‘తూర్పు’లో బీఆర్‌ఎస్‌కు షాక్‌ | Sakshi
Sakshi News home page

‘తూర్పు’లో బీఆర్‌ఎస్‌కు షాక్‌

Published Sat, Nov 11 2023 1:34 AM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ముంగిట అధికార పార్టీ అభ్యర్థికి ఎదురుదెబ్బ తగలనుందా? ఆయన అభ్యర్థిత్వం నచ్చని కొందరు కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అసంతృప్త నేతలందరూ ఇప్పటికే రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్‌ టికెట్లు ప్రకటించినప్పటి నుంచి తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను మార్చాలని అదే పార్టీకి చెందిన అసంతృప్త నేతలు, కొంత మంది కార్పొరేటర్లు ప్రత్యేక సమావేశాలు పెట్టిన విషయం తెలిసిందే. అధిష్టానం సూచనల మేరకు ఎమ్మెల్యే వారిని కొంతమేరకు సంతృప్తి పర్చినట్లు తెలిసింది. రాంకీలో ఉంటున్న పరకాల నియోజకవర్గానికి చెందిన నాయకుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న విషయం బయటకు పొక్కడంతో ఆయన వద్దకు వెళ్లి మంతనాలు జరిపినట్లు సమాచారం. అదే విధంగా తూర్పులోని సెకండ్‌ కేడర్‌ నేతలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న సమాచారం పొక్కడమే ఆలస్యం.. అధికార పార్టికి చెందిన బ్యాచ్‌ వెళ్లి మంతనాలు చేస్తూ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తుండడంతో చేరికలు నిలిచిపోతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి తూర్పులో పోటీ చేస్తున్న అభ్యర్థికి చెందిన ముఖ్యనేత అసంతృప్తుల వద్దకు వెళ్లి వారికి భారీగా ప్యాకేజీలు ప్రకటించడంతో పార్టీలు చేరేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈమేరకు రంగశాయిపేట, కాశిబుగ్గ, మట్టెవాడ, చింతల్‌, ఎల్‌బీనగర్‌లకు చెందిన కొంతమంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కీలక నేతలు, డివిజన్‌ స్థాయి నాయకులు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లినట్లు వాట్సాప్‌లో వైరల్‌ కావడం తూర్పులో హాట్‌ టాపిక్‌గా మారింది.

పలువురు కార్పొరేటర్లు, నేతలు

కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు

చేరిన వైనం

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement