లేనట్టా? | Sakshi
Sakshi News home page

లేనట్టా?

Published Mon, Dec 11 2023 6:10 AM

- - Sakshi

ఉన్నట్టా..

జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన జీఓ 111పై సందిగ్ధత నెలకొంది. గత ప్రభుత్వం ఈ జీఓను తొలగిస్తున్నట్లు రెండుసార్లు ప్రకటించింది. దీని స్థానంలో మరో జీఓను సైతం తెచ్చారు. కానీ సాంకేతికంగా 111 జీఓ ఇంకా అమల్లోనే ఉన్నట్లు అప్పటి ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో స్పష్టం చేసింది. మరోవైపు ఈ జీఓ తొలగింపు నేపథ్యంలో దాని పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఈ క్రమంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జీఓ 111పై ఎలా ముందుకు వెళ్లనుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

–సాక్షి, సిటీబ్యూరో

పరిరక్షణపై నీలినీడలు..

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల పరీవాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం 111 జీఓను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీఓ పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీఓ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. మరోవైపు దీనిని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీఓకు విఘాతం కలిగించే చర్యలపై కేసులు నడుస్తున్నాయి.

● ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీఓను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎత్తేయనున్నట్లు పేర్కొంది. జలాశయాల పరిరక్షణ కోసం జీఓ 69 తెచ్చారు. వీటి పరీవాహక ప్రాంతాన్ని 10 కిలో మీటర్లకు తగ్గించడంతో పాటు మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. 82 గ్రామాల పరిధిలో వివిధ జోన్‌ల కింద భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ.. అధికారికంగా జీఓ 111 రద్దు కాకపోవడంతో కొంతకాలంగా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.

అడ్డగోలుగా అనుమతులు..

మరోవైపు 111 జీఓను ఎత్తివేసినట్లు గత ప్రభుత్వం ప్రకటించడంతో హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం పలు గ్రామాల్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలకు అనుమతులను ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణపై ఎలాంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండానే వట్టినాగులపల్లి వంటి కొన్ని గ్రామాల్లో కేవలం 10 రోజుల్లో 70కి పైగా అనుమతులను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణాలకు పర్యావరణ సంస్థ అయిన ఈపీటీఆర్‌ఐ నుంచి ఆమోదం లభించిన తర్వాతే అనుమతులను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కానీ అలాంటి ఆమోదం లేకుండానే అప్పటి ఒక కీలకమంత్రి, హెచ్‌ఎండీఏలో కీలకమైన ఉన్నతాధికారి ఒత్తిడితో అఽధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ప్రణాళికా విభాగం ప్రక్షాళన..

మరోవైపు కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వం హెచ్‌ఎండీఏపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లేఅవుట్‌లు, భవన నిర్మాణాలు, పరిశ్రమల అనుమతులు, మహానగర అభివృద్ధి వంటివి హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడంతో దీన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రణాళికా విభాగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇద్దరు ప్రణాళికా అభివృద్ధి అధికారుల్లో ఒకరి పరిధిని రెండు జోన్‌లకు తగ్గించారు. నాలుగు జోన్‌లలో ఒకరికి మూడు కేటాయించి, ఒక అధికారిని ఒక జోన్‌కే పరిమితం చేశారు. దీంతో హెచ్‌ఎండీఏలో ఇంకా ఎలాంటి మార్పులు రానున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.

111 జీఓను ఎత్తివేసినట్లు ప్రకటించిన గత ప్రభుత్వం

అధికారికంగా మాత్రం రద్దు కాలేదన్నది స్పష్టం

ఇప్పటికే పలుచోట్ల భారీగా అక్రమ నిర్మాణాలు

పది రోజుల్లో 70కి పైగా అనుమతులిచ్చిన హెచ్‌ఎండీఏ

కొత్త ప్రభుత్వం నిర్ణయంపైనే అందరి చూపులు

Advertisement
Advertisement