Hyderabad: చికిత్స కోసం వెళ్తే రూ.85 లక్షల డైమండ్‌ రింగ్‌ మాయం.. | Sakshi
Sakshi News home page

Hyderabad: చికిత్స కోసం వెళ్తే రూ.85 లక్షల డైమండ్‌ రింగ్‌ మాయం.. చివరకు డ్రైనేజీ పైపులో

Published Mon, Jul 3 2023 9:16 AM

డ్రైనేజీ పైపులైన్‌ నుంచి వెలికి తీసిన డైమండ్‌ రింగ్‌  - Sakshi

హైదరాబాద్: క్లినిక్‌లో చోరీ చేసిన డైమండ్‌ రింగ్‌ను నిందితురాలు బాత్రూంలోని వెస్ట్రన్‌ కమోడ్‌లో వేయడంతో.. పైపులైన్‌ను తవ్వి దానిని వెలికితీసిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో నివసించే ప్రముఖ వ్యాపారి నరేంద్ర కుమార్‌ అగర్వాల్‌ కోడలు తనిష్క అగర్వాల్‌ గత నెల 23న మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ దసపల్లా హోటల్‌ సమీపంలోని ఎఫ్‌ఎంఎస్‌ స్కిన్‌ అండ్‌ డెంటల్‌ క్లినిక్‌కు చికిత్స కోసం వచ్చారు. ఆ సమయంలో చేతికి ఉన్న ఉంగరంతో పాటు బ్రాస్‌లైట్‌ తొలగించాలని స్కిన్‌ థెరపిస్ట్‌ లాలస ఆమెకు సూచించింది.

ఆ మేరకు తనిష్క తన వేలికి ఉన్న రూ.85 లక్షల విలువైన డైమండ్‌ రింగ్‌తో పాటు చేతికి ఉన్న బ్రాస్‌లైట్‌ను పక్కన పెట్టారు. చికిత్స పూర్తయిన తర్వాత మర్చిపోయి ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి చూసుకోగా ఉంగరం, బ్రాస్‌లైట్‌ కనిపించకపోవడంతో మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి వెంటనే క్లినిక్‌కు పరుగులు తీశారు. అక్కడ ఉద్యోగులు తమకేమి తెలియదని బుకాయించారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి ఉద్యోగులను వేర్వేరు కోణాల్లో విచారించారు. తనిష్కకు చికిత్స నిర్వహించిన స్కిన్‌ థెరపిస్ట్‌ లాలసను తమదైన శైలిలో రెండు రోజుల పాటు విచారించారు.

దీంతో పోలీసులకు చిక్కుతానేమోననే భయంతో లాలస ఈ నెల 1న తాను పర్సులో దాచిపెట్టిన డైమండ్‌ రింగ్‌ను బాత్రూం కమోడ్‌లో పడేసింది. పోలీసులు గట్టిగా విచారించగా రింగ్‌ను కమోడ్‌లో వేసిన విషయాన్ని వెల్లడించింది. దీంతో పోలీసులు కూలీల సహాయంతో డెంటల్‌ క్లినిక్‌లో ఉన్న రెండు బాత్రూంలను రోజంతా తవ్వారు. ఆదివారం తెల్లవారుజామున డ్రైనేజీ పైపులైన్‌లో ఓ మూలకు చిక్కుకున్న రింగ్‌ కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దురుద్దేశంతోనే లాలస ఈ డైమండ్‌ రింగ్‌ను చోరీ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

Advertisement
Advertisement