లీచెట్‌ జలాలకు చెక్‌ | Sakshi
Sakshi News home page

లీచెట్‌ జలాలకు చెక్‌

Published Sat, Apr 15 2023 7:18 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు నుంచి వెలువడుతున్న లీచెట్‌ (హానికర వ్యర్థజలాలు)తో అల్లాడుతున్న పరిసర గ్రామాల ప్రజల సమస్యకు ఇక మోక్షం లభించనుంది. ఏళ్లతరబడి ఇక్కడ చెత్త కారణంగా వెలువడుతున్న లీచెట్‌ వల్ల పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ఇతర జలాశయాలు కాలుష్యకాసారాలుగా మారాయి. దీంతో సమస్యకు చెక్‌ చెప్పేందుకు..లీచెట్‌ నిర్వహణ, శుద్ధికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌ శనివారం ప్రారంభం కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.250 కోట్లతో రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను మునిసిపల్‌, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించనున్నారు.

వర్షాలొస్తే ఎన్ని సమస్యలో...
జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్తగుట్టల కారణంగా వర్షాలొచ్చినప్పుడు చెత్తనుంచి కారే లీచెట్‌ పరిసరాల్లోని మల్కారం తదితర చెరువుల్లో చేరేది. దాంతో స్థానిక ప్రజలు తీవ్ర సమస్యలతో అల్లాడేవారు. వర్షాల సమయంలో చెరువులు నిండి ఓవర్‌ఫ్లో అయ్యేవి. ఈ సమస్యను తగ్గించేందుకు కొన్ని కత్రిమ చెరువుల్ని తవ్వి లీచెట్‌ను వాటిల్లోకి పంపించారు. లీచెట్‌ను ట్రీట్‌మెంట్‌ చేసేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ 2017 నుంచి మొదటిస్థాయి ట్రీట్‌మెంట్‌ పనులు చేసింది. రివర్స్‌ ఆస్మోసిస్‌ ప్లాంట్‌ ద్వారా రోజుకు 2 వేల కిలోలీటర్ల సామర్ధ్యంతో పనులు ప్రారంభించి, అనంతరం 4 వేల కిలోలీటర్ల సామర్ధ్యంతో 2021 ఏప్రిల్‌ వరకు ఆ పనులు చేసింది. మల్కారం చెరువులో చేరిన లీచెట్‌లో 11.67 లక్షల కిలో లీటర్లను అలా శుద్ధి చేసినట్లు పేర్కొంది. పై చెరువుల నుంచి వరదనీరు మల్కారం చెరువులో చేరకుండా డైవర్షన్‌ చానల్‌ నిర్మించారు.

2020లో చెత్తగుట్ట క్యాపింగ్‌ పనులు చివరి దశకు చేరుకోవడంతో పూర్తిస్థాయిలో లీచెట్‌ ట్రీట్‌మెంట్‌, శుద్ధి పనుల్ని చేసేందుకు జీహెచ్‌ఎంసీ టెండర్లు పిలిచింది. టెండరు దక్కించుకున్న రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ ఆధునిక సాంకేతికతతో పనిచేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. టెండరు ఒప్పందం మేరకు మల్కారం చెరువుతోపాటు పరిసరాల్లోని ఇతర చెరువులు, కృత్రిమ చెరువుల్లోని లీచెట్‌ను రెండేళ్లలో శుద్ధి చేయాలి. ఘనవ్యర్థాల నిర్వహణ రూల్స్‌–2016 మేరకు ఈ పనులు చేయాలి. అనంతరం మూడేళ్లు చెరువుల్ని సాధారణ చెరువులుగా (లీచెట్‌, ఇతరత్రా కాలుష్య కారకాలు లేకుండా) పునరుద్ధరించాలి.

ఒక వేళ మూడేళ్లలో సాధారణ పరిస్థితికి చేరుకోని పక్షంలో సాధారణ స్థితికి వచ్చేంత వరకు పదేళ్ల దాకా ట్రీట్‌మెంట్‌ పనులు, నిర్వహణ చేయాల్సి ఉంటుంది. డంపింగ్‌ యార్డు, పరిసరాల్లో దాదాపు 8,49,780 కిలోలీటర్ల లీచెట్‌ ఉన్నట్లు అంచనా. కొత్త ప్లాంట్‌ ట్రీట్‌మెంట్‌ సామర్ధ్యం రోజుకు 2 వేల కిలో లీటర్లు. లీచెట్‌ మొత్తం ట్రీట్‌ చేశాక మిగిలే కొద్దిశాతం స్లడ్జ్‌ను ల్యాండ్‌ఫిల్‌ చేస్తారని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. మల్కం చెరువు శుద్ధిని ప్రాధాన్యతగా తీసుకున్న జీహెచ్‌ఎంసీ దాన్ని మూడు దశల్లో పూర్తిచేయనుంది.

Advertisement
Advertisement