'రాహుల్‌, ప్రియాంకల వ్యాఖ్యలు హాస్యాస్పదం!' : మంత్రి సత్యవతి రాథోడ్‌ | Sakshi
Sakshi News home page

'రాహుల్‌, ప్రియాంకల వ్యాఖ్యలు హాస్యాస్పదం!' : మంత్రి సత్యవతి రాథోడ్‌

Published Fri, Oct 20 2023 1:18 AM

- - Sakshi

సాక్షిప్రతినిది, వరంగల్‌: ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్‌, మాలోతు కవితలతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడారు.

గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్‌, ప్రియాంకలు.. ఆ వర్గాలకు మేలు చేసే గొప్ప హామీలు ఇస్తారని ఆశించామని, ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా వారి మాటలు ఉన్నాయన్నారు. సమ్మక్క, సారక్కల దర్శనం కోసం మేడారం సందర్శించకుండా, కుంభమేళా తరహాలో మేడారం జాతరకు జాతీయ హోదా ఇస్తామంటున్నారని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీకి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందా? అని సత్యవతి రాథోడ్‌ ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ అనేకసార్లు సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరను జాతీయ హోదాగా గుర్తించాలని కోరినా ఏనాడూ పట్టించుకోలేదన్నారు. 60 ఏళ్లలో ములుగుకు రావడానికి భయపడిన ఈ నాయకులు ఇప్పుడు ఏ భయం లేకుండా వచ్చారని, అందుకు తెలంగాణలో నంబర్‌ వన్‌గా ఉన్న శాంతి భద్రతలే కారణమన్నారు.
ఇవి చదవండి: ఎన్నికల వేళ: ఊరికెళుతూ బంగారం, డబ్బు తీసుకెడితే పరిస్థితి ఏంటి?

Advertisement

తప్పక చదవండి

Advertisement