దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు

Published Tue, Dec 26 2023 1:42 AM

క్యూలైన్‌లో అయ్యప్ప భక్తులతో రద్దీ గురించి అడిగి తెలుసుకుంటున్న ఈఓ రామారావు  - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు కిటకిటలాడాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకరీతిగా రద్దీ కొనసాగడంతో ఆలయ ఈఓ కె.ఎస్‌.రామారావు ఆలయంలోని ఆశీర్వచన మండపం వద్ద గేట్లకు తాళాలు వేసి ప్రతి ఒక్కరినీ క్యూలైన్లలోనే అమ్మవారి దర్శనానికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రత్యేక ఏర్పాట్లు

ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు రూ.500, రూ.300, రూ.100 టికెట్ల క్యూలైన్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారిని దర్శించుకున్నారు. కొండపైకి చేరుకున్న భక్తులు క్యూలైన్‌లో బారులు తీరి ఉండటంతో ఈఓ రామారావు స్కానింగ్‌ పాయింట్‌, టికెట్‌ కౌంటర్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. క్యూలైన్‌లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మరో వైపు అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద చైర్మన్‌ కర్నాటి రాంబాబుతో పాటు పాలక మండలి సభ్యులు క్యూలైన్లను పర్యవేక్షించారు.

Advertisement
Advertisement