Maoist: 37 సంవత్సరాలకు పోలీసుల చేతికి చిక్కిన వజ్జయ్య | Sakshi
Sakshi News home page

Maoist: 37 సంవత్సరాలకు పోలీసుల చేతికి చిక్కిన వజ్జయ్య

Published Sat, Feb 17 2024 12:58 AM

- - Sakshi

బయ్యారం: మండలంలోని రామచంద్రాపు రం గ్రామానికి చెందిన కుర్సం వజ్జయ్య అలి యాస్‌ అశోక్‌ పేద ఆది వాసీ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు బాల్యంలో వజ్జయ్యను ఓ రైతు వద్ద పాలేరుగా పెట్టారు. ఆ సమయంలో బయ్యారం మండల ఏజెన్సీలో అప్ప టి ప్రజాపంధా ఇప్పటి న్యూడెమోక్రసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో వజ్జయ్య నక్సల్స్‌ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పాలేరుగా పనిచేస్తున్న సమయంలోనే దళసభ్యుడిగా ఉద్యమంలో చేరాడు. నిరక్షరాస్యుడిగా పార్టీలో చేరిన వజ్జయ్య తన పేరును అశోక్‌గా మార్చుకోవడంతోపాటు నాయకుల ప్రేరణతో చదువు నేర్చుకున్నారు.

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల సరిహద్దులో బలమైన విప్లవపార్టీకి అజ్ఞాత నాయకుడిగా కొనసాగుతున్న అశోక్‌ను హతమార్చటమే లక్ష్యంగా మావోయిస్టు, ప్రజాప్రతిఘటన, ప్రతిఘటన, చలమన్న పార్టీలు పలుమార్లు దాడులు జరిపాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు మండలంలోని భీరోనిమడువ అటవీప్రాంతంలో అశోక్‌ దళంపై దాడి జరిపి ఆయుధాలను ఎత్తుకెళ్లగా అశోక్‌ క్షేమంగా బయటపడ్డాడు. ప్రజాప్రతిఘటనకు చెందిన శంకరన్న సైతం అశోక్‌ లక్ష్యంగా దాడులు జరపగా చాకచక్యంగా తప్పించుకున్నాడు.

ఈక్రమంలో 37 సంవత్సరాలకు అశోక్‌ పోలీసులకు చిక్కాడు. నక్సల్స్‌ దళనేతగా కొనసాగుతున్న సమయంలో ఇర్సులాపురం గ్రామానికి చెందిన ఎనుగుల మల్లేష్‌, బండారి మల్లయ్య, అడ్వకేట్‌ రూపిరెడ్డి రవీందర్‌రెడ్డి, జగత్‌రావుపేట గ్రామానికి చెందిన పర్శిక బొర్రయ్య, బయ్యారానికి చెందిన గోపి హత్య కేసులు అశోక్‌పై నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర కేసులు సైతం ఉన్నట్లు తెలుస్తుంది.

అశోక్‌, గోపన్నను విడుదల చేయాలి..
పోలీసులు అదుపులోకి తీసుకున్న అశోక్‌, గోపన్నతోపాటు పుల్లన్నను విడుదల చేయాలని కోరుతూ న్యూడెమోక్రసీలోని ఇరువర్గాల ఆధ్వర్యంలో మండలంలోని బయ్యారం, గంధంపల్లి– కొత్తపేట, వెంకట్రాంపురంలో ఆందోళనలు నిర్వహించారు. నాయకులు ఐలయ్య, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, పద్మ, భిక్షం, వీరభద్రం, మధు, నాగేశ్వరరావు, కుమారి పాల్గొన్నారు.

Advertisement
Advertisement