Sakshi News home page

ఆ.. వార్తలు అవాస్తవం

Published Tue, Mar 19 2024 1:40 AM

-

నగరంపాలెం: గుంటూరు సర్కిల్‌లో ఈనెల 17న చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగ సమయంలో తెనాలి పరిసరాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశామనేది అవాస్తవమని గుంటూరు సర్కిల్‌ పర్యవేక్షిక ఇంజనీర్‌ ఆవుల మురళీకృష్ణయాదవ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెనాలి పరిసరాల్లోని వేమూరు మండలం సబ్‌ స్టేషన్‌లో వీసీబీ ట్రిప్‌ కావడంతో కొల్లూరు, చిలుమూరు, ఈపూరు లంక సబ్‌స్టేషన్‌ పరిధిలో 3 నిమిషాలు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. కొల్లిపర మండలంలోని అన్నవరం ఫీడర్‌లో 11 కేవీ తీగల మరమ్మతుల దృష్ట్యా 10 నిమిషాలు విద్యుత్‌ నిలుపుదల చేసి, పునఃప్రారంభించామన్నారు. హఠాత్తుగా ఏర్పడిన అవాంతరాలేనని, ఇది విద్యుత్‌కు అంతరాయం కాదని స్పష్టం చేశారు. ఏవైనా అవాంతరాలు ఉన్నప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, విద్యుత్‌ అధికార, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

తెనాలిలో వ్యక్తి సజీవ దహనం

తెనాలిరూరల్‌: పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెనాలి పట్టణానికి చెందిన ఆటో రవి(37) తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఫ్లెక్సీలు కడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను రాత్రి సమయంలో మున్సిపల్‌ కార్యాలయం వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో ఆశ్రయం పొందుతున్నాడు. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టుముట్టడంతో సజీవదహనమయ్యాడు. రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తూ అటుగా వెళుతున్న పోలీస్‌ సిబ్బంది మంటలను చూసి కాపాడే ప్రయత్నం చేసేలోగానే అతడు మంటల్లో సజీవదహనమయ్యాడు. బీట్‌ కానిస్టేబుళ్లు టూ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మస్కిటో కాయిల్స్‌ వెలిగించుకుని ఉండగా అవి దుస్తులకు అంటుకుని మంటలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అనారోగ్య కారణంగా ప్రమాద సమయంలో మంటలు చెలరేగినా బయటపడలేక అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని చెబుతున్నారు. టూ టౌన్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యపై దాడి చేసిన భర్తకు తొమ్మిదేళ్ల జైలు

సత్తెనపల్లి / అమరావతి : భార్యపై దాడి చేసిన భర్తకు తొమ్మిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేలు అపరాధ రుసుం విధిస్తూ సెషన్స్‌ జడ్జి డి.నాగ వెంకటలక్ష్మి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి మండలం అత్తలూరుకు చెందిన కోట అర్జున్‌, అదే గ్రామానికి చెందిన మేరీలకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు. భర్త అర్జున్‌ చెడు వ్యసనాలకు బానిసై భార్య మేరీని శారీరకంగా, మానసికంగా వేధించటం ప్రారంభించాడు. దీంతో మేరీ రెండు పర్యాయాలు అమరావతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పెద్దలు భార్యా, భర్తల మధ్య రాజీ చేశారు. అయినప్పటికీ అర్జున్‌లో ఎలాంటి మార్పు రాకపోవడంతో మేరీ గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితం అర్ధరాత్రి సమయంలో మేరీ నివసిస్తున్న ఇంటికి పైకి వెళ్లిన అర్జున్‌ ఆమె తల వెనుక భాగంలో కొట్టి గాయపరిచాడు. మేరీ ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ డీ.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు.

Advertisement

What’s your opinion

Advertisement