భారీగా గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి పట్టివేత

Published Mon, Mar 20 2023 4:36 AM

పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయి  - Sakshi

లంగర్‌హౌస్‌: నగరంతో పాటు మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌, లంగర్‌హౌస్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి 200 కేజీల గంజాయితో పాటు డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా, మోరంపుడి గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్‌ శ్రీనివాస్‌ వద్ద రాజమండ్రికి చెందిన సత్తిబాబు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్‌లో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహమ్మద్‌ హబీబ్‌, ఏపీ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పలువురు ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకుగాను వీరు డీసీఎం క్యాబిన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో గంజాయి దాచి తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీలేరుకు చెందిన పాండు, నగేష్‌ డీసీఎం డ్రైవర్‌ శ్రీనివాస్‌ను కలిసి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తే రూ.1.20 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. సరుకును నగరానికి తీసుకువచ్చి అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, ఎస్సై శాంతికుమార్‌ దాడిచేసి శ్రీనివాస్‌, సత్తిబాబుతో పాటు నగరానికి చెందిన హబీబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 200 కేజీల గంజాయి, డీసీఎం వాహనం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని లంగర్‌హౌస్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరానికి చెందిన పర్వేజ్‌, జావిద్‌, మహారాష్ట్రకు చెందిన మంగేష్‌, ఏపీకి చెందిన నగేష్‌, పాండు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement