Sakshi News home page

తొలిరోజే 23 నామినేషన్లు

Published Fri, Apr 19 2024 1:50 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తొలిరోజున 23 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో గుంటూరు పార్లమెంట్‌కు ఐదు నామినేషన్లు దాఖలు కాగా మంగళగిరిలో అత్యధికంగా 14 నామినేషన్లు దాఖలయ్యాయి. తెనాలి, పొన్నూరులలో బోణీ కాలేదు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన గురువారం ఉదయం రిటర్నింగ్‌ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్‌కు సంబంధించి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి అంబటి చలమయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా దండెం రత్నం, గాయత్రి ఆదిపూడి, అప్పిశెట్టి శ్రీకృష్ణ, షేక్‌ అస్లాం అక్తర్‌ నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారి జిల్లా కలెక్టర్‌ ఎం వేణుగోపాలరెడ్డికి అందజేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి 10 మంది అభ్యర్థులు 14 నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్‌ తరపున ఎన్‌ అబద్దయ్య, మైనర్‌బాబు, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి బోడె రామచంద్ర యాదవ్‌, నవతరం పార్టీ అభ్యర్థి రావు సుబ్రమణ్యం, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎస్‌కే జలీల్‌, జై భీమ్‌ పార్టీ అభ్యర్థి జడ శ్రావణ్‌కుమార్‌, తెలుగు రాజాధికార సమితి పార్టీ తరపున జంజనం కోటేశ్వరరావులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా దానబోయిన వెంకట శివాజీ, బండ్ల భిక్షమయ్య, నైనాల లావణ్య, జంజనం పద్మ నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు పశ్చిమ నుంచి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి కోటపాటి సురేష్‌, తూర్పు నుంచి అదే పార్టీకి చెందిన కాజా వెంకటరాఘవేంద్ర సంజీవరావు, తాడికొండ నుంచి తాళ్లూరు నాగరాజు కూడా పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రత్తిపాడులో బీసీవై నుంచి ఎస్‌ఎస్‌ స్తోత్రరాణి(మహాలక్ష్మి) నామినేషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం మంచి రోజు కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

పార్లమెంట్‌కు ఐదు మంగళగిరిలో అత్యధికంగా 14 తెనాలి, పొన్నూరులో నిల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement