దోచుకోవడం, దాచుకోవడమే కాంగ్రెస్‌ నైజం | Sakshi
Sakshi News home page

దోచుకోవడం, దాచుకోవడమే కాంగ్రెస్‌ నైజం

Published Wed, Nov 22 2023 1:08 AM

కడియం శ్రీహరితో గౌడ సంఘం నాయకులు  - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మోసం, దగా అని.. దోచుకోవడం, దాచుకోవడం ఆపార్టీ నేతల నైజమని బీఆర్‌ఎస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. డివిజన్‌కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘన్‌పూర్‌లో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సీఎం సభ దిగ్విజయంగా జరిగిందని, 70వేల మందికి పైగా ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారని, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం అంతా సోషల్‌మీడియా ద్వారానే జరుగుతుందని, గ్రామాల్లో వారి ప్రచారానికి స్పందన లేదన్నారు. లింగంపల్లి–మల్కాపూర్‌ రిజర్వాయర్‌ ప్రసక్తే లేదని, రద్దయిందని, ఆ భూములకు లిఫ్ట్‌ ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. సభలో సీఎం కేసీఆర్‌ దేవాదుల ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారని, లింగంపల్లి రిజర్వాయర్‌ అవసరం లేదని సీఎంకు చెప్పామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి బ్రహ్మాండగా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు చాలంటాడని, కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్‌ తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్‌ఎస్‌ కావాలా, 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్‌ కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అభివృద్దిలో నియోజకవర్గం మళ్ళీ పదేళ్లు వెనక్కి పోతుందని, నియోజకవర్గ అభివృద్ధిపై, సమస్యలపై తనకు పరిపూర్ణమైన అవగాహన ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇందిర గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి మళ్లీ నియోజకవర్గానికి రాలేదని, ఐదేళ్ల తర్వాత ఎన్నికల కోసం వచ్చిందని తెలిపారు. కడియం ఫౌండేషన్‌ ద్వారా దళిత బిడ్డలను చదివిస్తున్నానని, కరోనా సమయంలో ఐదు వేలమందికి పైగా సహాయం చేశానన్నారు. అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సీహెచ్‌.నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, చేపూరి వినోద్‌, రాపోలు మధుసూధన్‌రెడ్డి, తాటికొండ సురేష్‌కుమార్‌, రజాక్‌యాదవ్‌, నీ ల గట్టయ్య, బూర్ల శంకర్‌, మాచర్ల గణేష్‌, నర్సింహులు, ఏ.బాలరాజు, ఫాతికుమార్‌ ఉన్నారు.

కడియంకే గౌడసంఘం మద్దతు

ప్రస్తుత ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికే తమ సంపూర్ణ మద్దతు అని గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజుగౌడ్‌ అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద గౌడ సంఘం నాయకులు కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రత్యేక చొరవతో పనిచేశారని, తమ గౌడ కులస్తుల మద్దతు బీఆర్‌ఎస్‌ పార్టీకి, కడియం శ్రీహరికి ఎల్లవేళలా ఉంటుందన్నారు. గౌడ సంఘం నాయకులు ఇల్లందుల నరేష్‌, పులి శ్రీను, వంగ శ్రీను, మాచర్ల రఘురాములు, గట్టు రమేష్‌, చేరాలు, సుదర్శన్‌,ర సుధాకర్‌ పాల్గొన్నారు.

ధర్మసాగర్‌: స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపునకు ధర్మసాగర్‌, వేలేరు మండలాల గౌడ కులస్తులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రెండు మండలాల గౌడ కులస్తులందరూ కడియం శ్రీహరి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

లింగాలఘణపురం: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికి మద్దతు తెలుపుతూ మంగళవారం మండల కేంద్రంలోని నాయిబ్రాహ్మణులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తెలిపించేందుకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని చెప్పారు. వీరిలో లింగాల వెంకటేశ్‌, లక్ష్మినారాయణ, ఆదిత్య, యాకన్న, సత్యనారాయణ, వేణు, సతీష్‌, హరినాథ్‌, క్రాంతి ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి కడియం శ్రీహరి

విలేకరులతో మాట్లాడుతున్న కడియం శ్రీహరి
1/2

విలేకరులతో మాట్లాడుతున్న కడియం శ్రీహరి

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికి 
మద్దతు తెలుపుతున్న నాయిబ్రాహ్మణులు
2/2

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికి మద్దతు తెలుపుతున్న నాయిబ్రాహ్మణులు

Advertisement
Advertisement