సాక్షి, సిటీబ్యూరో:..... | Sakshi
Sakshi News home page

సాక్షి, సిటీబ్యూరో:.....

Published Sat, Mar 11 2023 8:46 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: త్రైమాసిక పన్ను చెల్లించకుండా పట్టుబడే వాహనాలపై భారీ ఎత్తున పెనాల్టీలు విధించేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వాహనదారులు పెండింగ్‌ల ఉన్న పన్ను బకాయీలపైన స్వచ్చందంగా ముందుకు వస్తే 50 శాతం వరకు అపరాధ రుసుముతో చెల్లించేందుకు అవకాశం ఉంది. కానీ రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం ఏకంగా 200 శాతం వరకు పెనాలిటీల రూపంలో చెల్లించవలసి వస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్టీఏ కొనసాగిస్తున్న ప్రత్యేక తనిఖీలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతుండగా, ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 75 వేలకు పైగా పన్ను చెల్లించని వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల్లో కొన్ని 3 నెలల కాలపరిమితికే పన్ను చెల్లించాల్సి ఉండగా 80 శాతం వాహనాలు కోవిడ్‌ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. చాలా వరకు 9 నెలల నుంచి 18 నెలల వరకు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నాయి. దీంతో వాహనాల నుంచి బకాయిలను రాబట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఫిబ్రవరి నెలాఖరులోనే తనిఖీలకు శ్రీకారం చుట్టినప్పటికీ ఈ నెల ఒకటో తేదీ నుంచి తనిఖీలను ఉధృతం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు పన్ను చెల్లింపులకు గడువు విధించడంతో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 60 మంది మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

తేలికపాటి వాహనాలే అధికం..

గ్రేటర్‌లో సుమారు 5 లక్షల వరకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణా రంగంలో కీలకమైన లారీల్లో చాలా వరకు ఎప్పటికప్పుడు పన్ను చెల్లించి రవాణాశాఖ నుంచి అనుమతి పొందాయి. అలాగే మరో 10 వేలకు పైగా స్కూల్‌ బస్సులు, ప్రైవేట్‌ కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ బస్సులు,తదితర వాహనాలు సైతం సకాలంలో పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చాలా వరకు తేలికపాటి రవాణా వాహనాల కేటగిరీ కిందకు వచ్చే టాటాఏస్‌లు, డీసీఎంలు, మినీ బస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్‌ కాలంలో ఎలాంటి ఆదాయమార్గాలు లేకపోవడంతో వాహనదారులు త్రైమాసిక పన్ను చెల్లించలేకపోయారు. మరోవైపు రెండేళ్ల కాలపరిమితికి ప్రభుత్వం నుంచి మినహాయింపు లభించవచ్చుననే ఉద్దేశంతో చాలా మంది పన్ను చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో ఇప్పుడు భారం పెరిగినట్లు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గతంలోనే రెండు త్రైమాసిక పన్ను వాయిదాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్‌ పరిధిలో సుమారు రూ.13 కోట్ల వరకు బకాయీలను వసూలు చేశారు. ప్రతి రోజు సగటున రూ.60 లక్షలకు పైగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ఎంవీఐకి రూ.7 లక్షల వరకు టార్గెట్‌ విధించారు.

తనిఖీలు ఉధృతం

త్రైమాసిక పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. పూర్తిస్థాయిలో రాబట్టేందుకు కార్యాచరణ చేపట్టాం. పన్ను చెల్లించని వాహనాలపైన తనిఖీలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాం. వాహనదారులు స్వచ్చందంగా ఆన్‌లైన్‌లో లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. తనిఖీ బృందాలు వాహనాలను జప్తు చేసి వెహికిల్‌ చెకింగ్‌ రిపోర్ట్‌ (వీసీఆర్‌) రాస్తే మాత్రం 200 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.

–జె.పాండురంగ నాయక్‌, జేటీసీ, హైదరాబాద్‌

త్రైమాసిక పన్ను వసూళ్లపై

కొనసాగుతున్న ఆర్టీఏ స్పెషల్‌ డ్రైవ్‌

గ్రేటర్‌లో 60 మంది ఎంవీఐలతో ప్రత్యేక బృందాల ఏర్పాటు

కోవిడ్‌ కాలం నుంచి పెండింగ్‌లో పన్ను బకాయిలు

తనిఖీలు మరింత ఉధృతం

హైదరాబాద్‌ జేటీసీ పాండురంగ నాయక్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement