దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి | Sakshi
Sakshi News home page

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి

Published Fri, Nov 24 2023 4:40 AM

- - Sakshi

హైదరాబాద్: ఐటీ కంపెనీలకు నిలయంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. టెకీలతో పాటు ఐటీ నిపుణులు, అక్షరాస్యుల సంఖ్య కూడా ఎక్కువే. 600కుపైగా ఐటీ కంపెనీలు వందలాది హోటళ్లు ఉన్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులు, ఆతిథ్య రంగంలోనూ ఉద్యోగులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. దేశలోని అన్ని రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు చెందిన వారు నియోజకవర్గంలో ఉన్నారు. దేశంలోని అన్ని భాషలు మాట్లాడే వారు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్‌ కోర్టులు ఉన్నాయి.

భిన్న సంస్కృతులకు నిలయమైన శేరిలింగంపల్లి మినీ భారత్‌గా చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థులే కాదు కుబేరులైన ఓటర్లకూ కొదవలేదు. పారిస్‌ నగరాన్ని తలపించే ఆకాశ హర్మ్యాలు, కేబుల్‌ బ్రిడ్జి, లింకు రోడ్లు, సెంట్రల్‌ యూనివర్సిటీ, నేషనల్‌ ఉర్థూ యూనివర్సిటీ, సైబరాబాద్‌ కమిషనరేట్‌, స్టార్‌ హోటళ్లకు కేంద్రం. నియోజకవర్గంలో 852 కాలనీలు ఉన్నాయి. 100కు పైగా స్లమ్స్‌ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్లమ్స్‌ కాలనీలుగా రూపాంతరం చెందాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. గెలుపు తమదంటే తమదంటూ మూడు పార్టీల అభ్యర్థులూ ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఒక్కసారి ఈ నియోజవర్గంపై దృష్టి సారిస్తే..

అందరి చూపూ.. శేరిలింగంపల్లి వైపే

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి ఒకటి. ఇక్కడ మొత్తం 7,32,506 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,88,482, మహిళలు 3,43,875, ఇతరులు 149 మంది ఉన్నారు. ఉత్తర భారతీయుల ఓట్లు దాదాపు లక్షన్నర ఉన్నట్లు అంచనా. సీమాంధ్రకు చెందిన దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక ఓటర్లు, మైనార్టీ ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. భిన్న సంస్కృతులకు నిలయమైన శేరిలింగంపల్లిలో గెలిచేదెవరనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఎవరి ధీమా వారిదే..
► 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ తన సామాజిక ఓటర్లతో పాటు, మైనార్టీ ఓటర్లపై నమ్మకం పెట్టుకున్నారు. ఆయన 2014లో టీడీపీ నుంచి 80 వేల మెజారిటీతో, 2018లో టీఆర్‌ఎస్‌ నుంచి 42 వేల ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌ మూడు సార్లు కార్పొరేటర్‌గా పని చేయడంతో మాదాపూర్‌, హఫీజ్‌పేట్‌ డివిజన్లలో మంచి పట్టు ఉంది. ఆ రెండు డివిజన్లలోని మైనార్టీలు, తన సొంత సామాజికవర్గంతో పాటు మారిన పరిస్టితుల్లో సెటిలర్స్‌ ఓట్లపై నమ్మకం పెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఎం.రవి కుమార్‌ యాదవ్‌ నార్త్‌ ఇండిన్స్‌ ఓట్లపై నమ్మకం పెట్టుకున్నారు. 50 వేలకు పైగా నార్త్‌ ఇండియన్స్‌ ఓట్లను ఎన్‌రోల్‌ చేయించారు. నార్త్‌ ఇండియన్స్‌తో పాటు తన సామాజిక వర్గం ఓట్లు, తన తండ్రి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ అదనపు బలంగా చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా తమిళ, కన్నడ ఓటర్లపై ఫోకస్‌ చేస్తున్నారు. ఎవరికి వారే గెలుపు తమనే వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అంటున్న ముగ్గురు కుబేరులు
శేరిలింగంపల్లిలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు కుబేరులే. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ రూ.44 కోట్ల స్థిరాస్తులు, కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌ తన పేరిట రూ.113 కోట్ల అస్తులు, బీజేపీ అభ్యర్థి ఎం.రవి కుమార్‌ యాదవ్‌ రూ.151 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు. అభ్యర్థులు ప్రచారంలో పోటీ పడుతూ ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోడ్‌ షోలకు పోటీపడి జన సమీకరణ చేయడం గమనార్హం. పెద్ద నియోజకవర్గం కావడంతో అభ్యర్థుల ఖర్చు కూడా భారీ మొత్తంలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రోడ్‌ షోను బీజేపీ అభ్యర్థి ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ కేటీఆర్‌ రోడ్‌ షోలో భారీ జన సమీకరణ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌ రాహుల్‌ గాంధీ రోడ్‌ షో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Advertisement
Advertisement