హోరెత్తిస్తున్న ప్రచార రథాలు | Sakshi
Sakshi News home page

హోరెత్తిస్తున్న ప్రచార రథాలు

Published Mon, Nov 20 2023 1:04 AM

-

నామినేషన్ల పర్వం ముగిసింది. పోలింగ్‌ తేదీ ఇంకా పది రోజులే ఉంది. ఏ లెక్కన చూసినా అభ్యర్థులు ఓటర్లను ముఖాముఖి కలిసే పరిస్థితి లేదు. దీంతో వాహనాల్లో మైక్‌సెట్లు, డీజేలు, కళాకారుల పాటల ద్వారా ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు కలిపి వెయ్యికిపైగా ప్రచార వాహనాల కోసం అనుమతులు తీసుకున్నాయి. వాటిలో అధికార పార్టీ వాహనాల సంఖ్యే కాస్త ఎక్కువ. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రచారం, ర్యాలీలు, హెలికాప్టర్‌ వంటివాటిని పార్టీ పనుల కోసం సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని నిబంధనలు ఉండడంతో అందరూ అలాగే చేస్తున్నారు. ఇంకొందరి దరఖాస్తులు ఆర్‌ఓల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

హోరెత్తిస్తున్న ప్రచార రథాలు

ఎన్నికల వేళ.. ప్రచారం పలు విధాలుగా జరుగుతోంది. కానీ.. అన్ని ప్రధాన పార్టీల్లోనూ కామన్‌ థింగ్‌ ‘ప్రచార రథం’.. తెల్లారింది మొదలు రాత్రి వరకు ఆయా పార్టీల ప్రచార వాహనాలు గల్లీలన్నింటినీ చుట్టేస్తున్నాయి. ఒక్కో వీధిలో రోజుకు ఏడెనిమిదిసార్లు చక్కర్లు కొడుతున్నాయి. అభ్యర్థుల పేర్లతో, ఆకట్టుకునే పాటలతో ప్రచారం సాగిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని వివరిస్తూ వాహనాల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. బీజేపీ.. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు, స్థానికంగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. ఆయా అభ్యర్థుల గుణగణాలతో ప్రచారంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్‌ ప్రధానంగా ఆరు గ్యారెంటీలను తెలుపుతూ.. అండగా నిలవాలని ప్రచారం కొనసాగిస్తోంది.

గజ్జె కట్టి.. చిందులేసి

ఆయా పార్టీలు ఓటు అభ్యర్థించడం కోసం కూడళ్లలో కళాకారులతో పాటలు పాడిస్తున్నాయి. కళాకారులు కాలికి గజ్జె కట్టి, గోచి, గొంగడి వేసి కదం తొక్కుతూ పాటలు పాడుతున్నారు. పార్టీ ప్రాధాన్యాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్తున్నారు. ఇరువైపులా ఆయా పార్టీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అమర్చి ఒక వైపున స్టేజీ మాదిరిగా డీసీఎం వాహనాన్ని తయారు చేసి కళాకారులు పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కళాకారులు ప్రధానంగా రద్దీ ఉండే ఏరియాల్లో ఆటపాటల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

కళ్లకు కట్టినట్లుగా..

దృశ్య రూపంలో చూసింది ఎక్కువగా గుర్తుంటుందనే సిద్ధాంతాన్ని నాయకులు గట్టిగా పట్టుకున్నారు. వీడియోలను ప్లే చేస్తూ ప్రజల మెదళ్లలోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా పార్టీలు చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేయబోయే హామీలను, అభ్యర్థుల గొప్పదనాన్ని తెలిపేలా వాహనాల కు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ వా హనాలు రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లో కూ డళ్లలో నిలిపి స్క్రీన్లపై వీడియోలు చూపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్క్రీ న్ల ద్వారా ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేయడంలో నాయకులు సఫలీకృతులవుతున్నారు.

Advertisement
Advertisement