మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర | Sakshi
Sakshi News home page

మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర

Published Mon, Jul 3 2023 9:16 AM

- - Sakshi

హైదరాబాద్: గాంధీనగర్‌లో నివసించే మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి, ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్‌ కమిషనర్‌ శామ్యూల్‌ ప్రసాద్‌ సరెళ్ళ ఇంట్లో జరిగిన భారీ చోరీ వ్యవహారం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు ముషీరాబాద్‌ పోలీసులు తేల్చారు. దుండిగల్‌ పోలీసుస్టేషన్‌ మాజీ క్రైమ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) ఎస్‌.కృష్ణ సూత్రధారిగా సాగిన ఈ చోరీ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచిన అధికారులు కేసులో కుట్ర కోణానికి సంబంధించిన అంశాన్నీ జోడిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య మూడుకు చేరింది.

శామ్యూల్‌ ఫిర్యాదు మేరకు గత నెల 14న నమోదు చేసిన ఈ కేసులో పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 328, 380 కిందే ఆరోపణలు చేశారు. పోలీసులకు చిక్కిన నిందితుడు సురేందర్‌ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈ చోరీలో పాత్ర ఉన్నట్లు గుర్తించి రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీశైలం, అంబర్‌పేటకు చెందిన ఆశీర్వాదంలను శుక్రవారం అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్టు సందర్భంలోనే ఐపీసీలోని 120 (బీ) సెక్షన్‌నూ (కుట్ర) కేసులో జోడించారు. శామ్యూల్‌ ఇంటి నుంచి ఆస్తి పత్రాలు కోట్టేయాలనే కుట్రలో వీళ్లనీ భాగస్వాములుగా పేర్కొన్నారు.

కాగా ఈ కేసులో సురేందర్‌ అరెస్టు అనంతరం అతడు తస్కరించిన స్థిరాస్తి పత్రాలను ముషీరాబాద్‌ పోలీసులు సూరారంలోని కృష్ణ ఇంటి వద్ద అతడి కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని సీజ్‌ చేయాలని నిర్ణయించారు. ఎస్‌ఐ కృష్ణ ఈ నేరం చేయించడం వెనుక కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సురేందర్‌ పోలీసు కస్టడీ పూర్తయింది. శ్రీశైలం, ఆశీర్వాదాలను కూడా న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని ముషీరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. వీళ్లని విచారించిన తర్వాతే ఈ కేసుపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement