సారీ.. నో ఏసీ.. అలంకారప్రాయంగా ఏసీ బస్‌ షెల్టర్లు | Sakshi
Sakshi News home page

సారీ.. నో ఏసీ.. అలంకారప్రాయంగా ఏసీ బస్‌ షెల్టర్లు

Published Fri, Feb 24 2023 7:46 AM

మాదాపూర్‌ శిల్పారామంలోని బస్‌షెల్టర్‌  - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఏసీ బస్‌షెల్టర్‌లు అలంకారప్రాయంగా మారాయి. ఏ ఒక్క షెల్టర్‌లోనూ ఏసీ సదుపాయం లేదు. ఏసీ ఉంటే తప్ప ఆ షెల్టర్‌లలో కూర్చోవడం సాధ్యం కాదు. ఒక్క ఏసీ మాత్రమే కాదు. తాగునీళ్లు, టాయిలెట్‌లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అక్కరకు రాని షెల్టర్‌లలో కూర్చొని ఎదురు చూసేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలోనే పడిగాపులు కాయాల్సివస్తోంది.

ఏర్పాటులోనే ఆర్భాటం..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా అయిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఏసీ షెల్టర్లు నేతిబీర చందంగా మారాయి. అద్దాల డోర్‌లతో బ్రహ్మాండమైన లుక్‌ కనిపిస్తుంది. కానీ డోర్‌లు తెరిస్తే అన్నీ లుకలుకలే. ఏసీ షెల్టర్‌లతో పాటు నాన్‌ ఏసీ షెల్టర్‌ల ఏర్పాటును అప్పట్లో ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. వ్యాపార ప్రకటనలపై వచ్చే ఆదాయంతో వీటిని నిర్వహించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సదుపాయాలను ప్రయాణికులకు అందజేయాలి. ఈ షెల్టర్‌లను ఏర్పాటు చేసిననప్పటి నుంచి

వ్యాపార ప్రకటనల ద్వారా ఆయా సంస్థలకు ఆదాయం లభిస్తోంది. ప్రయాణికులకు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు అందడం లేదు.
తార్నాక, సికింద్రాబాద్‌, బేగంపేట్‌, బషీర్‌బాగ్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, శిల్పారామం, ఖైరతాబాద్‌ తదితర చోట్ల బస్‌షెల్టర్‌లను ఏర్పాటు చేశారు. రెండు కేటగిరీలుగా షెల్టర్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ నివేదిక ప్రకారం నగరంలో సుమారు 1800 బస్‌షెల్టర్‌లు అవసరం.

కొన్ని చోట్ల పాతకాలపు షెల్టర్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని శిథిలమయ్యాయి. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్‌ల నిర్మాణం కారణంగా, గతంలో మెట్రో పనుల దృష్ట్యా షెల్టర్‌లను తొలగించారు. ఇలా షెల్టర్‌లు లేని చోట ఆధునిక పద్ధతిలో కట్టించేందుకు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే మొదట ఏసీ షెల్టర్‌లకు శ్రీకారం చుట్టారు.

కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, శిల్పారామం, దిల్‌సుఖ్‌నగర్‌, ఖైరతాబాద్‌, తదితర 10 ప్రాంతాల్లో ఏసీ షెల్టర్‌లను ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్ది రోజులు మాత్రమే ఏసీ ఉంది. ఆ తరువాత ఎక్కడా పని చేయడం లేదు. అప్పట్లో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు, ప్యానిక్‌ బటన్‌లు, మొబైల్‌ చార్జింగ్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ సదుపాయాలు ఏవీ అందుబాటులో లేదు.

ప్రకటనలకే..
తార్నాక, బేగంపేట్‌ వంటి పలు చోట్ల ఏర్పాటు చేసిన నాన్‌ ఏసీ షెల్టర్లు బస్టాపులతో సంబంధం లేకుండా ఉన్నాయి. కేవలం వాటికి వ్యాపార ప్రకటనలకే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. ఆ షెల్టర్లకు పర్లాంగ్‌ దూరంలో బస్సులు ఆగుతాయి. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా జనం దృష్టిని ఆకర్షించేందుకు అవకాశం ఉన్న చోట ఈ తరహా ప్రకటనలతో షెల్టర్లు ఏర్పాటు కావడం గమనార్హం.

Advertisement
Advertisement