Telangana Assembly Elections 2023: ఎన్నికలంటే ఇంతుందా..! | Sakshi
Sakshi News home page

Telangana Assembly Elections 2023: ఎన్నికలంటే ఇంతుందా..!

Published Fri, Nov 17 2023 1:16 AM

- - Sakshi

హనమకొండ: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో పౌరుడు తన ఓటు హక్కుతో నచ్చిన నేతను ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి నుంచి మొదలు.. గ్రామస్థాయిలోని పోలింగ్‌ బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్వో) వరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఎన్ని కల ప్రక్రియ సజావుగా పూర్తవుతుంది.

ఎక్కడ ఏ చిన్న లోపం ఏర్పడినా ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలుగుతుంది. బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల దాఖలు మొదలు... ఎన్నికల నియమావళి అమలు, పోలింగ్‌ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు, ఫలి తాల వెల్లడి వరకు అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు వారి ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి ఎన్నికల అధికారి (కలెక్టర్‌) నుంచి.. బూత్‌ లెవెల్‌ అధికారి (బీఎల్వో) వరకు.. వివిధ స్థాయిలోని ఎన్నికల అధికారుల విధుల గురించి తెలుసుకుందాం..

జిల్లా ఎన్నికల అధికారి
జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మిగతా ఎన్నికల నిర్వహణ అధికారులు కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కిందిస్థాయి అధికారులకు విధులు కేటాయిస్తూ నిరంతరం సమీక్షలు జరుపుతారు. అధికారుల అందరికీ దిశానిర్దేశం చేస్తారు. జిల్లాస్థాయిలో కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తారు. ఓటరు జాబితా రూపకల్పన మొదలు.. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి పూర్తయ్యే వరకు.. జిల్లా ఎన్నికల అధికారిదే పూర్తి బాధ్యత.

రిటర్నింగ్‌ అధికారి
రిటర్నింగ్‌ అధికారి నియోజకవర్గానికి ఒకరు ఉంటారు. వీరిని ఆయా నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నియమిస్తుంది. తమ పరిధిలోని ఎన్నికల ప్రక్రియను వీరు పర్యవేక్షిస్తారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది నియామకం, శిక్షణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, వసతుల కల్పన, తదితర అంశాలు వీరి పరిధిలో ఉంటాయి.

సెక్టోరియల్‌ అధికారి
ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి సెక్టోరియల్‌ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌ల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు. ఒక్కొక్కరి పరిధిలో దాదాపు 6 నుంచి 9 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ర్యాంపుల ఏర్పాటు, తాగునీటి వసతి, ఫర్నీచర్‌, విద్యుత్‌, లైట్లు, ఫ్యాన్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహణ జరిగేలా చూస్తారు. తమ పరిధిలో జరిగే అంశాలకు వీరే బాధ్యత వహిస్తారు.

ప్రిసైడింగ్‌ అధికారి
ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఉంటారు. ఆ పోలింగ్‌ కేంద్రం పరిధిలో జరిగే అన్ని విషయాలకు అతడిదే సంపూర్ణ బాధ్యత. ఓటింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రి తీసుకొస్తారు. పోలింగ్‌ అనంతరం ఎన్నికల సామగ్రిని తిరిగి నియోజకవర్గస్థాయి స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరుస్తారు. వీరికి సహాయకంగా అదనపు ప్రోసీడింగ్‌ అధికారి ఉంటారు.

పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే కార్యకలాపాలాన్నీ వీరి పర్యవేక్షణలోనే ఉంటాయి. ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళికి అనుగుణంగా వీరు పనిచేస్తారు. వీరితోపాటు మరో ఇద్దరు పోలింగ్‌ అధికారులు పనిచేస్తారు. పోలింగ్‌ బూత్‌లలోని ఈవీఎంల పనితీరు, ఇతర కార్యకలాపాలకు వీరిదే బాధ్యత.

ఓటు నమోదు అధికారులు
బూత్‌ స్థాయి అధికారులు అందించిన సమాచారంతో ఓటరు జాబితాను తయారు చేయడం వీరి ప్రధాన బాధ్యత. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు జాబితాలో పేర్లు సరిచేసుకునేవారు ఈ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. తుది ఓటరు జాబితా రూపకల్పనలో వీరిదే ప్రధాన పాత్ర.

బూత్‌ లెవెల్‌ అధికారులు
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో గ్రామస్థాయిలో పనిచేసే వారే బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌వోలు). గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువత, ఓటు హక్కుకు అర్హులైన వారిని ఓటు నమోదు చేసుకునేలా వీరు అవగాహన కల్పిస్తారు.

కావాల్సిన దరఖాస్తులు వీరి వద్ద ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను స్వీకరించి నమోదు చేసిన అనంతరం తుది జాబితా ప్రదర్శన, పోలింగ్‌ కేంద్రాల మార్పునకు సంబంధించి ఉన్నతాధికారులకు సహకరించడం వీరి ప్రధాన బాధ్యత.

Advertisement
Advertisement