వెలసిల్లిన సంపత్తి | Sakshi
Sakshi News home page

వెలసిల్లిన సంపత్తి

Published Fri, Dec 15 2023 1:32 AM

గణపవరం సీసీఐ కేంద్రం వద్ద బారులు తీరిన పత్తి లోడు ట్రాక్టర్లు 
 - Sakshi

నాదెండ్ల: గణపవరంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రానికి రైతులు ట్రాక్టర్లతో భారీగా పత్తిని తరలిస్తున్నారు. ప్రస్తుతం సీసీఐ మద్దతు ధర క్వింటాకు గరిష్టంగా రూ.7,020లు ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.5,500–6,000 వరకూ మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు కొద్దిరోజులుగా సీసీఐ కేంద్రానికి భారీగా పత్తిని తరలిస్తున్నారు. ఫలితంగా యడ్లపాడు మండలం తిమ్మాపురంలోని తిరుమల కాటన్‌లో మరో కేంద్రాన్ని ప్రారంభించారు. యడ్లపాడులోని మరో మిల్లులోనూ కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పటి వరకూ 25 వేల క్వింటాళ్ల కొనుగోలు

చిలకలూరిపేట సీసీఐ పరిధిలోని మూడు కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకూ సుమారు 25 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు బయ్యర్‌ రమేష్‌ తెలిపారు. తేమ శాతం 8లోపు ఉన్నట్లయితే పూర్తి మద్దతు ధర లభిస్తుందన్నారు. తేమ శాతం 11 వరకూ ఉన్నా కొంటామని, ప్రతి శాతానికి రూ.70.20 తగ్గిస్తున్నట్టు వివరించారు. రైతులు పత్తిని బ్యాగుల్లో, లూజు రూపంలో తీసుకు వస్తున్నారని, ఎక్కడ వీలైతే అక్కడ అమ్మే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆయా గ్రామ సచివాలయాల పరిధిలో తప్పనిసరిగా ఈ–క్రాప్‌ నమోదు చేసి ఉండాలని పేర్కొన్నారు. ఎకరాకు 9 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. వారం, పది రోజుల్లో రైతుల ఖాతాలకు నేరుగా ఆర్‌టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు జమ చేస్తున్నట్లు తెలిపారు.

సీసీఐ కేంద్రానికి భారీగా తరలింపు గరిష్ట మద్దతు ధర క్వింటాకు రూ.7,020 ఆనందంలో కర్షకులు

Advertisement
Advertisement