విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించం | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించం

Published Mon, Oct 30 2023 5:02 AM

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి  - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. స్టాటిస్టిక్‌ సర్వైలెన్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తదితర నిఘా బృందాల అధికారులకు ఆదివారం ఖైరతాబాద్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార సరళి పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను నిరోధించడం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల వ్యయం విషయంలో ఎలక్షన్‌ కమిషన్‌ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని.. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిఘా బృందాలు సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను విధిగా పాటించాలని, అన్ని పార్టీలు, అభ్యర్థులతో నిబంధనలకు అనుగుణంగా సమదృష్టితో వ్యవహరించాలన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

విధినిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను నిర్ధారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిఘా బృందాల దృష్టిని మళ్లించేందుకు పలువురు చేసే తప్పుడు ఫిర్యాదుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల వ్యయం, ప్రచార సరళిపై నిఘా బృందాలు అనునిత్యం నిఘా ఉంచాలని, ఈ మేరకు పూర్తి స్థాయిలో బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారికి సమకూర్చిన వాహనాలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పీటీజీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా నిఘా బృందాల పని తీరును కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలోనూ లైవ్‌ ఫీడింగ్‌ పరిశీలన ఉం టుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెక్‌ పోస్టుల వద్ద పీటీజీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు

తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు అనవసర ఇబ్బందులు ఏర్పడకుండా సంయమనంతో వ్యవహరించాలని, నగదును జప్తు చేసిన సందర్భాల్లో తగు రీతిలో పంచనామా నిర్వహించి తప్పనిసరిగా రసీదులు అందించాలని ఆదేశించారు. తగిన ఆధారాలను చూపించి నగదును విడిపించుకునే వెసులుబాటు ఉంది అనే విషయాన్ని వివరించాలని, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ దిలీప్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ కమిటీ గురించి తెలియజేయాలని సూచించారు. ఆయా పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ జారీ చేసిన రేట్‌ కార్డును అనుసరిస్తూ లెక్కింపు చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని, ఎన్నికల నియమావళిని తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ చైర్మన్‌, జెడ్పీ సీఈఓ దిలీప్‌ కుమార్‌, నోడల్‌ అధికారులు వెంకట్‌ రెడ్డి, ధాత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

కలెక్టర్‌ భారతి హోళికేరి ఆదివారం ఎల్బీనగర్‌ అ సెంబ్లీ నియోజకవర్గంలో గుర్తించిన అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను (403 404 , 405) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని నివాసితులతో మాట్లాడారు. ఎ లాంటి ఆందోళన చెందకుండా, ప్రశాంతంగా.. స్వే చ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూ చించారు. కలెక్టర్‌ వెంట హయత్‌నగర్‌ ఎఈఆర్‌ఓ, డిప్యూటీ కమిషనర్‌, ఎల్బీనగర్‌ అడిషనల్‌ డీసీపీ, ఎస్‌హెచ్‌ఓ, సంబంధిత అధికారులు ఉన్నారు.

పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి

ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలి

నిఘా బృందాలకు కలెక్టర్‌ భారతి హోళికేరి దిశానిర్దేశం

Advertisement
Advertisement