నగరంలో నగారా సందడి | Sakshi
Sakshi News home page

నగరంలో నగారా సందడి

Published Tue, Oct 10 2023 4:58 AM

- - Sakshi

షెడ్యూలు విడుదలతో గ్రేటర్‌లో ఎలక్షన్‌ వార్‌

గ్రేటర్‌ నగరంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వాతావరణం మారిపోయింది. చలికాలమే అయినప్పటికీ ఎన్నికల షెడ్యూలు వెలువడటంతో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు? ఈ వారమా..ఇంకో వారమా? అంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను మధ్యాహ్నం ప్రకటించనుందంటూ ఉదయాన్నే వెలువడిన వార్తతో అందరూ ఆసక్తిగా తేదీల కోసం ఎదురు చూశారు. ఎన్నికల షెడ్యూలు విడుదలతోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొత్తగా చేయడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రారంభమైన వాటిని మాత్రం కొనసాగించవచ్చు. ఏదైనా అత్యవసరం అయిన పక్షంలో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి అనుమతితో అమలు చేయవచ్చు. దీంతో ఇప్పటి వరకు గృహలక్ష్మి, బీసీబంధు తదితర ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ప్రజలు నిట్టూర్పులు విడిచారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు లాటరీ ద్వారా ఎంపికై న వారికి మాత్రం ప్రక్రియ కొనసాగించవచ్చునని అధికారులు పేర్కొన్నారు. ఇక రాజకీయ నేతలు ఓట్ల వేట ఎలా చేయాలోనని పథక రచనలు ప్రారంభించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

అమల్లోకి కోడ్‌..అభివృద్ధి పనులకు బ్రేకులు

అభ్యర్థుల ప్రకటనతో దూసుకుపోతున్న కారు

కాంగ్రెస్‌, బీజేపీల్లో ఒడవని టికెట్ల కిరికిరి

టికెట్లు దక్కనందున అంతో ఇంతో అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగించి ఇప్పటికే వారు పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా బీఆర్‌ఎస్‌ చేయగా, ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీల్లో ఇంకా అభ్యర్థుల ఎంపికే పూర్తి కాలేదు. కాంగ్రెస్‌ దాదాపు 70 మంది పేర్లు ఖరారు చేసినట్లు చెబుతుండగా, అందులో గ్రేటర్‌కు సంబంధించి సగం నియోజకవర్గాలు కూడా లేవు. అభ్యర్థుల ఖరారు కోసం ‘స్క్రీనింగ్‌’ ఇంకా జరుగుతోంది. అది పూర్తయి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించి, ప్రకటించేందుకు ఇంకెంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. బీజేపీది దాదాపుగా ఇదే పరిస్థితి. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి కాలేదు. పూర్తిచేసి ఎప్పుడు వెల్లడిస్తారో స్పష్టత లేదు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీల్లోనూ అభ్యర్థుల్ని ప్రకటించాక టిక్కెట్లు రాని వారి నుంచి వెల్లువెత్తే అసమ్మతులు, ఎగురవేసే తిరుగుబాటు జెండాలను ఎలా నివారించగలుగుతారో తెలియదు. ఆ రెండు పార్టీలకు అలా ఇంటిపోరు మొదలవనుండగా, బీఆర్‌ఎస్‌ ఇక అధికారికంగానే ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనుంది. కాంగ్రెస్‌, బీజేపీలు ఇప్పుడు ప్రచారం చేసినా, ‘మా అభ్యర్థి ఈయన..ఈయననే గెలిపించండి’ అని చెప్పే పరిస్థితి లేదు. ఆ పార్టీల ఆ పరిస్థితిని బీఆర్‌ఎస్‌ తనకు మరింత అనుకూలంగా మలచుకోనుంది. ఇక్కడ అభ్యర్థులు లేరు..గెలిస్తే ఎవరు సీఎం అవుతారో చెప్పే పరిస్థితి లేని ఆ పార్టీలను గెలిపిస్తే చేసేదేమీ ఉండదని చెప్పేందుకు తమకు మంచి ఆయుధం దొరికిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు వ్యాఖ్యానించారు. నియోజకవర్గాలపై ఇక పూర్తి ఫోకస్‌ పెట్టనున్నారు. అనుచరులు, అనుయాయులు, మందీమార్బలంతో దుమ్ము దుమారం రేపేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉంది.

Advertisement
Advertisement