Hyderabad: హోరెత్తిస్తున్న సోషల్‌ మీడియా ప్రచారం.. సినిమా రిలీజ్‌లను తలదన్నేలా.. | Telangana Political Leaders Social Media Campaigns In On Swing Ahead Of Assembly Elections 2023, See Details - Sakshi
Sakshi News home page

Hyderabad: హోరెత్తిస్తున్న సోషల్‌ మీడియా ప్రచారం.. సినిమా రిలీజ్‌లను తలదన్నేలా..

Published Wed, Nov 8 2023 4:40 AM

- - Sakshi

ఇంటింటి గడపకు నడక, వీధి గోడల మీద పోస్టర్లు, మౌత్‌ టాక్‌.. మైక్‌ స్పీకర్లు.. ఇదీ ఆనాటి ఎన్నికల ప్రచార హంగామా. ప్రస్తుతం తరం మారింది. ఆధునికత పుణికిపుచ్చుకున్న ఈ– తరం ప్రచారమంతా ఆన్‌లైన్‌ వేదికగా హోరెత్తిస్తోంది. ప్రస్తుత ప్రచార వ్యవహారాలు ఒక్క పోస్టుతో, ఒకే ఒక్క షేర్‌తో లక్షల మందికి చేరువైతోంది. యువ రాజకీయ నాయకులు, టెక్నాలజీ పైన అవగాహన ఉన్న నేతలు ఈ ఆన్‌లైన్‌ ప్రచారాన్ని బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటున్నారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌) తదితర సోషల్‌ యాప్స్‌లో ఇప్పటికే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న నేతలు తమ సోషల్‌ ప్రచారంలో ముందుండగా.. ఇవేమీ లేని నాయకులు ఫాలోవర్స్‌ ఎక్కువగా ఉన్న సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లను తమ తాత్కాలిక వారధులుగా వాడుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీల పెద్ద సినిమా రిలీజ్‌ను తలదన్నే విధంగా ఉన్నాయి ఎన్నికల సోషల్‌ ప్రచారమంతా.
–సాక్షి, సిటీబ్యూరో

మీమ్స్‌తో మెసేజ్‌.. రీల్స్‌తో రిక్వెస్ట్‌..
ప్రస్తుత ఎన్నికల వేళ ఎక్స్‌ (ట్విట్టర్‌) ప్రాబల్యం బాగా పెరిగింది. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాలోనూ ప్రచారం జోరుగా ఉన్నప్పటికీ పలు సామాజిక మాధ్యమాల ఆంక్షల విషయంలో ఎక్స్‌కు ఎన్నో మినహాయింపులున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులు, పార్టీలు ఎక్స్‌ను ఫాలో అవుతున్నారు. షార్ట్‌ అండ్‌ స్వీట్‌గానే తక్కువ సమాచారంతోనే ఫొటోలు, వీడియోలతో ఎక్స్‌ ఎన్నికలకు వారధిగా మారింది. ఫేస్‌బుక్‌లోని పేజ్‌, గ్రూప్‌ అనే వెసులుబాటుతో కూడా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రతి పార్టీ ప్రత్యేక ఫేస్‌బుక్‌ పేజీలను తెరచి, అందులో వేల సంఖ్యలతో కార్యకర్తలను చేర్చుకుని తమ సోషల్‌ ప్రచారాన్ని ఊపందించాయి.

యూట్యూబ్‌ స్టార్స్‌., ఇన్‌స్టా రీల్స్‌..
లక్ష్లల సంఖ్యలో ఫాలోవర్స్‌ ఉన్న యూట్యూబ్‌ చానళ్లకు ఎన్నికల వేళ గిరాకీ చాలా పెరిగింది. దీనికి నిదర్శనం.. ఈ మధ్యనే మంత్రి కేటీఆర్‌ తెలంగాణలో మస్తు మైలేజ్‌ ఉన్న ‘మై విలేజ్‌ షో’ అనే యూట్యూబ్‌ చానల్‌ బృందంతో పల్లెటూరిలో వంటా వార్పు అంటూ ఓ వీడియో రిలీజ్‌ చేయడం. పల్లెటూర్ల నుంచి పట్నం వరకు గంగవ్వకు ఉన్న క్రేజ్‌ను మంత్రి కేటీఆర్‌ ఎన్నికల వేళ భలే వడుకున్నారంటూ స్పందన వస్తోంది. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఎఫ్‌ఎం వినే వాళ్లు లక్షల్లోనే ఉంటారు. ఈ వేదికను సైతం కేటీఆర్‌ వదల్లేదు అంటే సోషల్‌ ప్రచారం ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు.

ఇన్‌స్టా రీల్స్‌కు లక్షల్లో రీచ్‌ ఉండటంతో అన్ని పార్టీలు ఈ రీల్స్‌ను షేర్‌ చేస్తున్నాయి. కాంగ్రేస్‌ పార్టీకి చెందిన రేవంత్‌ రెడ్డి, కోమటి రెడ్డి వంటి అభ్యర్థులు ప్రత్యేకంగా రూపొందించుకున్న ఎన్నికల పాటలు సోషలో మీడియాలో వైరల్‌గా మారాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన ‘గులాబీ జెండలే రామక్క’ అనే పాటను విదేశాల్లోని తెలుగు వారు సైతం రీల్స్‌తో అదరగొడుతున్నారు. వాట్సాప్‌ యూనివర్సిటీ అని ముందు నుంచే పేరున్న బీజేపీ తన పంథాను కొనసాగిస్తూనే ఉంది. కాంగ్రెస్‌, బీజేపీలకు సంబంధించి ఢిల్లీ వేదికగా నిర్వహించే సోషల్‌ మీడియా యాప్స్‌ మంచి ప్రజాదరణ పొందుతున్నాయి.

ఏడాది నుంచే కసరత్తు..
స్తుత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది నుంచే సోషల్‌ మీడియా ప్రచార ప్రణాళికలను మొదలు పెట్టాయి వివిధ పార్టీలు. ఇందులో భాగంగా ఎన్నికల కోసమే ప్రత్యేకంగా పార్టీలు, అభ్యర్థులు తమ వ్యక్తిగత సోషల్‌ మీడియా అకౌంట్ల, గ్రూపులను ప్రారంభించాయి. గత ఏడాది, రెండేళ్లలో తమ అకౌంట్లకు ఫాలోవర్స్‌ను పెంచుకునేలా శ్రద్ధ తీసుకున్నాయి. ఫాలోవర్స్‌ను ఆకర్షించడానికి అధికార పార్టీ వర్గాలు తమ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వాడుకోగా, ప్రతిపక్ష పార్టీలో ప్రభుత్వ వైఫల్యాలను, సామాజిక వ్యతిరేకతలపై దృష్టి పెట్టాయి.

ఈ విషయంలో రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్‌ఎస్‌, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలు చాలా ఫోకస్డ్‌గా పని చేశాయి. ప్రజలను ఆకర్షించడంలో ఫలితాలను సైతం పొందాయి. కొన్ని విషయాల్లో సోషల్‌ మీడియా యుద్ధాలే జరిగాయి. ఈ సోషల్‌ మీడియా ప్రచారం ఎలా ఉన్నప్పటికీ ఈ వేదికల్లో చక్కర్లు కొట్టే సమాచారంలో ఫేక్‌ న్యూస్‌ ఎక్కువుందని తరచూ ఫిర్యాదులు అందడంతో ఎన్నికల వేళ పోలీసు శాఖ కూడా పటిష్టంగానే ఆంక్షలు విధించింది.

Advertisement
Advertisement