ప్రమాదకర రసాయనాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ నుంచి కూల్‌ డ్రింక్స్‌ దాకా.. | Sakshi
Sakshi News home page

ప్రమాదకర రసాయనాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ నుంచి కూల్‌ డ్రింక్స్‌ దాకా..

Published Mon, May 8 2023 8:14 AM

- - Sakshi

రాజేంద్రనగర్‌: ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమను నిర్వహించడమేగాక రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, శీతల పానీయాలు(కూల్‌డ్రింక్స్‌) తయారు చేస్తున్న కర్మాగారంపై ఆదివారం రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్‌, మ్యాంగో డ్రింక్‌, 210 లీటర్ల అసిటిక్‌ యాసిడ్‌, 550 కిలోల మసాలా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాటేదాన్‌ శాంతినగర్‌లో ఫిరోజ్‌, అజిత్‌ గత రెండేళ్లగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మాని ఫుడ్‌ కంపెనీ పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు.

సదరు పరిశ్రమలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు మ్యాంగో, ఆరెంజ్‌ జ్యూస్‌తో పాటు పుడ్‌ మసాలాలను తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో కేవలం వెల్లుల్లి పొట్టును మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో రెండు సంవత్సరాలుగా అల్లమే వాడకుండా తయారు చేస్తున్నారు.

ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పదార్థాలే కనిపించాయి. శీతల పానీయాలను తయారు చేసేందుకు మురుగునీటిని వాడుతున్నారని, ప్లేవర్ల కోసం రసాయనాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండేళ్లుగా నిందితులు ఎలాంటి అనుమానం రాకుండా పరిశ్రమను నిర్వహించడం గమనార్హం. భారీ యంత్రాలతో పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేస్తున్న వీరు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని సరఫరా చేసినట్లు వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకుని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

అధునాతన యంత్రాల వినియోగం...
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు గరంమసాలాలు, శీతల పానీయాల మిక్సింగ్‌, ప్యాక్‌ చేసేందుకు నిందితులు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో ఉన్న ఈ యంత్రాల ద్వారా ప్రతి రోజు రూ. లక్షల విలువైన మసాలాలు, అల్లం పేస్ట్‌, శీతల పానీయాలను తయారు చేస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశామని, స్వాధీనం చేసుకున్న పదార్థాలను ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement