కాబోయే సీఎంపై కోటి ఆశలు | Sakshi
Sakshi News home page

కాబోయే సీఎంపై కోటి ఆశలు

Published Thu, Dec 7 2023 4:42 AM

- - Sakshi

ట్రాఫిక్‌ ఇక్కట్లు తగ్గాలి
నాలా సమస్యలు తీరాలి
ప్రజా రవాణా పెరగాలి
సొంతింటి కల నెరవేరాలి
నడక దారులుండాలి
మెట్రోను విస్తరించాలి
ఆ అమాత్యులు ఎవరో?

కొత్త ప్రభుత్వానికి బల్దియా నివేదిక

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ స్థితిగతుల గురించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక స్థితిగతులతో పాటు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ), వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్‌ఎన్‌డీపీ), సమగ్ర రహదారుల నిర్వహణ పథకం(సీఆర్‌ఎంపీ), తదితర పనుల వివరాలతోపాటు వాటిల్లో ఇప్పటికే పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, కొనసాగుతున్న పనుల వివరాలు.. వాటికయ్యే వ్యయం వివరాలు తదితరాలతో నివేదికలో పొందుపరిచారు. దీంతో పాటు గత ఐదేళ్లుగా జీహెచ్‌ఎంసీ ఆదాయం, వ్యయం, ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాలు తదితర వివరాలు నివేదించారు. జీహెచ్‌ఎంసీలోని మొత్తం పోస్టులు, భర్తీ కావాల్సిన ఖాళీ పోస్టుల వివరాలు తదితరాలను సైతం నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

సాక్షి, సిటీబ్యూరో: దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఆ ప్రభుత్వంపై గ్రేటర్‌ ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాలేదు. గ్రేటర్‌ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తిరిగి ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కంటే భిన్నంగా కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పని చేయాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ పట్టించుకోని అంశాలను, చేయని పనుల్ని చేయాల్సి ఉంది. మరోవైపు అది చేపట్టిన పనుల్ని కొనసాగించాల్సి ఉంది.

● కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉన్నందున వాటిని అమలు చేస్తూనే.. మరోవైపు నగరానికి కొన్ని పనుల్ని ప్రాధాన్యతతో త్వరితంగా పూర్తి చేయాల్సి ఉంది. హైదరాబాద్‌ను డల్లాస్‌గా మారుస్తానన్న సీఎం కేసీఆర్‌ రాష్ట్ర సచివాలయం ముందు, సీఎం క్యాంపు కార్యాలయం ముందు కూడా రోడ్లు చెరువులుగా మారుతున్న దుస్థితిని మార్చలేదని విమర్శించిన రేవంత్‌రెడ్డికి నగరంలోని వరదల సమస్యలు తెలుసు. ఎంపీగా ఉన్న ఆయన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశాలకూ ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా హాజరై పలు పర్యాయాలు ప్రజావాణిని వినిపించారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గం మల్కాజిగిరి సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

● నగర ప్రజలు కోరుకుంటున్న ప్రాధాన్యతాంశాల్లో కూడా నాలాలున్నాయి. వాటి ఆధునికీకరణను సత్వరమే పూర్తిచేసి వరద సమస్యలనుంచి గట్టెక్కించాలి. ఈ సమస్య పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్‌ఎన్‌డీపీ కింద పనులు చేపట్టినప్పటికీ పూర్తికాలేదు. వీటితో పాటు గ్రేటర్‌లోని 185 చెరువుల్ని పునరుద్ధరిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. ఎస్‌ఎన్‌డీపీ పనులే కొనసాగిస్తారో లేక కొత్త పథకం చేపడతారో తెలియదు. ఏం చేసినా ప్రజలకు కావాల్సింది సమస్య పరిష్కారం. ప్రశ్నించే గొంతుగానే కాకుండా క్షేత్రస్థాయి సమస్యలు కూడా తెలిసి ఉండటంతో నగర ప్రజలు తమ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించగలదని ఆశపడుతున్నారు. పార్టీ మేనిఫెస్టోలోనూ పలు కార్యక్రమాలున్నాయి.

నగర వాసులు ఆశిస్తున్నవి ఇవీ..

● నగరంలో ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టినా, మెట్రో అందుబాటులోకి వచ్చినా ట్రాఫిక్‌ చిక్కులు తీరలేదు. వీటిని పరిష్కరించాలి. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి సెట్విన్‌ బస్సుల ద్వారా లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ పెంచాలి. మెట్రో మార్గాన్ని నగరం నలువైపులకూ విస్తరించాలి. ఇస్నాపూర్‌, శంషాబాద్‌, హయత్‌నగర్‌, యాదాద్రిల దాకా పొడిగించాలి.

● ప్రధాన రహదారుల నిర్వహణ ఫర్వా లేకపోయినప్పటికీ, అంతర్గత రోడ్ల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. అన్ని కాలనీలు, బస్తీలకు మంచి రోడ్లు ఉండాలి.

● గ్రేటర్‌లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏడు లక్షలమంది ఉన్నారు. దరఖాస్తు చేసుకోని వారూ ఎందరో ఉన్నారు. నగరంలోని పేదల అతి పెద్ద సమస్య ఇది. వారి సంపాదనలో సగం ఇంటి అద్దెలకే పోతోంది. ఈ అంశానికి ప్రాధాన్యతనిచ్చి పేదల కలలు సాకారం చేయాలి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలి.

● ఉద్యోగాల కల్పన కచ్చితంగా అమలు చేయాలి. కోచింగ్‌ల కోసం జిల్లాల నుంచి వచ్చి ఎందరో నిరుద్యోగులు హాస్టళ్ల ఫీజులు భరించలేకపోతున్నారు. ఉచితంగా లేదా తక్కువ అద్దెలతో వారి కోసం కొన్ని హాస్టళ్లు నిర్మించాలి.

● పనుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా యాప్స్‌ ద్వారానే స్టేటస్‌ను తెలుసుకునేలా, పనిచేయని అధికారులపై చర్యలు తీసుకునేలా సాంకేతిక విధానాలు అమలు చేయాలి. ఇటీవల ఏర్పాటైన వార్డు కార్యాలయాలు సవ్యంగా పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఆరు గ్యారంటీలను, మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేయడంతో పాటు నగర మేనిఫెస్టోకు తగిన ప్రాధాన్యతనివ్వాలి.

నిరుద్యోగులకు హాస్టళ్లు ఉండాలి

రేవంత్‌రెడ్డి ఇంటి దారిలో.. చక చకా పనులు

బంజారాహిల్స్‌: ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బుధవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 44లోని ఆయన ఇంటికి దారితీసే అన్ని మార్గాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ తదితర మరమ్మతులు చేపట్టారు. రహదారులకు ఇరువైపులా ఉన్న చెత్తను, చెట్ల కొమ్మలను తొలగించారు. ఆయన ఇంటికి అంతరాయం లేని కరెంటు కోసం కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. మరోవైపు వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టారు. డ్రెయినేజీ ఓవర్‌ఫ్లో లేకుండా జలమండలి సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మరోవైపు పోలీసులుపికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అనుమానితులు అటువైపు రాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి రేవంత్‌రెడ్డి స్వగృహానికి చేరుకోనున్నారు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర కేబినెట్‌లో గ్రేటర్‌ జిల్లాల నుంచి అమాత్య పదవి ఎవరిని వరిస్తుందోనంటూ చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ కై వసం చేసుకోలేక పోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడు స్థానాలను గెలుచుకుంది. ఇందులో ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా ఆయన క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అభిమానులు, పార్టీ కేడర్‌లో జోరుగా చర్చ సాగుతోంది. అలాగే వికారాబాద్‌ నుంచి మరో నేతకు అవకాశం కల్పించాలని భావిస్తే.. రామ్మోహన్‌రెడ్డి ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది.

1/2

2/2

Advertisement
Advertisement