బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ విజయవంతం | Sakshi
Sakshi News home page

బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ విజయవంతం

Published Wed, Nov 8 2023 4:40 AM

- - Sakshi

ఓపెన్‌ టాప్‌ జీపులో జనం మధ్యకు ప్రధాని పూల వర్షం కురిపించిన అభిమానులు మోదీ నామస్మరణతో మార్మోగిన ఎల్బీస్టేడియం కమలం పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం 

బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ విజయవంతం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ తలపెట్టిన బీసీ ఆత్మగౌరవ సభ విజయవంతమైంది. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై బీసీల ఐక్యతను చాటి చెప్పారు. ‘జై శ్రీరాం.. జయహో.. వందే మాతరం’ నినాదంతో సభా ప్రాంగణం మార్మోగింది. బీసీ సీఎం నినాదంతో మంగళవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ‘బీసీ ఆత్మగౌరవ సభ’కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారర్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంతత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లతో కలిసి ప్రధాని ఓపెన్‌ టాప్‌ జీపుపై నిలబడి.. జనం మధ్య ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనాల్లో, జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత మధ్య కనిపించే ప్రధాని అనూహ్యంగా కార్యకర్తల మధ్యకు రావడంతో అభిమానులు ఉబ్బితబ్బియ్యారు. బారికేడ్లకు అవతలి వైపున ఉన్న పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనపై పూల వర్షం కురిపించారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు.

ఫోన్‌ లైట్లు వెలిగించి.. మద్దతు పలికి.. .

‘సమ్మక్క సారలమ్మలకు.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికీ’ అంటూ తెలుగులో మోదీ ప్రసంగాన్ని ఆరంభించారు. ‘కుటుంబ సభ్యుల్లారా.. బీసీ ఆత్మ బంధువుల్లారా.. ఈ సభలో నేను భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎల్బీస్టేడియంతో నాకు ఎంతో సంబంధం ఉంది. నాటి సభలో నా ప్రసంగం కోసం టికెట్‌ పెట్టారు. దేశ చరిత్రలో అది కొత్త ప్రయోగం. ఇదే గ్రౌండ్‌లో ప్రజలు ఆశీర్వదించడంతో నేను ప్రధాని అయ్యాను. ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. పేదలకు ఐదు కేజీల బియ్యం పంపణీ పథకం చేపట్టి ఐదేళ్లు అవుతోంది. ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సభకు హాజరైన పేద, మధ్య తరగతి ప్రజలంతా మద్దతు తెలుపాలని కోరుతున్నా’నని చెప్పగానే కార్యకర్తలు, అభిమానులు తమ జేబులల్లోని స్మార్ట్‌ఫోన్లను బయటికి తీసి.. టార్చ్‌ లైట్లు వెలిగించి మోదీకి మద్దతు ప్రకటించారు.

సీఎం.. సీఎం అనే నినాదాలతో హోరెత్తి..

పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌లు ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కృష్ణ యాదవ్‌, మర్రి శశిధర్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు వేదికపై ఆసీనులై.. ప్రధాని మోదీతో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. మోదీ రాక సందర్భంగా పోలీసులు ఎల్బీస్టేడియం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిజాం కాలేజీ, బషీర్‌బాగ్‌, నాంపల్లి, అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

శంఖం పూరిస్తున్న బీజేపీ కార్యకర్త

హేళన చేసే పార్టీలను భూస్థాపితం చేస్తాం..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీసీలను హేళన చేసి మాట్లాడుతున్నారు. బీసీలను హేళన చేసే పార్టీలను భూస్థాపితం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. బీజేపీ ఓ చాయ్‌ వాలాను దేశానికి ప్రధానమంత్రిని చేసింది. తెలంగాణలో మూడు కోట్ల మంది ఓటర్లు ఉంటే.. వారిలో 1.60 కోట్ల మంది ఓటర్లు బీసీలే. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎంను చేయనుంది. బీసీని సీఎం చేస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్‌కు లేదు. ఐదు తరాలుగా ఆ పార్టీ బీసీలను మోసం చేస్తూనే ఉంది. ఢిల్లీలో మోదీ.. తెలంగాణలో బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్తాం. బీసీలంతా ఏకమవ్వాల్సిన ఆవశ్యత ఏర్పడింది. అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో క్యారెక్టర్‌ ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. – మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌

గాంధీ భవన్‌ కాదు.. రెడ్డి భవన్‌..

కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు తీరని అన్యాయం చేసింది. రాజస్థాన్‌ డిక్లరేషన్‌లో 34 సీట్లు ఇస్తామని.. 24 సీట్లే ఇచ్చింది. అది కూడా ఓడిపోయే పాతబస్తీలో బీసీలకు టికెట్లు ఇచ్చింది. అది గాంధీ భవన్‌ కాదు.. రెడ్డి భవన్‌. రెడ్లకే అక్కడ ప్రాధాన్యం ఉంది. బీసీలకు కనీస గౌరవం లేదు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపది మురర్ము వంటి దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతిగా నియమించింది. కేంద్ర కేబినెట్‌లో 27 మంది ఓబీ సీలకు ప్రాధాన్యం కల్పించింది. ప్రస్తుత ఎన్నికల్లో బీసీలకే బీజేపీ మెజార్టీ టికెట్లు కేటాయించింది. వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలందరిపై ఉంది. బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీ. ఆ పార్టీ కూడా బీసీలకు సరైన పప్రాధాన్యమివ్వలేదు. మహిళా బిల్లులో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలి. బీసీ జనగణన చేపట్టి, దామాషా ప్రకారం చట్ట సభల్లో ప్రాధాన్యం కల్పించాలి.

– జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

1/6

2/6

ప్రధాని మోదీ, కుత్బుల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం పరస్పర నమస్కారాలు
3/6

ప్రధాని మోదీ, కుత్బుల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం పరస్పర నమస్కారాలు

4/6

5/6

6/6

Advertisement

తప్పక చదవండి

Advertisement