ఆస్తి పన్ను కోసం | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను కోసం

Published Thu, Mar 23 2023 4:30 AM

- - Sakshi

ఆఖరి అస్త్రం

సాక్షి, సిటీబ్యూరో: దాదాపు వారం రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) ముగియనున్న నేపథ్యంలో వీలైనంత మేర ఆస్తిపన్ను వసూలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిత్య సమీక్షలతో.. ఎప్పటికప్పుడు వసూళ్ల లక్ష్యాలు విధించి సంబంధిత సిబ్బందిని ఉరుకులు పరుగులు తీయించిన జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు.. మిగిలిన కొద్ది రోజుల్లోనూ వీలైనంత ఎక్కువ వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఆస్తిపన్ను చెల్లించని ఇళ్ల యజమానులకు కమిషనర్‌ పేరిట ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. ఆస్తిపన్ను బకాయిలపై నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ పడకుండా ఉండేందుకు ఇప్పటి వరకు ఆస్తిపన్ను చెల్లించని వారు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్‌ఎంఎస్‌లు పంపడాన్ని ముమ్మరం చేశారు. త్వరలోనే ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున, మెదటి, రెండో విడతల్లో ఆస్తిపన్ను చెల్లించని వారు వాటిని చెల్లించాలని, బకాయిలపై పడ్డే వడ్డీ లేకుండా చేసుకోండని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది. జీహెచ్‌ఎంసీ సిటిజెన్‌ సర్వీస్‌సెంటర్‌, మీ సేవ కేంద్రం, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌, మైజీహెచ్‌ఎంసీ యాప్‌లలో వేటి ద్వారానైనా, లేదా బిల్‌ కలెక్టర్లకు నేరుగా కానీ ఆస్తిపన్ను చెల్లించాలని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కోరుతోంది. అంతేకాదు.. వ్యక్తిగతంగా ఎవరు చెల్లించాల్సిన బకాయి ఎంత ఉందో తెలిసేలా వారికి వెబ్‌లింక్‌ను సైతం పంపిస్తూ ఆస్తిపన్ను చెల్లించమని విజ్ఞప్తి చేస్తోంది. ఇంకా ఆస్తిపన్ను చెల్లించాల్సిన 4.60 లక్ష ల మంది ఇళ్ల యజమానులకు వీటిని పంపుతోంది.

టార్గెట్‌ రూ.400 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.2వేల కోట్లు కాగా ఇప్పటి వరకు వరకు దాదాపు రూ.1600 కోట్లు వసూలయ్యాయి. మిగతా రూ.400 కోట్ల టార్గెట్‌లో ఎంత వీలైతే అంత వసూలు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వాస్తవానికి గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ వసూళ్లే అయ్యాయి.కానీ.. జీహెచ్‌ఎంసీకి ఉన్న ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నే కావడంతో గడువున్నంత వరకు చివరి క్షణం వరకు కూడా వీలైనంత ఎక్కువ వసూళ్లు చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారు. సర్కిళ్ల వారీగా భారీ బకాయిదారులను గుర్తించి, వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆస్తిపన్ను వసూళ్ల కోసం జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ మేరకు వ్యాపార భవనాల మూసివేతల చర్యలు సైతం చేపట్టారు. ఇప్పటికే కొన్ని షాపులను సీజ్‌ చేశారు.

వారంలో ముగియనున్న ఆర్థిక సంవత్సరం

వసూళ్లు చేసేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు

బకాయిదారులకు కమిషనర్‌ పేరిట ఎస్‌ఎంఎస్‌లు

Advertisement

తప్పక చదవండి

Advertisement