కమిషనరేట్‌ పరిధిలో పట్టుబడిన గంజాయి | Sakshi
Sakshi News home page

కమిషనరేట్‌ పరిధిలో పట్టుబడిన గంజాయి

Published Thu, Nov 9 2023 1:50 AM

కాజీపేటలో పట్టుకున్న గంజాయి ప్యాకెట్లను చూపిస్తున్న ఎకై ్సజ్‌ పోలీసులు (ఫైల్‌)   - Sakshi

వరంగల్‌ క్రైం : రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులు చేపడుతున్న తనిఖీల్లో విస్తుపోయే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా జనవరి నుంచి అక్టోబర్‌ వరకు 1,456 కిలోల గంజాయిని స్మగ్లర్లు రవాణా చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గడిచిన 10 నెలల్లో పోలీసులు పట్టుకున్న గంజాయి కంటే.. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత 506 కిలోలు పట్టుకున్నది (రూ.1.24 కోట్ల విలువ) పెద్ద మొత్తంలో ఉండటం గమనార్హం. ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో నిర్వహించేందుకు కమిషనరేట్‌ పరిధిలో పోలీస్‌ శాఖ అధికారులు 10 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలతోపాటు స్థానిక పోలీసులు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తుండడంతో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది.

ఏపీలో తక్కువ ధరకు కొనుగోలు చేసి..

ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ మీదుగా స్మగ్లరు మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. వందల కిలోల గంజాయిని వ్యాపారులు తక్కువ ధరకు ఏపీలో కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్మగ్లర్లు వివిధ పద్ధతుల్లో గంజాయిని తరలిస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి.

పోలీస్‌ శాఖ ఏం చేస్తున్నట్లు?

తెలంగాణ మీదుగా గంజాయి పెద్ద మొత్తంలో మహారాష్ట్రకు తరులుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గంజాయిని రవాణా చేయడానికి తెలంగాణలో పలు జిల్లాలను దాటాల్సి ఉంది. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తే ఏదో ఇక చోట పట్టుబడాలి. కానీ, అలా జరగడం లేదు. పోలీసుల అనుమతితో ఇంతకాలం గంజాయి రవాణా జరిగిందా అనే అనుమానాలు కలుగుతుండడం గమనార్హం.

ఇటీవల పట్టుబడిన ఘటనలు..

● ఎల్కతుర్తి పోలీసులు గత నెల 16న రూ.75 లక్షల విలువైన 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. స్మగ్లరు ఎవరికి అనుమానం రాకుండా డీసీఎం వాహనం పైకప్పు భాగంలో 5 కిలోల గంజాయి ప్యాకెట్లను అమర్చారు. దానిపై మరో కవర్‌ను కప్పి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తీసుకొచ్చారు. పోలీసులు డీసీఎంను తనిఖీ చేయగా ఎలాంటి గంజాయి లభించలేదు. అనుమానం వచ్చి పైకప్పును పరిశీలించగా 300 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ సంఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

● హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లాపూర్‌ వద్ద సెప్టెంబర్‌ 7న కారులో తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనలో 8 మంది నిందితులను అరెస్టు చేశారు.

● కాజీపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గతనెల 10న రూ.10 లక్షల విలువ గల 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

● రైలు ద్వారా బిహార్‌కు తరలిస్తున్న 7 కిలోల గంజాయిని పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకుని ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హసన్‌పర్తిలో రైల్వే పోలీసుల నుంచి తప్పించుకున్న ముఠాను కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 20 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

● ఇంతేజార్‌గంజ్‌, మిల్స్‌కాలనీ పోలీసులు ఇటీవల రూ.10 లక్షల విలువైన గంజాయిని పట్టుకుని స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి రైలులో మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు.

● వరంగల్‌ చింతల్‌రోడ్డులోని పుప్పాలగుట్టలో గతనెల 27న ఎకై ్సజ్‌ అధికారులు ఓ వ్యక్తి నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

● హనుమకొండ హంటర్‌రోడ్డులో గత నెల 29న పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ.2.50 లక్షల విలువ గల 10 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని వరంగల్‌లో విక్రయించేందుకు ప్రయత్నించి నిందితుడు పట్టుబడ్డాడు.

● రూ. లక్షల విలువైన 12 కిలోల గంజాయిని ఒడిశా నుంచి వరంగల్‌కు తీసుకువచ్చి ఇటీవల రైల్వే స్టేషన్‌ సమీపంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు.

గత నెలలో 506 కిలోల గంజాయి స్వాధీనం..

పోలీస్‌ కమిషనరేట్‌ పరిదిలో జనవరి నుంచి నవంబర్‌ 7 వరకు 57 గంజాయి కేసులు నమోదయ్యాయి. పోలీసులు 138 మందిని అరెస్టు చేశారు. ఇందులో అక్టోబర్‌లో రూ.1.24 కోట్ల విలువైన 506 కిలోల గంజాయి పట్టబడడం గమనార్హం.

నెల కేసులు అరెస్టు కిలోలు రూపాయల్లో

జనవరి 3 11 86 19,44,000

ఫిబ్రవరి 3 7 171 17,24,200

మార్చి 14 40 30 4,43,000

ఏప్రిల్‌ 8 18 41 7,90,120

మే 2 3 121 24,24,000

జూన్‌ 2 2 2 40,000

జూలై 6 9 79 12,05,200

ఆగస్టు 1 2 69 10,00,000

సెప్టెంబర్‌ 5 26 351 59,22,500

అక్టోబర్‌ 13 20 506 1,24,83,500

మొత్తం 57 138 1456 2,79,76,520

Advertisement
Advertisement