‘పార్కింగ్‌’ వాహనాలే లక్ష్యంగా.. | Sakshi
Sakshi News home page

‘పార్కింగ్‌’ వాహనాలే లక్ష్యంగా..

Published Thu, Sep 21 2023 4:40 AM

- - Sakshi

రాజేంద్రనగర్‌: పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ఓ ముఠాను రాజేంద్రనగర్‌ సీసీఎస్‌, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని.. మరొకరు జైలులో ఉన్నట్లు డీసీపీ జగదీశ్వర్‌ రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌ డీసీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన ఏసీ మెకానిక్‌ మహ్మద్‌ అఖిల్‌ ఖాన్‌, ఫలక్‌నుమా తీగలకుంటకు చెందిన మహ్మద్‌ ముజమీల్‌, శాస్త్రిపురం రిజ్వాన్‌ కాలనీకి చెందిన మీర్‌ సోహెబ్‌ అలీ, మహరాష్ట్రకు చెందిన సోహేల్‌, ఫలక్‌నుమాకు చెందిన మోయిజ్‌లు స్నేహితులు. వీరంతా పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకొని 40 దొంగతనాలకు పాల్పడ్డారు. గతంలో 29 కేసుల్లో పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చారు. అనంతరం నిందితులు కామాటిపురా, అబిడ్స్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, ఫిల్మ్‌నగర్‌, కొత్తూరు, నిజామాబాద్‌, టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగలించారు. వీటి నంబర్లను మార్చి నాందేడ్‌లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. వాహనాలను అఖిల్‌, ముజమీల్‌ తమ నివాసాల్లో పార్కు చేశారు. మైలార్‌దేవ్‌పల్లిలో పార్కు చేసిన ద్విచక్ర వాహనం కనిపించడం లేదని సలీం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పక్కా సమాచారంతో సీసీఎస్‌, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బుధవారం ఉదయం ఆరాంఘర్‌ వద్ద ద్విచక్ర వాహనంపై ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో దొంగతనాల వివరాలు తెలపడంతో 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ దొంగతనం కేసులో సోహేబ్‌ అలీని ఇప్పటికే శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు జైలుకు పంపారని..సోహెల్‌, మోయిజ్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదుకు సిఫారసు చేస్తామన్నారు.

బైకు దొంగల ముఠా ఆటకట్టు

11 ద్విచక్రవాహనాల స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

Advertisement
Advertisement