భూసార పరిరక్షణపై అవగాహన పెరగాలి | Sakshi
Sakshi News home page

భూసార పరిరక్షణపై అవగాహన పెరగాలి

Published Wed, Dec 6 2023 4:44 AM

- - Sakshi

తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్‌ పులిగారి గోవర్ధన్‌ రెడ్డి

కవాడిగూడ: అధిక దిగుబడుల కోసం ప్రమాదకరమైన రసాయనాలను వాడటం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతోందని, తద్వారా భవిష్యత్‌ తరాలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించలేమని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్‌ పులిగారి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. భూసార పరిరక్షణపై ప్రతిఒక్కరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అంతర్జాతీయ భూసార దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఇషా ఫౌండేషన్‌, కవాడిగూడ ఇంగ్లిష్‌ యూనియన్‌ హైస్కూల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘భూమి సారాన్ని పరిరక్షించాలి–భూమిని కాపాడుకోవాలి’ అని కోరుతూ ట్యాంక్‌బండ్‌పై కొమరం భీం విగ్రహం వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇషా ఫౌండేషన్‌ సభ్యులు, వందలాది మంది పాఠశాల విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు వాడడం ప్రమాదకరమన్నారు. ఈ రకమైన సాగులో పండే పంటలు మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని, దీన్ని గుర్తించి భూసార పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం చేయడానికి రైతులకు రాయితీలు కల్పించి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ స్వర్ణలతా రెడ్డి, ఇషా ఫౌండేషన్‌ ప్రతినిధులు అభిరామ్‌, రేఖ, చక్రవర్తి, కృష్ణవేణి, వందన, ప్రతిభ, అనురాధ, విజయభాస్కర్‌, సత్యనారాయణ, సాంబవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement