పని మనుషుల వివరాలపై కార్ఖానా పోలీసుల ఇంటింటి సర్వే | Sakshi
Sakshi News home page

పని మనుషుల వివరాలపై కార్ఖానా పోలీసుల ఇంటింటి సర్వే

Published Sat, Apr 29 2023 9:16 AM

- - Sakshi

ముంబై నుంచి నగరానికి వచ్చి ఎస్సార్‌నగర్‌లోని బి.రామ్‌ నారాయణ ఇంట్లో పని మనిషిగా చేరిన మహాదేవి రాజేష్‌ కలాల్‌ అదును చూసుకుని 120 తులాల బంగారు, వజ్రాభరణాలు దోచుకుపోయింది. యజమాని వద్ద ఈమె వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు కష్టసాధ్యమైంది. నగరంలో తరచూ చోటు చేసుకుంటున్న ఇలాంటి ఉదంతాలను దృష్టిలో పెట్టుకున్న ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా పోలీసులు అప్రమత్తమయ్యారు. తన పరిధిలో ఉన్న ఇళ్లల్లో పని చేస్తున్న కుక్స్‌, సర్వెంట్స్‌, డ్రైవర్స్‌ తదితరుల వివరాలతో డేటా బేస్‌ రూపొందించడానికి రంగంలోకి దిగారు. దీనికోసం ఇంటింటి సర్వే ప్రారంభించారు. – రసూల్‌పురా

ఇంటింటి సర్వేపై వినూత్న ఆలోచన చేసిన కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ బి.రవీందర్‌ అమలులో పెట్టడానికి సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌ బాబు నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇవి ప్రణాళికబద్ధంగా కాలనీల్లో సంచరిస్తూ సమాచారం సేకరిస్తున్నాయి. ఓ పక్క పనిమనుషుల ఏర్పాటు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలను వివరిస్తూ కాలనీవాసుల్లో అవగాహన కల్పిస్తున్నారు. మరోపక్క వారి ఇళ్లల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. పేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌ తదితరాలతో పాటు ఫొటో కూడా తీసుకుని డేటాబేస్‌ రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ బృందాలు దాదాపు 20 కాలనీల్లో 750 ఇళ్లల్లో పని చేస్తున్న వారి వివరాలు సేకరించింది.

నేరాలకు తావు లేకుండానే..
విజిబుల్‌ పోలీసింగ్‌, బీట్‌ వ్యవస్థ పటిష్ట నిర్వహణతో నేరాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అలాగే అసలు నేరాలకే తావులేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టాం. గతంలో పనిమనుషులుగా ఓ ఇంట్లో చేరిన నేపాలీలు భారీ సొత్తు చోరీ చేసిన ఉదంతాలు ఉన్నాయి. వారి ఆచూకీ ఇప్పటికీ లభించక కేసు కొలిక్కి రాలేదు.
– బి.రవీందర్‌, ఇన్‌స్పెక్టర్‌

ఈ సర్వే ఎంతో ఉపయుక్తం
నమ్మకంగా పనిచేస్తూనే కొందరు పనిమనుషులు, డ్రైవర్లు ఇంటి యజమాని లేని సమయంలో చోరీ చేసిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి నేరాలు మరోసారి జరగకుండా కార్ఖాన పోలీసులు చేస్తున్న ఈ సర్వే ఎంతో ఉపయుక్తం. ఇలాంటి సర్వేలు నగర వ్యాప్తంగా జరగాలి.
– ధీరజ్‌ అగర్వాల్‌, విక్రంపురి

Advertisement

తప్పక చదవండి

Advertisement