Sakshi News home page

హన్మకొండ: ‘ఫలితం.....

Published Thu, May 25 2023 1:28 AM

-

హన్మకొండ: ‘ఫలితం గురించి ఆలోచించలేదు. ఐఏఎస్‌ అనే లక్ష్యాన్ని ఎంచుకున్నా. చదువుకుంటూ వెళ్లా. ప్రణాళికాబద్ధంగా.. నిలకడగా చదివితే సులువుగా విజయం సాధించవచ్చు.’ అని అంటున్నారు సివిల్స్‌లో ఆలిండియా 40వ ర్యాంకు సాధించిన శ్రీసాయి అశ్రిత్‌. హనుమకొండ అడ్వొకేట్స్‌ కాలనీకి చెందిన శాఖమూరి అమరలింగేశ్వర్‌రావు (అమర్‌), పద్మజ దంపతుల కుమారుడైన శ్రీసాయి అశ్రిత్‌ తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకు సాధించారు. బుధవారం నగరానికి చేరుకున్న ఆయనను ‘సాక్షి’ పలకరించగా విద్యాభ్యాసం.. సివిల్స్‌ చదవాలన్న కోరిక ఎప్పుడు కలిగింది.. ఎలా ప్రిపేర్‌ అయ్యారు.. తదుపరి లక్ష్యాలు ఏమిటీ అన్న అంశాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

నా చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. వాటిని చూసి పేదల కు, ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులతో ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నా. ఐఏఎస్‌ అధికారి అయితే ప్రజా సేవ చేసేందుకు అవకా శం కలుగుతుందని చెప్పారు. అప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలనే ఆకాంక్ష, కుతూహలం పెరిగింది. మా అమ్మానాన్న కూడా ప్రోత్సహించారు. బీటెక్‌ చదువుతూనే చాలా మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌ వైపు వెళ్తారు. నేను ప్లేస్‌మెంట్‌ ఆలోచన రానీయలేదు. ఫైనలియర్‌ చదువుతుండగానే సివిల్స్‌వైపు దృష్టి పెట్టా. 2021 మే నుంచి ప్రిలిమ్స్‌కు సన్నద్ధమయ్యా. 2022లో ప్రిలిమ్స్‌కు హాజరై మెయిన్స్‌కు అర్హత సాధించా. అప్పటినుంచి మెయిన్స్‌కు సిద్ధమై మెరిట్‌ సాధించి ఇంటర్వ్యూకు వెళ్లా. ఇక్కడ అన్నీ కలిసి రావడంతో 40వ ర్యాంకు సాధించా. ఈ ర్యాంకుతో ఐఏఎస్‌ అవకాశం వస్తుంది. నా లక్ష్యం నెరవేరుతుంది.

ప్రిలిమ్స్‌ ఇంటినుంచే..

మెయిన్స్‌కు ఆన్‌లైన్‌ కోచింగ్‌

ప్రిలిమ్స్‌కు హనుమకొండలోని ఇంటి వద్ద ఉంటూ ప్రిపేర్‌ అయ్యా. మెయిన్స్‌కు ఢిల్లీలో కోచింగ్‌ వెళ్లాలన్న ఆలోచన ఉండేది. కోవిడ్‌ రెండో దశ కారణంగా వెళ్లలేకపోయా. హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ ఢిల్లీలోని వాజీరాం ఐఏఎస్‌ అకాడమీ నుంచి ఆన్‌లైన్‌ కోచింగ్‌ పొందా. నేరుగా కోచింగ్‌కు వెళ్తే గ్రూపుగా తరగతులకు వెళ్లాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ కోచింగ్‌ ద్వారానైతే ఒక్కరే, ఎలాంటి భంగం కలగకుండా తరగతులు వినే అవకాశముంటుంది. నాకు ఆన్‌లైన్‌ తరగతులు ఎంతగానో దోహదపడ్డాయి. సివిల్స్‌ సక్సెస్‌లో ఆప్షనల్‌ ఎంపిక కూడా కీలకమే. నేను ఆంత్రోపాలజీ ఆప్షన్‌ తీసుకున్నా.

క్రమపద్ధతిలో చదివితేనే విజయం

సివిల్స్‌ అనేది కష్టమని అనుకుంటాం. కానీ క్రమపద్ధతిలో, నిలకడగా చదివితే సులువుగా విజయం సాధించవచ్చు. నేను రోజూ 6 నుంచి 8 గంటలు చదివే వాడినని. ఒకరోజు చదివి, మరో రోజు కాలక్షేపం చేస్తూ నిలకడ లేకుండా వ్యవహరిస్తే సివిల్స్‌లో ర్యాంకు సాధించలేం. రోజూ సమయపాలన పాటిస్తూ నిలకడగా చదవాలి. పరీక్షలకు రెండు నెలల ముందు.. రోజుకు 12 నుంచి 14 గంటలు చదివా. మొదటి ప్రయత్నంలోనే సఫలీకృతం అవుతానని అనుకోలేదు. పట్టుదలతో చదివా. ఫలితం దక్కింది. సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నిత్యం చదువుతూనే ఉండాలి. ముందుగా వారిపై వారికి సాధిస్తాననే నమ్మకం పెరగాలి.

సంక్షేమ పథకాలు అర్హులకు చేరితే

ఆర్థిక అసమానతలు దూరం

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరాలి. దీంతోపాటు, విద్య, వైద్యం ప్రజలకు చేరువైతే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో నేను ఈ దిశగా కృషి చేస్తా.

Advertisement
Advertisement