‘డబుల్‌’ ఇళ్ల పేరిట మోసం | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ఇళ్ల పేరిట మోసం

Published Sat, Nov 18 2023 6:40 AM

-

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం పేదలకు అందించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తూ గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అమాయకులను మోసం చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, హౌసింగ్‌ డివిజన్‌–2 పి.వి.రవీందర్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. అయితే కొందరు తమకు కూడా కేటాయింపులు జరిగాయటూ సంబంధింత సర్టిఫికెట్లతో అధికారులను ఆశ్రయించారు. ఆ సర్టిఫికెట్లను పరిశీలించగా నకిలీవని తేలాయి. ఈ సర్టిఫికెట్లు రెండేళ్ల కిత్రం జారీ అయినట్లు ఉన్నాయి. దీనిపై మారోజు నవీన్‌కుమార్‌ అనే బాధితుడికి ఎక్కడి నుంచి ఈ సర్టిఫికెట్లు సంపాదించారని అధికారులు ప్రశ్నించగా అతడు సరైన సమాధానం చెప్పడం లేదు. అలాగే షేక్‌ సల్మా అనే మహిళను ప్రశ్నించగా 2020లో తాను రూ.2 లక్షలు రెండు వాయిదాలలో చెల్లించానని, తనకు జీబా రహమాన్‌ అలియాస్‌ ముంతాజ్‌ అనే మహిళ సునంద అనే మరో మహిళను పరిచయం చేసిందని, ఆమె ద్వారా సర్టిఫికెట్‌ పొందినట్లు తెలిపింది. అధికారులు జీబా రహమాన్‌తో బాధితురాలిని మాట్లాడించే ప్రయత్నం చేయగా ఫోన్‌ మధ్యలోనే కట్‌ చేసిందని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసులను కోరారు.

వెలుగులోకి నకిలీ కేటాయింపు సర్టిఫికెట్లు

సీసీఎస్‌లో జీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదు

Advertisement
Advertisement