షణ తరగతులు బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు అతి దగ్గరగా ఉండి సేవలందించేది రెవెన్యూ శాఖన్నారు. ఇక్కడ పని నేర్చుకోవడానికి, సేవ చేయడానికి ఎంతో అవకాశముంటుందన్నారు. బర్త్‌ నుంచి డెత్‌ సర్టిఫికెట్‌ వరకు, పొలాలు, ఇన్‌కమ్‌, క్యాస్ట్‌ సర్టిఫికెట్లు ఇలా ప్రతీ పనికి ప్రజలు రెవెన్యూ శాఖకు వస్తారని తెలిపారు. ఎప్పుడో బ్రిటీషర్ల కాలంలో జరిగిన భూ సర్వే స్థానంలో ఇప్పుడు రీ సర్వే చేపడుతున్నామని చెప్పారు. దీనిని కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చేవారు గుర్తుంచుకుని అన్ని విషయాలు నేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రజలతో మర్యాదగా మాట్లాడుతూ అవినీతికి పాల్పడకుండా పనిచేయాలని కలెక్టర్‌ వివరించారు. డీఆర్‌ఓ చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఈ నెల 17 వరకు 111 మందికి శిక్షణ కొనసాగుతుందన్నారు. నేర్చుకునే క్రమంలో ఉండే సందేహాలను ఎప్పటికప్పుడు సీనియర్స్‌ని అడిగి తెలుసుకోవాలని చెప్పారు. సమావేశంలో కలెక్టరేట్‌ ఏఓ పూర్ణచంద్రరావు, రిటైర్డ్‌ ఆర్డీఓ ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

జిల్లా అధికారులందరు ప్రతి అర్జీని పరిశీలించాలి సమస్యలను వెంటనే పరిష్కరించాలి గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి

Advertisement
Advertisement