అమరేశ్వరునికి అన్నాభిషేకం రేపు | Sakshi
Sakshi News home page

అమరేశ్వరునికి అన్నాభిషేకం రేపు

Published Tue, Dec 26 2023 1:42 AM

- - Sakshi

అమరావతి: స్థానిక శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరునికి బుధవారం వేకువజామున మహన్యాసపూర్వక ఏకాదశరుద్ర అన్నాభిషేకాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వేమూరి గోపినాథశర్మ సోమవారం తెలిపారు. ధనుర్మాసంలో అమరేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన స్వామి జన్మనక్షత్రమైన ఆరుద్రనక్షత్రం సందర్భంగా దాతల సహకారంతో అభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఉచిత శిక్షణకు 28లోపు పేర్లు నమోదు చేసుకోండి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో చేబ్రోలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌లో ఉచిత శిక్షణకు నిరుద్యోగ యువత ఈనెల 28లోపు పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్కిల్‌ హబ్‌లో డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ కల్పించి, జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇంటర్‌, ఆపైన విద్యార్హత కలిగిన యువతీ, యువకులు ఈనెల 28లోపు స్కిల్‌ హబ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 96665 45975 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

మెట్రో క్రికెట్‌ క్లబ్‌ విజయం

తాడేపల్లిరూరల్‌: ప్రెసిడెంట్‌ కప్‌ అండర్‌– 14 ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో మెట్రో క్రికెట్‌ క్లబ్‌ విజయం సాధించింది. మంగళగిరి పట్టణ పరిధిలోని అమరావతి టౌన్‌షిప్‌లోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ఫైనల్స్‌లో మెట్రో క్రికెట్‌ క్లబ్‌, విజయనగరం క్రికెట్‌ క్లబ్‌ జట్లు ఢీకొన్నాయి. విజయనగరం జట్టు 10 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేయగా, మెట్రో జట్టు 40 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కె.గౌతమ్‌ ఆర్య(మెట్రో క్రికెట్‌ క్లబ్‌) ఎంపికయ్యాడు. బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా వెల్‌కమ్‌ క్రికెట్‌ క్లబ్‌కు చెందిన బి.ఆకర్ష్‌, నెల్లూరు యునైటెడ్‌ క్రికెట్‌ క్లబ్‌కు చెందిన బి.నేత్రానంద బెస్ట్‌ బౌలర్‌గా నిలవగా, బెస్ట్‌ కీపర్‌గా కె.సాయేష్‌(విజయనగరం క్రికెట్‌ క్లబ్‌), బెస్ట్‌ ఫీల్డర్‌గా కె.భాను శ్రీహర్ష(మెట్రోక్రికెట్‌ క్లబ్‌) ఎన్నిక కాగా, బెస్ట్‌ ఆల్‌ రౌండ్‌గా జె. సాయిరామ్‌చరణ్‌రాజు(బీమ్‌షర్ట్స్‌ క్రికెట్‌క్లబ్‌) నిలిచాడు.

సమగ్రశిక్షలో పోస్టుల

భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయంలో కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి (సీఎంవో), ఎంఐఎస్‌ ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టులను డెప్యూటేషన్‌పై భర్తీ చేసేందుకు అర్హులైన ఉపాధ్యాయులు బుధవారంలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ, గత నెల 30 నాటికి 50 ఏళ్లలోపు వయస్సు కలిగిన గ్రేడ్‌–2 గెజిటెడ్‌ హెచ్‌ఎంలతోపాటు ఎంఈఓల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. విద్యార్హతలతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ కాపీలను సంబంధిత డ్రాయింగ్‌ అధికారి ధ్రువీకరణతో గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని సమగ్రశిక్ష విభాగంలో అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు సమగ్రశిక్ష గుంటూరు.బ్లాగ్‌స్పాట్‌.కామ్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలని తెలిపారు.

నిత్యాన్నదానానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి సోమవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన వేమిరెడ్డి తిరుమలరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకుని నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌ డీడీ కాలనీకి చెందిన డి.నాగమణి, ర్యాన్‌ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్‌ కర్నాటి రాంబాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement