రియల్‌ దందా... 60రోజుల్లో రిజిస్ట్రేషన్‌ లేదా.. డబ్బు వాపస్‌ | Sakshi
Sakshi News home page

రియల్‌ దందా... 60రోజుల్లో రిజిస్ట్రేషన్‌ లేదా.. డబ్బు వాపస్‌

Published Sun, Jun 25 2023 9:34 AM

- - Sakshi

హైదరాబాద్: నగర శివారులో కొత్త వెంచర్‌ అని ప్రీ లాంచ్‌లో భాగంగా తక్కువ ధరకే ప్లాట్స్‌ ఇస్తున్నామంటూ ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. నగరానికి చెందిన దాదాపు 150 మంది నుంచి రూ.50 కోట్లు దోచేసింది. చెప్పిన సమయానికి ప్లాట్స్‌ని రిజిస్ట్రేషన్‌ చేయకుండా కాలయాపన చేస్తున్న క్రమంలో బాధితులు న్యాయం కోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎస్‌)ను ఆశ్రయించారు. ముషీరాబాద్‌కు చెందిన కిరణ్‌కుమార్‌, ప్రభాత్‌లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

30 రోజుల్లోనే రిజిస్ట్రేషన్‌ అంటూ..
‘ఫార్చున్‌ 99 హోమ్స్‌’ కంపెనీ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామంలో ‘ది ఎన్‌సీఎస్‌ ఫార్చున్‌ మెడి సిటీ ప్రాజెక్ట్‌’ అనే పేరుతో వంద ఎకరాల్లో కొత్త వెంచర్‌ వేస్తున్నామంటూ ప్రచారం చేపట్టింది. ఆ ప్రాంతంలోని 50/97, 98, 99, 100, 101, 102–477 సర్వే నంబర్లలోని స్థలంలో వెంచర్లు వేస్తున్నట్లు చెప్పడంతో దాదాపు 150 మంది వినియోగదారులు ఆకర్షితులయ్యారు.

కేవలం 30 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ వీరి నుంచి దాదాపు రూ.50కోట్లకు పైగా డబ్బును 2020లో ‘ఫార్చున్‌ 99 హోమ్స్‌’ వసూళ్లు చేసింది. వారిచ్చిన 30 రోజుల గడువులో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరగకపోవడంతో బాధితులంతా కలిసి సంస్థ ప్రతినిధులు రోశిరెడ్డి, విజయ్‌బాబులను సంప్రదించారు. హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి రాకపోవడం కారణంగా తాము 30 రోజుల గడువులో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయలేకపోయామనే సమాధానం ఇచ్చారు. హెచ్‌ఎండీఏ అనుమతి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

60రోజుల్లో రిజిస్ట్రేషన్‌ లేదా.. డబ్బు వాపస్‌
మాయ మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్న క్రమంలో బాధితులంతా కలిసి మరోసారి 2022 అక్టోబర్‌లో రోశిరెడ్డి, విజయ్‌బాబులను నిలదీశారు. ‘రీపీ లాంచ్‌’ పేరుతో తక్కువ ధరకే ప్లాట్స్‌ను విక్రయించేందుకు ముందుకొచ్చాం.. అయితే హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి రావడం లేదు. కేవలం 60రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తాం ఒకవేళ చేయలేకపోతే మీ డబ్బు మీకు వాపస్‌ ఇస్తామని పంపేశారు.

ఆ సమయంలో కొందరు కస్టమర్లకు ఇచ్చిన చెక్కులు సైతం ఇటీవల బౌన్స్‌ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 150 మందిని మోసం చేసి వారి నుంచి రూ.50 కోట్లు పైగా సొమ్మును స్వాహా చేసిన రోశిరెడ్డి, విజయ్‌బాబులు ఇప్పుడు వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారని, తాము వెళ్లి కలిసినా సరైన సమాధానాలు చెప్పడం లేదని బాధితులు తెలిపారు. దీనిపై సమగ్రమైన విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement
Advertisement