7 తర్వాతే జిల్లాకు.. | Sakshi
Sakshi News home page

7 తర్వాతే జిల్లాకు..

Published Wed, Dec 6 2023 12:40 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

సుమారు 30 రోజులపాటు రాజకీయ సందడిగా ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్కసారిగా స్తబ్దత ఏర్పడింది. నవంబర్‌ 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌.. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు 10 చోట్ల కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. రెండు చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ప్రతిసారి ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులు సంబురాలు, ఓటమి చెందిన వారు సమీక్షలు చేసుకోవడం ఆనవాయితీ. ఈసారి పరిస్థితులు భిన్నంగా మారాయి. మూడోసారి ప్రభుత్వం ఏర్పడుతుందనుకుంటే ఘోర పరాజయం కావడంతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోవడం లేదు. మరోవైపు పదిచోట్ల గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కౌంటింగ్‌ కేంద్రాల నుంచి నేరుగా హైదరాబాద్‌ ‘ఎల్లా’ హోటల్‌కు తరలి సంబురాలకు దూరంగా ఉన్నారు. మంగళవారం సాయంత్రం సీఎల్పీ నేత, సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారు కావడం.. 7న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదరగా.. ఆ తర్వాతే కొత్త ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చేరనున్నారు. నియోజకవర్గాల్లో పెద్దఎత్తున విజయోత్సవాలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కార్యాచరణ సిద్ధం చేస్తుండగా... ఓటమికి కారణాలపై ‘పోస్టుమార్టం’ నిర్వహించే పనిలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

ఆలస్యమైనా.. కాంగ్రెస్‌కు

కలిసొచ్చిన విజయం...

ఉమ్మడి వరంగల్‌లో 12 స్థానాలకు 10 గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించింది. నామినేషన్లకు తెరలేచే సమయానికి కాంగ్రెస్‌ అభ్యర్థులు నలుగురు మాత్రమే ఖరారయ్యారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ధనసరి సీతక్క (ములుగు)తోపాటు గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట), శనిగపురం ఇందిర (స్టేషన్‌ఘన్‌పూర్‌) పేర్లు తొలి జాబితాలో వెలువడ్డాయి. మిగిలినచోట్ల ఆశావహులు అధికంగా ఉండడంతో ఎనిమిది మంది అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైంది. ఓవైపు బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌ వెనుకబడినట్లే కనిపించింది. పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించడం, అసమ్మతి నేతలను పార్టీ పెద్దలు బుజ్జగించటం, ఆరు జిల్లాల ముఖ్యనేతలు సమన్వయంతో వ్యవహరించి కాంగ్రెస్‌ శ్రేణులు ఎన్నికల బరిలోకి దూకాయి. 20 రోజుల్లోనే పక్కా కార్యాచరణతో ప్రచారం నిర్వహించాయి. ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులైన రవీంద్ర ఉత్తమ్‌రావు దల్వీ, మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం ఉమ్మడి జిల్లాలో పార్టీకి కలిసివచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు సంప్రదాయ ఓటుబ్యాంకు దన్నుగా నిలిచింది. ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించడంతో పార్టీకి అనుకూల పవనాలు వీచాయి. ఈసారి మార్పు కావాలని ప్రజలు నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్‌కు ఒక్కచోట మినహా మిగతా స్థానాల్లో భారీ ఆధిక్యాలు దక్కాయి. ఉమ్మడి జిల్లాల్లో పది స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవడంతో కేడర్‌లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అధికారానికి పదేళ్లు దూరంగా ఉన్న నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ వచ్చింది.

బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణాలెన్నో..

ఆరు జిల్లాల్లో ఎన్నికల ఫలితాలు ఈసారి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర నిరాశ కలిగించాయి. 2018 ఎన్నికల్లో 12 స్థానాలకు 10 చోట్ల గెలిచిన బీఆర్‌ఎస్‌, ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి)ని పార్టీలో చేర్చుకోవడంతో తాజా ఎన్నికలకు వెళ్లే సమయానికి బీఆర్‌ఎస్‌కు 11 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చి మిగిలిన అందరికీ సీట్లు ఇచ్చింది. అభివృద్ధి నినాదంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు. ప్రచార పర్వంలో భాగంగా ఒక్కో గ్రామాన్ని కనీసం రెండుసార్లు చుట్టేశారు. కేసీఆర్‌ బహిరంగ సభలు, కేటీఆర్‌, హరీశ్‌రావు రోడ్‌షోలు నిర్వహించినా ఓటర్ల మనుసు మాత్రం గెలుచుకోలేకపోయారు. పార్టీకి అన్నీ తామై ముందుకు నడిపించాల్సిన ముఖ్య నాయకులు ‘ఎవరికివారే యమునా తీరే అన్నట్లు’ వ్యవహరించడం, ప్రచారం, ఎన్నికల వ్యూహరచనలో సమన్వయం లోపించడంతో బీఆర్‌ఎస్‌ కుదేలైంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిందేనని స్థానికంగా డిమాండ్లు వెల్లువెత్తినా, అసమ్మతులు చెలరేగినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. పలు నియోజకవర్గాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ కొందరు నేతలు పార్టీని వీడగా.. కొన్నిచోట్ల పార్టీలో ఉంటూనే సిట్టింగ్‌ అభ్యర్థుల ఓటమిని కోరుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడక్కడ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు కూడా ప్రతిబంధకంగా మారాయి. మరికొన్ని చోట్ల అభ్యర్థులపై సానుకూలత ఉన్నప్పటికీ.. స్థానిక పరిస్థితులకు తోడు కాంగ్రెస్‌ గాలి వీచడంతో కారు ఓటమిని చవిచూసింది. మొత్తంగా అతివిశ్వాసంతో ఓటర్ల మనసు గెలుచుకోలేకపోయిన బీఆర్‌ఎస్‌ ఈసారి రెండు స్థానాలకే పరిమితమైందని, అదీ.. ‘సిట్టింగ్‌’లను మార్చిన ఫలితమేనని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సీఎంగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం అనంతరం రానున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

హోటల్‌ ‘ఎల్లా’లో మకాం..

జిల్లాకు వచ్చాక గెలుపు సంబురాలు

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు

అంతర్మథనంలో పడిన నేతలు, శ్రేణులు

ఉమ్మడి వరంగల్‌ రాజకీయాల్లో

ఒక్కసారిగా స్తబ్దత

Advertisement
Advertisement