నగరంలో కొత్త రకం ఫ్లూ లక్షణాలు | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 7 2023 4:00 AM

- - Sakshi

హెచ్‌3ఎన్‌2 వైరస్‌తో జలుబు, జ్వరాలు

ఫీవర్‌ ఆస్పత్రికి పెరుగుతున్న బాధితులు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

ఇష్టారీతిన యాంటీ బయాటిక్స్‌ వాడొద్దని సూచన

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

● ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్లు ఇతరులతో కరచాలనం, ఆలింగనం, దగ్గరగా కూర్చోవడం, కలిసి భోజనం చేయకూడదు.

● లక్షణాలున్న వాళ్లు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం చేయకూడదు.

● స్వీయ వైద్యం వద్దు. వైద్యుడి సూచనల మేరకు మాత్రమే మందులు వాడాలి.

● బహిరంగ ప్రదేశాల్లో, సమూహాల్లో ఉన్నప్పుడు విధిగా మాస్కులు ధరించాలి.

● తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

నల్లకుంట: నగరంలో కొద్ది రోజులుగా వైరల్‌ ఫీవర్‌ కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్తగా హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ఫ్లూ లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌– 19 వైరస్‌ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ కొత్త వైరస్‌ హెచ్‌3ఎన్‌2 కలకలం రేపుతోంది. పలువురు జ్వరం, ఫ్లూ లక్షణాలతో కూడిన హెచ్‌3ఎన్‌2 వైరస్‌ బారిన పడుతున్నారు. పైకి జ్వరం, జలుబుగా మాత్రమే కనిపిస్తున్న ఈ వైరస్‌పై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పలు సూచనలు చేశాయి. హెచ్‌3ఎన్‌2 కొత్త వైరస్‌ ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్‌ ఫీవర్‌ బాధిత రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలా మందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో కొన్ని రోజుల తర్వాత న్యుమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది.

అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రెండు వారాలుగా దీర్ఘకాలిక అనారోగ్యాలు, దీర్ఘకాలిక దగ్గుతో కూడిన ఫ్లూ వైరస్‌ బారిన రోగులు చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి వస్తున్నారు. వీరిలో కొందరికి స్వైన్‌ ఫ్లూ హెచ్‌3ఎన్‌2 వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్లుగా చేరి చికిత్సలు పొందుతూ పై లక్షణాలు ఉన్న రోగుల నుంచి శాంపిల్స్‌ సేకరించి హెచ్‌3ఎన్‌2 వైరస్‌ పరీక్షల కోసం నారాయణ గూడ ఐపీఎంకు పంపిస్తున్నారు. హెచ్‌3ఎన్‌2 లక్షణాలు ఉన్న మరికొందరు రోగులకు హోం ఐసోలేషన్‌లోనే ఉండి అయిదు రోజుల పాటు మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజా ‘ఎ’ ఉపరకం హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగానే ఇలా జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇతర ఉప రకాల కంటే ఎక్కుగా హెచ్‌3ఎన్‌2 వైరస్‌ జనాన్ని ఆస్పత్రుల పాల్జేస్తున్నట్లు చెబుతున్నారు.

అత్యధికంగా వైరల్‌ ఫీవర్‌ బాధితులే..

నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి రోజుకు 500 నుంచి 750 మంది రోగులు వస్తే వారిలో సగం మంది జ్వర పీడితులే ఉంటున్నారు. అదే విధంగా బస్తీ దవాఖానాలకు కూడా వైరల్‌ ఫీవర్‌ కేసులే వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది

వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయాటిక్స్‌ వాడకూడదు

వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయాటిక్స్‌ వాడకూడదని మరోవైపు ఇన్‌ఫెక్షన్‌లను నిర్ధారించుకోకుండా రోగులకు యాంటీ బయాటిక్స్‌ సూచించకూడదని వైద్యులను ఐసీఎంఆర్‌ హెచ్చరించింది. ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్‌తో ఆందోళన చెందవద్దని సూచించింది.

పెరిగిన రోగుల సంఖ్య

ఖైరతాబాద్‌, నాంపల్లి: ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్‌ సెంటర్‌కు జ్వర పీడితుల తాకిడి అకస్మాత్తుగా పెరిగిందని అక్కడి సిబ్బంది తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల దాకా పనిచేసే ఈ అవుట్‌ పేషెంట్స్‌ విభాగంలో సాధారణ రోజులతో పోలిస్తే కనీసం 30 నుంచి 40 శాతం వరకూ రోగులు పెరిగారన్నారు. అత్యధిక శాతం మంది జ్వరం, జలుబు, దగ్గు సమస్యలతోనే వస్తున్నప్పటికీ ఫ్లూ అని ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. నిలోఫర్‌లోనూ వైరల్‌ ఫీవర్లతో వస్తున్నవారి సంఖ్య పెరిగింది. తమ దగ్గరకు ఫ్లూ లక్షణాలతో వస్తున్న రోగులు పెరుగుతున్నప్పటికీ ఐసీఎంఆర్‌ గుర్తించిన ఫ్లూనా? కాదా? అనేది ఇంకా ఎవరి విషయంలో నిర్ధారణ కాలేదని ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్య సిబ్బంది చెబుతున్నారు.

నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి ఓపీ క్యూలైన్‌లో జ్వర బాధితులు

ప్రాణాంతకం కాదు..

కొద్ది రోజులుగా ఫీవర్‌ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఐసీఎంఆర్‌ ఆదేశాల మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులకు హెచ్‌3ఎన్‌2 పరీక్షలు చేస్తున్నాం. ఈ పరీక్షలు నారాయణ గూడ ఐపీఎంలో ఉచితంగా చేస్తున్నారు. హెచ్‌3ఎన్‌2 స్వైన్‌ ఫ్లూ వైరస్‌ పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దు. ఇది కోవిడ్‌లా ప్రాణాంతకమైన వైరస్‌ కాదు. మందులతో తగ్గుతుంది. ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్సలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. ఒకవేళ కొత్త రకం ఫ్లూ కేసులు వస్తే చికిత్సలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఎండలు తీవ్రమైతే ఈ వైరస్‌ నశిస్తుంది. ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదు. – డాక్టర్‌ కె.శంకర్‌, ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

15 లోపు.. 50 ఏళ్లు పైబడిన వారిలో..

కొత్త రకం ఫ్లూ ఇన్ఫెక్షన్‌ సాధారణంగా అయిదు నుంచి వారం రోజులు ఉంటుంది. మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది. 15 ఏళ్ల లోపు పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వారు ఈ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాయు కాలుష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్‌ వాడకం మంచిది కాదు, ఇది సహజ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. ఫ్లూ వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా చేయించుకునే వ్యాక్సిన్‌ అన్ని ప్రైవేట్‌ మెడికల్‌ ఫాపుల్లో రూ. 600 ధరకు అందుబాటులో ఉంది.

1/2

 ఫీవర్‌ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వైరల్‌ ఫీవర్‌ బాధితులు
2/2

ఫీవర్‌ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వైరల్‌ ఫీవర్‌ బాధితులు

Advertisement
Advertisement