Sakshi News home page

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి

Published Wed, Nov 22 2023 1:10 AM

మాట్లాడుతున్న సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా
 - Sakshi

వరంగల్‌ క్రైం: ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు, పోలీసులు కృషి చేయాలని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. ఎన్నికల బందోబస్తు కోసం కమిషనరేట్‌కు వచ్చిన కేంద్ర సాయుధ పారామిలటరీ పోలీసు అధికారులతో సీపీ మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా వరంగల్‌ ప్రజల జీవనవిధానం, భౌగోళిక అంశాలపై వివరించారు. అనంతరం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులు నిర్వహించాలన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కేంద్ర బలగాలు రానున్నాయని, వారికి స్థానిక పోలీసుల, ప్రజల సహకారం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు సుజిత్‌కుమార్‌, బీఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ ముశ్‌కుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీలు జితేందర్‌రెడ్డి, రమేశ్‌కుమార్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఏసీపీ నాగయ్య, కమ్యునికేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, కేంద్ర బలగాల అధికారులు పాల్గొన్నారు.

ఓటు వినియోగంపై

అవగాహన ర్యాలీ

హన్మకొండ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేలా ప్లకార్డులు పట్టుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది మంగళవారం ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ 4వ డివిజన్‌ పెద్దమ్మగడ్డ నుంచి కాకతీయ కాలనీ వరకు సాగిన ర్యాలీకి ముందు పెద్దమ్మగడ్డ జంక్షన్‌లో మానవహారం చేపట్టారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యాకూబ్‌పాషా, సిబ్బంది వాణిశ్రీ, ఉమశ్రీ, శాహేలా, ప్రసాద్‌, ప్రసన్నకుమార్‌, మాధవరెడ్డి, భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement