కోటిన్నర కొట్టేశారు.. | Sakshi
Sakshi News home page

కోటిన్నర కొట్టేశారు..

Published Sat, Jun 10 2023 4:14 AM

-

హిమాయత్‌నగర్‌: సైబర్‌ నేరగాళ్లు పెట్టుబడి, ట్రేడింగ్‌ల పేరుతో నగరవాసులను నమ్మించి నట్టేట ముంచుతున్నారు. శుక్రవారం నగరానికి చెందిన పలువురు వ్యక్తులు భారీగా మోసపోయి న్యాయం కావాలంటూ సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సౌత్‌సెంట్రల్‌ రైల్వే, సికింద్రాబాద్‌ జోన్‌లో రైల్వే ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్న అధికారికి టెలిగ్రామ్‌ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ‘గోల్డ్‌ షార్ట్‌ టర్మ్‌ ట్రేడింగ్‌’ చేస్తుంటానంటూ మాట కలిపాడు. తొలుత రూ.50వేలతో గోల్డ్‌ ట్రేడింగ్‌ చేస్తే ఒకే రోజులో రూ.2లక్షలు లాభం పొందొచ్చన్నారు. తొలిసారి సదరు అధికారికి రూ.2 లక్షలు లాభం ఇచ్చి నమ్మకాన్ని కలిగించారు. ఆ తర్వాత అత్యాశకు పోయిన అతడి నుంచి అందిన కాడికి దోచేశారు. పలు దఫాలుగా రూ.73లక్షలు ట్రేడింగ్‌ చేపించి ఒక్క రూపాయి లాభం ఇవ్వకపోగా రూ.73లక్షలు రావాలంటే టాస్క్‌లు అధిగమించాలని మరిన్ని లక్షలు పెట్టాలంటూ ఒత్తిడి చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు.

అమీర్‌పేటకు చెందిన మరో వ్యక్తికి యూట్యూబ్‌ లైక్స్‌, కామెంట్‌, షేర్‌, సబ్‌స్క్రిప్షన్‌ చేస్తే ప్రతిరోజూ రూ.30వేల నుంచి రూ.50వేలు సంపాదించొచ్చని మరో వ్యక్తి వల వేశాడు. ఖాళీగా ఉంటూ ఫోన్‌ ద్వారానే కదా అని ఆశపడ్డ అతను లైక్స్‌, షేర్‌, సబ్‌స్క్రిప్షన్‌, కామెంట్‌లు చేశాడు. ఇందుకు రెండు పర్యాయాలు డబ్బు ఇచ్చారు. నమ్మకం కలగడంతో ఆ తర్వాత ‘క్యూ కాయిన్‌ సిటీ డాట్‌ టాప్‌’ అనే యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయించారు. వారు చెప్పిన విధంగా రూ.70లక్షలు పెట్టి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. ఇదే తరహాలో మోసపోయిన మరో ఇద్దరు కూడా సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.

బంగారం ట్రేడింగ్‌ పేరుతో టోకరా

ఉన్నదంతా ఊడ్చేసి, వేధింపులు

రైల్వే ఇన్‌స్ట్రక్టర్‌ నుంచి రూ.73లక్షలు

యూట్యూబ్‌ లైక్స్‌లో రూ.70లక్షలు

మరో ఇద్దరి నుంచి రూ.10లక్షలు స్వాహా

Advertisement
Advertisement