అనురాధ మృతదేహంపై 15 కత్తిపోట్లు | Sakshi
Sakshi News home page

అనురాధ మృతదేహంపై 15 కత్తిపోట్లు

Published Sat, May 27 2023 12:20 PM

- - Sakshi

హైదరాబాద్: ఆర్థిక వివాదాల నేపథ్యంలో దారుణంగా హతమైన మాజీ హెడ్‌–నర్సు వై.అనురాధ మృతదేహంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు తేల్చారు. ఈమె తల, మొండెం, కాళ్లు, చేతులకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు చేయించారు. అనంతరం మృతదేహాన్ని గురువారమే కుటుంబీకులకు అప్పగించారు. అనురాధ తల హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ఉన్న మలక్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని అఫ్జల్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ సమీపంలో మూసీ ఒడ్డున లభించింది.

అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న బి.చంద్రమోహన్‌ విచారణలో ఈ హత్య చైతన్యపురి కాలనీలోని రోడ్‌ నెం.17–డీలో ఉన్న అతడి ఇంట్లోనే జరిగినట్లు తేలింది. ఈ నెల 12 మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ దారుణానికి ఒడిగట్టానని అతడు బయటపెట్టాడు. చంద్రమోహన్‌ అరెస్టుకు సంబంధించి పోలీసులు కోర్టులో సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈ వివరాలతో పాటు అనేక కీలక అంశాలు చేర్చారు.

మరో పెళ్లికి సిద్ధమవడంతోనే...
ఈ ద్వయం దాదాపు 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తన నుంచి తీసుకున్న 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదును తిరిగి ఇవ్వాలంటూ అనురాధ గతకొన్నాళ్లుగా చంద్రమోహన్‌పై ఒత్తిడి చేస్తోంది. దీని నేపథ్యంలోనే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అప్పటికే విడాకులు తీసుకున్న అనురాధ చంద్రమోహన్‌కు దూరంగా వెళ్లి మరో వివాహం చేసుకోవాలని భావించారు. దీనిపై ఓ మాట్రిమోనియల్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ఆమె ఈ విషయం చంద్రమోహన్‌కు చెప్పి డబ్బు, నగలు తిరిగివ్వాలని ఒత్తిడి పెంచారు.

అప్పటికే నగదు, బంగారం అమ్మగా వచ్చిన సొమ్ము మొత్తం షేర్లలో పొగొట్టుకున్న చంద్రమోహన్‌...అనురాధను చంపేస్తే తిరిగి ఇవ్వాల్సిన అవసరముండదని భావించి పథకం వేశాడు. 12న హత్య చేసినా 13వ తేదీ వరకు మృతదేహాన్ని గదిలో బయటే ఉంచాడు. ఆ తర్వాతే కట్టర్‌ తెచ్చి ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. తన కూతురితో పాటు బంధువులు ఎవరితోనూ అనురాధకు సరైన సంబంధాలు లేకపోవడం ఇతడికి కొంత వరకు కలిసి వచ్చింది. ఈ కారణంగానే అనురాధను చంపినా.. శవం కనిపించకుండా చేస్తే ఎవరూ ప్రశ్నించరని అతడు భావించాడు.

అప్పటికే తలను పారేసిన అతడు కాళ్లు, చేతులతో మరో గార్బేజ్‌ కవర్‌ సిద్ధం చేసుకున్నాడు. అనురాధను చంపిన తర్వాత ఆమె ఫోన్‌ ద్వారానే ఆస్ట్రేలియాలో ఉన్న ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్‌ చేశాడు. ఆమె చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్నట్లు అనేకరకాలుగా చాటింగ్‌ చేసి అనురాధే చేస్తున్నట్లు నమ్మించాడు. దీంతో ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు. నగరంలో మృతదేహం ముక్కలు పారేసిన తర్వాత అనురాధ సెల్‌ఫోను ఉత్తరాఖండ్‌ వరకు తీసుకువెళ్లి ధ్వంసం చేయాలని భావించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement