ఎవరు ఎక్కువిస్తే వాళ్లకే.. | Sakshi
Sakshi News home page

ఎవరు ఎక్కువిస్తే వాళ్లకే..

Published Wed, Nov 29 2023 4:44 AM

- - Sakshi

బీజేపీ అతిరథ మహారథులు
కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ప్రధానమంత్రితో సహా పలువురు కేంద్రమంత్రుల్ని రంగంలోకి దింపింది. పలువురు మంత్రులు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరపున సభలు, రోడ్‌షోల ద్వారా ప్రచారం చేశారు. ప్రధాని మోదీ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి కాచిగూడ వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు. మహేశ్వరం తుక్కుగూడలో బహిరంగ సభలో ప్రసంగించారు. కొద్ది వారాల ముందు పరేడ్‌గ్రౌండ్‌లో ‘మాదిగల విశ్వరూపసభ’లో, ఎల్‌బీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్‌ సభలోనూ పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్‌షా ఖైరతాబాద్‌, అంబర్‌పేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌,ఉప్పల్‌, తదితర నియోజకవర్గాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు.

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కంటోన్మెంట్‌, మేడ్చల్‌, కార్వాన్‌ నియోజకవర్గాల్లో, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ జూబ్లీహిల్స్‌లో, నగరానికే చెందిన కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో, మరో కేంద్రమంత్రి స్మృతిఇరానీ ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో, తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌లలో రోడ్‌షోలతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ యోగి ఎల్‌బీనగర్‌, గోషామహల్‌లలో, అసోం సీఎం హేమంత్‌విశ్వశర్మ మలక్‌పేట నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముషీరాబాద్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తదితరులు గ్రేటర్‌లో బీజేపీ గెలుపు కోసం నగరానికి వచ్చారు.

కాంగ్రెస్‌ హేమాహేమీలు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ముషీరాబాద్‌, నాంపల్లి, జూబ్లీహిల్స్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రియాంక గాంధీ మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో, కర్నాటక సీఎం సిద్ధరామయ్య ముషీరాబాద్‌లో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ముషీరాబాద్‌, సనత్‌నగర్‌లలో, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఎల్‌బీనగర్‌లో, విజయశాంతి సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌లలో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయం కోసం ప్రచారాలు చేశారు. రోడ్‌షోల్లో పాల్గొన్నారు. పరిసరాల్ని హోరెత్తించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దాదాపుగా గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీ నిరుద్యోగులతో కలిసి చిక్కడపల్లిలో చాయ్‌ తాగుతూ, బావర్చీ హోటల్‌లో ముచ్చట్లు పెడుతూ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ఫుడ్‌డెలివరీ బాయ్స్‌, ఆటోవాలాలతో భేటీ అయ్యారు. వీరితోపాటు పలువురు ఏఐసీసీ నేతలు, పలువురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు నగరంలో మకాం వేసి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు.దీంతో ఆయాప్రధాన రహదారులతోపాటు గల్లీల్లోనూ సందడి నెలకొంది. ఒకరిపై మరొకరు పదునైన విమర్శలతో పరిసరాలు దద్దరిల్లేలా చేశారు.

ఓట్ల వేటలో..
ప్రచారం ముగియడంతో అన్నిపార్టీల్లోనూ పంపణీలపై దృష్టి సారించారు. ఓట్ల వేటలో బిజీగా మారారు. కాలనీ సంఘాలు, కుల, మహిళా సంఘాలతో కలిసి రహస్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే మద్యం బాటిళ్లు, నగదును పోగేసిన ద్వితీయశ్రేణి నేతలు వాటిని పంపిణీ చేస్తూ బిజిబిజీగా ఉన్నారు.. స్థానిక వ్యాపారులు, అనుచరులతో ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యూపీఐ ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు.

ఎవరు ఎక్కువిస్తే వాళ్లకే..
ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పార్టీలు డబ్బు పంపిణీ చేస్తున్నాయి. అన్ని పార్టీల దగ్గర డబ్బు తీసుకొని ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓట్లు వేసేందుకు ఓటర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యువతులను ఆకట్టుకునేందుకు స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వంటి బహుమతులను సైతం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement