Sakshi News home page

సాధు జంతువుల సంరక్షణ అందరి బాధ్యత

Published Wed, Mar 22 2023 4:28 AM

- - Sakshi

సినీ నటుడు శరత్‌కుమార్‌

సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్‌: సాధు జంతువులు మన పైన చూపించే ప్రేమ అపురూపమైందని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు శరత్‌కుమార్‌ తెలిపారు. వీధి కుక్కల విషయంలో మన నిర్లక్ష్యం వాటి రక్షణకు ఇబ్బందిగా మారిందని, అంతేగాకుండా దీని ప్రభావంతో సామాజికంగా కూడా నష్టం జరుగుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా 20 వేల మంది రేబిస్‌తో మరణిస్తున్నారని, అందులోనూ 15 ఏళ్లలోపు వారే ఎక్కువ ఉన్నారన్నారు. యూఎస్‌లో నివసిస్తున్న తెలంగాణవాసి డాక్టర్‌ శ్రీరెడ్డి ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల సంరక్షణ కోసం నగరం వేదికగా హెర్మియోన్‌ డంకన్‌ రెడ్డి ఫౌండేషన్‌ ప్రారంభించారు. బేగంపేటలోని ది ప్లాజా హోటల్‌ వేదికగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో జంతు ప్రేమికుడు, సినీ హీరో శరత్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం హెర్మియోన్‌ డంకన్‌ రెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డా.శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా జంతువుల కోసం పనిచేస్తున్న వివిధ ఎన్‌జీవోలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. యూఎస్‌లో హెర్మియోన్‌ డంకన్‌ రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత జంతు సంరక్షణ సేవలు కొనసాగిస్తున్నామని, ఆ సేవలను నగరంలోనూ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా వీధి కుక్కలకు మైక్రో చిప్స్‌ను అమర్చే వినూత్న కార్యక్రమాన్ని చేపడతామన్నారు. దీని కోసం జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చిస్తున్నామని, ఈ మైక్రో చిప్‌ల ద్వారా ఆ కుక్కలన్నింటికీ ఒక డేటాబేస్‌ తయారు చేసి వాటికి అవసరమైన వ్యాక్సినేషన్‌, ఆరోగ్య సంరక్షణ ఇతర సేవలను అందిస్తామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో నగరంలో వెటర్నరీ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌, జంతువుల కోసం ప్రత్యేకంగా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తున్నట్లు చెప్పారు. నెక్లెస్‌ రోడ్డు డాగ్‌పార్క్‌లో శుక్రవారం ఉచిత వ్యాక్సినేషన్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

Advertisement
Advertisement