వెలకట్టలేం.. పూర్వ విద్యార్థుల సాయం | Sakshi
Sakshi News home page

వెలకట్టలేం.. పూర్వ విద్యార్థుల సాయం

Published Tue, Nov 28 2023 2:20 AM

- - Sakshi

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న సాయం వెలకట్టలేనిదని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.టి.కె.రెడ్డి అన్నారు. సోమవారం వైద్య కళాశాలలో రూ. 15 లక్షలతో ఆధునికీకరించిన ఫోరెనిక్‌ మెడిసిన్‌ లెక్చర్‌ గ్యాలరీని ప్రిన్సిపాల్‌ ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.టి.కె.రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ అమెరికాలో స్థిరపడి లెక్చర్‌ గ్యాలరీ ఆధునీకరణ కోసం రూ. 15 లక్షలు విరాళం ఇచ్చారన్నా రు. అమెరికాలో స్థిరపడిన వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది కళాశాల అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. వైద్య కళాశాలలో జింఖానా ఆడిటోరియం, పలు వైద్య విభాగాల ఆధునీకరణ, జీజీహెచ్‌లో డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ భవన నిర్మాణాలు పూర్వ విద్యార్థుల సహాయంతోనే జరిగాయన్నారు. సుమారు రూ. 80 కోట్లతో నిర్మాణం చేస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం సైతం పూర్వ వైద్య విద్యార్థుల విరాళాలతోనే జరుగుతున్నట్లు వెల్లడించారు. తాము చదువుకున్న సంస్థలో ప్రస్తుతం ఉన్న విద్యార్థులు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో వైద్య విద్యను పొందాలని, ఆసుపత్రికి వచ్చే రోగులు సైతం ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలు పొందాలనే మంచి ఆశయంతో పూర్వ వైద్య విద్యార్థులు కళాశాల అభివృద్ధికి, ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ శరత్‌శ్చంద్ర, డాక్టర్‌ సుజ్ఞాన్‌, డాక్టర్‌ కృష్ణమూర్తి, డాక్టర్‌ జ్యోతి స్వర్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌

డాక్టర్‌ టి.టి.కె.రెడ్డి

Advertisement
Advertisement